గార్బేజ్ స్టేషన్ల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటించాలి. ఆయా పట్టణాలు, నగరాల్లో చెత్తను, మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ఇప్పటికే ఉన్న సౌకర్యాలు, వసతులు.. ఇంకా కల్పించాల్సిన సదుపాయాలపై నివేదిక తయారు చేయాలి. అవసరమైన వసతులు లేని చోట్ల వెంటనే కల్పించి సమర్థవంతంగా నిర్వహించాలి. మురుగునీటి శుద్ధి, వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ప్రతి మున్సిపాలిటీ నూరు శాతం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ప్లెక్సీలను పూర్తిగా నిషేధించింది. నవంబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలి. వ్యాపారులు ప్లాస్టిక్ నుంచి వస్త్రం వైపు మళ్లేందుకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు వారికి రుణాలు ఇప్పించి అండగా నిలవాలి. ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించే వారికి ప్రభుత్వం నుంచే వడ్డీ రాయితీ కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యంపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. గార్బేజ్ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదని, ఇలాంటి ప్రాంతాల్లో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. చెత్త నిర్వహణలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నామో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్‌మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌తో పాటు సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ తదితర అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే చేపట్టిన పనుల ప్రగతి, మెరుగైన ఫలితాలు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతి మున్సిపాలిటీలోను వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియ అమలు తీరుపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు. అన్ని యూఎల్బీల్లోనూ (అర్బన్ లోకల్ బాడీస్) ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఉందా? లేదా? అన్నదానిపై సంబంధిత అధికారులు నిరంతరం పరిశీలించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌పై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్
కృష్ణా వరద గోడకు సుందరీకరణ
► ఏటా వచ్చే వరదలకు కృష్ణా నది పొంగి విజయవాడ నగర పాలక సంస్థలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యేవి. ఈ ఇబ్బందులను తప్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్ వాల్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ గోడకు ఆనుకుని ఉన్న ప్రాంతాల నుంచి మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రిటైనింగ్ వాల్ బండ్‌ను చెట్లు, విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దాలి.
► విజయవాడ నుంచి గన్నవరం విమనాశ్రయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా చేపట్టిన సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. అంబేడ్కర్ పార్కుకు వెళ్లే రోడ్లను సైతం అందంగా తీర్చిదిద్దాలి. విశాఖపట్నం నగరంలో సైతం సుందరీకరణ పనులు చేపట్టాలి.
► వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయండి. మళ్లీ డ్రైవ్ చేపట్టి, మే 31 నాటికి అన్ని రోడ్లనూ బాగు చేయాలి.
జగనన్న కాలనీల్లో నీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం
► ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కాలనీల నిర్మాణం పూర్తయ్యేలోగా వాటిలో మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలి. ప్రాధాన్యత క్రమంలో నీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి తర్వాత మురుగు నీటి శుద్ధి కేంద్రాలను అందుబాటులోకి తేవాలి.
► రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లపై అధికారులు శ్రద్ధ పెట్టాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక లే అవుట్‌ను తీర్చిదిద్దాలి. ఈ పనుల ప్రగతిపై ఉన్నతాధికారులు జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమం పట్టణ ప్రాంతాల్లో చేపట్టడంపై దృష్టి సారించాలి.
► వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో సాధికారిత కోసం కృషి చేయాలి. ఏటా 45 ఏళ్లు నిండిన మహిళల్లో అర్హత ఉన్న వారికి ఈ పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేయాలి. ఈ డబ్బుతో వారు స్వయం ఉపాధి పొందేలా తగిన చర్యలు తీసుకోవాలి. అర్హత సాధించిన తొలి ఏడాదిలోనే వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించడం ద్వారా వారిలో సంపూర్ణ సాధికారితకు కృషి చేయాలి.
► ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ లక్ష్మీశా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment