అవినీతికి తావివ్వద్దు | Chief Minister YS Jagan in high level review | Sakshi
Sakshi News home page

అవినీతికి తావివ్వద్దు

Published Sat, Apr 22 2023 5:22 AM | Last Updated on Sat, Apr 22 2023 2:42 PM

Chief Minister YS Jagan in high level review - Sakshi

పౌరులకు సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలి. అవినీతిపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్‌ తరహాలో ప్రదర్శించాలి. మానవ ప్రమేయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి.. వాటిని అమల్లోకి తీసుకు రావడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. అప్పుడే ప్రజలకు సత్వరం మంచి సేవలు అందుతాయి. ఉద్యోగుల్లో సమర్థత పెరగడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుంది. వచ్చే సమీక్షా సమావేశం  నాటికి మంచి మార్పులు కనిపించాలి. – సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ శాఖ లోనూ అవినీతికి తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రిజిస్ట్రే­షన్లు, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాలు, మండల కార్యాల­యాలు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా అన్ని చోట్ల కూడా అవినీతికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి నిరోధక శాఖను మరింత క్రియాశీలకంగా ఉంచాలని సూచిం­చారు. ఆదాయార్జన శాఖల మంత్రులు, ఉన్న­­తా­ధి­కారు­లతో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ.. ఆదాయాలనుఆర్జించే శాఖల యంత్రాంగంలో మెరుగైన విధానాలు అమలు చేయడం ద్వారా సమర్థత పెంచాలని ఆదేశించారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. తద్వారా లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా చక్కటి సేవలు అందుతాయని, ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. వీటన్నింటిపై అధ్యయనం చేసి, వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు మరింతగా దృష్టి సారించాలని చెప్పారు.

ఇందులో భాగంగా యూనివర్సిటీలు, కాలేజీలు, విద్యా సంస్థల వద్ద కచ్చితంగా టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉండేలా హోర్డింగ్స్‌ ఉంచాలని, డ్రగ్స్‌ నివారణ కార్యక్రమాలు, టోల్‌ ఫ్రీ నంబర్‌ పనితీరుపై ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకోసారి మాక్‌ డ్రిల్‌ చేపట్టాలని ఆదేశించారు. రవాణా శాఖలో మెరుగైన విధానాలు తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సందర్భంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర లక్ష్యాలు చేరుకున్నామనే విషయాన్ని, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను వివిధ శాఖలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధి 
  గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనపరిచిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉందన్నారు. కర్ణాటకలో 27.51 శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 25.29 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు.
  2022–23లో రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ.51,481 కోట్లుగా 93.24 శాతం లక్ష్యాన్ని చేరుకుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.  
  లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణ ద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతల పట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పని తీరును మెరుగు పరుచుకుంటున్నామన్నారు.
  స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ధి చెందినట్టుగా ఆ శాఖ అధికారులు తెలిపారు. ఏడాదికేడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తోందన్నారు. 2018–19లో ఈ శాఖ ఆదాయం రూ.4,725 కోట్లు కాగా, 202–223 నాటికి రూ.8071 కోట్లకు చేరిందని తెలిపారు. 

గనుల ఆదాయంలో 26 శాతం వృద్ధి
  గత ఏడాదితో పోల్చితే గనుల ఆదాయంలో 26 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు వివరించారు.  గనులు ఖనిజాల శాఖలో 2022–23లో రూ.4,500 కోట్లు లక్ష్యం కాగా, రూ.4,756 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఆర్థిక ఏడాది రూ.6 వేల కోట్ల మేరకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

తగ్గిన లిక్కర్, బీరు వినియోగం
2018–19తో పోలిస్తే 2022–23లో లిక్కర్, బీరు వినియోగం 12.61 శాతం తగ్గుముఖం.
2018–19లో 384.3 లక్షల కేసుల లిక్కర్‌ వినియోగం.
2022–2౩లో 335.9 లక్షల కేసుల లిక్కర్‌ వినియోగం.
2018–19లో 277.1 లక్షల కేసుల బీరు వినియోగం.
2022–23లో 116.7 లక్షల కేసులు బీరు వినియోగం.
2018–19తో పోలిస్తే 2022–23లో 57.87 శాతం తక్కువగా బీరు వినియోగం.

   రవాణా శాఖలో 2022–23లో ఆదాయం రూ.4,294.12 కోట్లు వచ్చిందని, తద్వారా 95.42 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. 2018–19లో రూ.3,224.98 కోట్ల ఆదాయం ఉండగా, 2023–24 లో రూ.6,999.42 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

   ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం (ఎక్సైజ్‌) నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, స్పెషల్‌ సీఎస్‌లు నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రజత్‌ భార్గవ, భూగర్భ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పీసీసీఎఫ్‌ వై.మధుసూదన్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి గుల్జార్, రవాణా శాఖ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా, పురపాలక శాఖ కమిషనర్‌ కోటేశ్వరరావు, స్టాంప్, రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్‌ రామకృష్ణ, సేల్స్‌ టాక్స్‌ స్పెషల్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్, అడిషనల్‌ డీజీలు ఎన్‌.సంజయ్, రవిశంకర్‌ అయ్యన్నార్, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, మైన్స్‌ డైరెక్టర్‌ వి.జి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement