CM Jagan Mandate In Review Education Department In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఏపీలోనూ విదేశీ కోర్సులు.. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్‌ రాష్ట్రంలోనూ అమలు

Published Fri, Jan 20 2023 2:10 AM | Last Updated on Fri, Jan 20 2023 9:39 AM

CM Jagan Mandate In Review Education Department in Andhra Pradesh - Sakshi

విద్యార్థులకు సర్టిఫికేషన్‌ కోర్సుల ద్వారానే ఎంప్లాయ్‌మెంట్‌ పెరుగుతుంది. సోలార్‌ పార్క్‌లు, సోలార్‌ మోటార్లు, ప్యానల్స్‌ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరతను అధిగమించేలా ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ సెంటర్లు అందుబాటులో ఉండాలి. వీటిలో ఈ దిశగా కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలి. వచ్చే జూన్‌ నాటికి ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలి. కళాశాలలకు అనుమతుల విషయంలో యూనిఫామ్‌ పాలసీ ఉండాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: విదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు అక్కడి విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను రాష్ట్రంలోని విద్యార్థులకు కూడా అందు­బాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా కోర్సులు మన విద్యార్థులకు ఏమేరకు గరిష్ట ప్రయోజనం కల్పిస్తాయో పరిశీలించి,  వాటిని ఇక్క­డ కూడా అమల్లోకి తీసుకురావడంపై దృష్టి సారిం­చాలని సూచించారు. తద్వారా రాష్ట్ర విద్యా­ర్థులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు.

గురు­వారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిగ్రీ కోర్సులు అభ్య­సిస్తున్న విద్యార్థుల నైపుణ్యాలను పెంచాలని, ఈ దిశగా వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో సమగ్రత తేవాలని సూచించారు. ఉన్నత విద్యా సంస్థల్లోని కోర్సుల పాఠ్య ప్రణాళికను ఆయా జిల్లాల్లో ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్‌ ఓరియెంటెడ్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్‌ కోర్సులను ఈ పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలని చెప్పారు.

ప్రఖ్యాత కాలేజీలు అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలను కూడా పరిశీలించి, రాష్ట్రంలో కూడా అటువంటి పాఠ్య ప్రణాళికలను అమలు చేయాలన్నారు. స్వయం ఉపాధిని కల్పించే కోర్సుల కోసం  నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) వంటి సంస్థలతో అనుసంధానం (టైఅప్‌) చేసుకోవాలని సూచించారు. రిస్క్‌ అనాలసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, రియల్‌ ఎస్టేట్‌ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ తరహా కోర్సుల వల్ల డిగ్రీ పూర్తి కాగానే విద్యార్థులకు స్వయం ఉపాధి అందుతుందని చెప్పారు. వచ్చే జూన్‌ కల్లా పాఠ్య ప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి    

త్వరితగతిన నియామకాలు
► ఉన్నత విద్యా శాఖలో 2 వేలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాం. ఈ ఖాళీలను త్వరగా భర్తీ చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇప్పటికే చేపట్టిన నోటిఫికేషన్లకు సంబంధించిన కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని, జూన్‌ కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి.

► ఉన్నత విద్యా శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో సిబ్బంది నియామకాలు త్వరితగతిన చేపట్టాలి. యూనివర్సిటీల్లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. సమర్థులైన బోధన సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలి. తద్వారా విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాలను పెంచేందుకు అవకాశముంటుంది. ట్రిపుల్‌ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్‌ అంశాలను సత్వరమే పరిష్కరించాలి.

కాలేజీలు ప్రమాణాలు పెంచుకునేలా చేయూత
► రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ న్యాక్‌ తదితర సంస్థల అక్రిడిటేషన్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉన్నత విద్యా శాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతుల పరంగా నాణ్యత పెరగాలి. ఈ దిశగా ప్రతి విద్యా సంస్థ కూడా నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలి.

► కాలేజీలు ప్రమాణాలు పెంచుకునేలా మూడేళ్ల పాటు వారికి చేయూతనివ్వాలి. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో అక్రిడిటేషన్‌కు వీలుగా ప్రమాణాలు పెంచుకోవాలి. మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యా సంస్థలు న్యాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలి. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.

► కళాశాలల్లో కోర్సులన్నీ నేటి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌ అందించే బాధ్యత స్కిల్‌ యూనివర్సిటీ తీసుకోవాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 175 స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. 

► ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి. ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలు కలిసి కరిక్యులమ్‌ రూపొందించాలి. హై ఎండ్‌ స్కిల్స్‌లో భాగంగా సాప్ట్‌వేర్‌ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలి. కోడింగ్, క్లౌడ్‌ సర్వీసెస్‌ లాంటి డిమాండ్‌ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి.  

సెంట్రల్‌ ఆంధ్రాలో అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజ్‌ 
► బోధనా సిబ్బంది సామర్థ్యం మెరుగు పరచడానికి తిరుపతి, విశాఖపట్నంలలో ఉన్న అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీలను బలోపేతం చేయాలి. వీటితో పాటు సెంట్రల్‌ ఆంధ్రా పరిధిలో ఒక చోట అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలి. 

► కొన్ని ప్రైవేట్‌ బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని.. మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కాలేజీల్లోని బోధన సిబ్బంది, వసతి, సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలి. అందులో చదివే విద్యార్థుల హాజరును మరొక ప్రమాణంగా తీసుకుని ఆయా కాలేజీలపై ఒక నిర్ణయానికి రావాలి. 

డ్రాపవుట్లకు తావులేకుండా చర్యలు 
► పిల్లలు చదువులు ప్రారంభించిన తర్వాత ఏ దశలోనూ డ్రాప్‌ అవుట్‌ అన్న పరిస్థితే రాకుండా రాష్ట్ర  ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. పిల్లలను బడికి పంపితే చాలు.. నేరుగా తల్లి అకౌంట్‌లోకి  అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బు జమ చేస్తోంది. టెన్త్‌ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్‌ వైపు వెళ్తున్న వారికి కూడా విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తోంది.

► మెడిసిన్, ఇంజనీరింగ్‌ వంటి ఇతర చదువులు చదువుతున్న వారికి పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. అలాగే వసతి దీవెన కూడా అందిస్తున్న రాష్ట్రం ఏపీనే. ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడా చదువులు మానేయాల్సిన పరిస్థితి అన్నది లేదు. ఫలితంగా జీఈఆర్‌ (గరిష్ట చేరికల నిష్పత్తి) తప్పకుండా పెరుగుతుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధనలో ఇవి ప్రతిబింబించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, విద్యా శాఖ సలహాదారు ఏ.సాంబశివారెడ్డి, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్‌జీయూకేటీ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేసి.రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement