చేయూతనివ్వని ప్రభుత్వం.. చెయ్యిచ్చిన జీహెచ్‌ఎంసీ | RTC in loss | Sakshi
Sakshi News home page

‘ప్రగతి రథం’.. అధో పథం!

Published Sun, Jan 28 2018 3:35 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

RTC in loss - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలే అమలు కాకపోవటంతో ఆర్టీసీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సీఎం ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ నుంచి నిధులు అందకపోవడంతో తీవ్ర సంకటాన్ని ఎదుర్కొంటోంది. డిసెంబర్‌ ముగిసే నాటికి రూ.406 కోట్ల నష్టాల్లో కూరుకుపోయి.. కార్మికుల జీతాల చెల్లింపులకూ దిక్కులు చూస్తోంది. 

హైదరాబాద్‌ నగరంలో ఆర్టీసీకి తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. మరోవైపు కార్మికులు అడిగిన దానికంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. వేతన సవరణ రూపంలో భారాన్ని మోపటంతో ఈ నష్టాలు మరింత పెరిగాయి. దీంతో నగరంలో వచ్చే నష్టాలను జీహెచ్‌ఎంసీ ద్వారా భర్తీ చేయనున్నట్లు గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఇప్పుడు ససేమిరా అంటున్న జీహెచ్‌ఎంసీ ఆర్టీసీకి చిల్లిగవ్వకూడా ఇవ్వబోమని తేల్చి చెప్పింది. మరోవైపు ప్రభుత్వం గ్రాంటు ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవటంతో ఎలా నెట్టుకురావాలో తెలియక ఆర్టీసీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ నేపథ్యంలో 2017–2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌ ముగిసే నాటికి రూ.406 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తెలిసి బిత్తరపోతోంది. కార్మికులు తమ రుణాల కోసం వేతనాల నుంచి పొదుపు చేసుకున్న మొత్తాలను కూడా ఆర్టీసీ ఇప్పటికే వాడేసుకుంది. దీంతో కార్మికులకు రుణాలు అందని పరిస్థితి నెలకొంది. సాయం కోసం అభ్యర్థిస్తే ప్రభుత్వమూ మౌనం దాల్చింది. మరోవైపు వేతన సవరణ గడువు దాటిపోవటంతో కార్మిక సంఘాలు ఒత్తిడి మొదలుపెట్టాయి. 

తొమ్మిది నెలలు.. రూ.400 కోట్లు 
ఇదిగో ఖర్చు తగ్గింది.. అదిగో లాభమొచ్చిందంటూ ఇటీవల ఆర్టీసీ ప్రకటించుకుంటున్నా.. తాజా నష్టాలు బెంబేలెత్తిస్తున్నాయి. దూర ప్రాంతాలకు కొత్త సర్వీసులు ప్రారంభించటం, నియామకాలు లేకపోవటంతో సిబ్బంది సంఖ్య తగ్గి కొంత వేతనాల భారం సడలటంతో కొన్ని డిపోల్లో లాభాలు కనిపించాయి. కానీ డిసెంబరు ముగిసే నాటికి మొత్తం నష్టాల లెక్కలేసిన అధికారులు అవాక్కవ్వాల్సి వచ్చింది. ఏకంగా రూ.406.04 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు తేలటంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. నష్టాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గ్రాంటు రూపంలో నయా పైసా వచ్చే వీలులేదన్న సంకేతాలు వచ్చేశాయి. తాము కూడా సాయం చేయబోమని జీహెచ్‌ఎంసీ తేల్చటంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. 

సాయం నిలిపేసిన జీహెచ్‌ఎంసీ 
ముంబై తరహాలో నగర పరిధిలో వచ్చే నష్టాలను నగర పాలక సంస్థ నిధులతో భర్తీ చేయనున్నట్టు గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 2015–16కు సంబంధించి రూ.336 కోట్లను ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ కేటాయించింది. దీంతో కష్టాల నుంచి గట్టెక్కినట్టేనని ఆర్టీసీ భావించింది. కానీ ఆర్టీసీకి సాయం చేస్తే తమ అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్న జీహెచ్‌ఎంసీ ఇక సాయం చేయకూడదని నిర్ణయించుకుంది. దీంతో తర్వాత రావాల్సిన బకాయిలు, తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తాన్ని ఇవ్వద్దని తేల్చింది. దీనిపై ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదు. ఇప్పటికే స్టాఫ్‌ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ స్కీం, ఎస్‌బీటీ స్కీంలకు సంబంధించి కార్మికులు జమ చేసిన నిధి కూడా కరిగిపోయింది. పదవీ విరమణ చేసిన తర్వాత ఇచ్చే మొత్తం, చనిపోయిన వారికి ఇచ్చే మొత్తం పోను మిగతా నిధిని కార్మికుల రుణాలకు వాడాల్సి ఉంది. కానీ ఆర్టీసీ ఆ మొత్తాన్ని వాడేసుకోవటంతో రుణాలు పొందే పరిస్థితి లేకుండా పోయింది. ఈ తరుణంలో జీతాలు ఇవ్వటానికి దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొనటం ఆందోళన కలిగిస్తోంది. 

రూ.500 కోట్లకు నష్టాలు?
రాష్ట్రంలో రైల్వే లైన్ల విస్తీర్ణం తక్కువ. ఇక్కడ ప్రైవేటు బస్సుల పోటీ కూడా నామమాత్రం. కొత్త బస్సుల కొనుగోలు అంతంతమాత్రమే కావటంతో ఆర్టీసీ నష్టాలు భారీగా తగ్గాల్సి ఉంది. కానీ తాజా లెక్కలు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగతా మూడు నెలలు ముగిసే సరికి మొత్తం నష్టాలు రూ.500 కోట్లను దాటనున్నాయి. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ముందుకు సాగే పరిస్థితి లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement