లాభాల బాట పట్టాలి | KCR fire on telangana RTC issue | Sakshi
Sakshi News home page

లాభాల బాట పట్టాలి

Published Sat, Jun 18 2016 2:46 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

లాభాల బాట పట్టాలి - Sakshi

లాభాల బాట పట్టాలి

రాదన్న తెలంగాణ తెచ్చుకున్నం.. ఆర్టీసీని బాగు చేయలేమా?: కేసీఆర్
మూస పద్ధతులు కట్టిపెట్టండి.. కొత్తగా ఆలోచించండి
ప్రభుత్వం తరఫున చాలా ఆదుకున్నం
నష్టాలున్నా 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినం
ఇంకా న ష్టాలే వస్తే ఆర్టీసీని మూసేయాలన్న ఆలోచన రాదా?
95 డిపోలుంటే 90 డిపోలు నష్టాల్లో ఉండటం సిగ్గుచేటు
ప్రజలపై భారం లేకుండా ఏటా చార్జీలను సవరించండి
పెద్ద ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు నడపండి
పర్యాటక శాఖ బస్సులు ఆర్టీసీ తీసుకోవాలి
బస్ పాస్‌ల నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుంది
బస్సుల అద్దె నిబంధనలను సరళతరం చేయండి
ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
కార్మికులు, అధికారులు కలసి పనిచేయాలని సూచన
ఆర్టీసీపై ఏడున్నర గంటల పాటు సుదీర్ఘ సమీక్ష

 
సాక్షి, హైదరాబాద్: ‘‘అసాధ్యమన్న తెలంగాణనే సాధించుకున్నం.. ఆర్టీసీని లాభాల బాట పట్టించటం పెద్ద కష్టం కాదు. తెలంగాణ ఆర్టీసీ తనకుతానుగా బలపడి ప్రయాణికులకు మరింత చేరువ కావాలి. నాణ్యమైన రవాణా వసతితోపాటు ఆర్టీసీ బస్సు పూర్తి సురక్షితమనే భావన ప్రజలకు కల్పించాలి. ఇది జరగాలంటే ఆర్టీసీ లాభాల బాట పట్టాలి. అధికారులు, కార్మికుల్లో దృఢ సంకల్పం ఉంటేనే ఇది సాధ్యం. మూస పద్ధతులకు చరమగీతం పాడి.. కొత్తగా  ఆలోచించండి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘‘సిటీ బస్సుల నష్టాలను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీతో అనుసంధానించాం. అక్కడ్నుంచి నిధులు వస్తున్నాయి..
 
కొత్త బస్సులు కొనిచ్చాం.. నష్టాల్లో ఉన్నా 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాం... ఇంకా చాలా చేశాం. అయినా తీరు మారకుంటే ఎట్లా? ప్రభుత్వం ఎంత చేసినా నష్టాలే వస్తుంటే అసలు ఆర్టీసీని ఎందుకు నడపాలనే ప్రశ్న రాదా’’ అని ప్రశ్నించారు. తాను రవాణా మంత్రిగా ఉండగా డిపోలవారీగా సమీక్షించి చేపట్టిన చర్యల వల్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందని, ఇప్పుడు కూడా అధికారులు అలా చేస్తే నష్టాలు మాయమవటం కష్టమేమీ కాదన్నారు. తెలంగాణలో 95 ఆర్టీసీ డిపోలుంటే అందులో ఏకంగా 90 డిపోలు నష్టాల్లో ఉండటం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సీఎం కేసీఆర్.. సంస్థ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
 
ఉదయం 11 నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు మారియట్ హోటల్‌లో జరిగిన ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఈడీలు, ఇతర విభాగాధిపతులు, అన్ని డిపోల మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపోల వారీగా పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. నష్టాలు పోవాలంటే విప్లవాత్మక మార్పులు అవసరమన్న సీఎం.. పలు సూచనలు చేశారు. పాత చింతకాయ పచ్చడి విధానాలను పక్కన పెట్టి పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలైన వాటినే కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. గురువారం నాటి ముందస్తు సమీక్షలో అధికారులపై విరుచుకుపడ్డ సీఎం ఈ సమావేశంలో ప్రశాంతంగా కనిపించారు. సానుకూల దృక్ఫథంతో మాట్లాడారు.
 
ఇక ప్రతి సంవత్సరం చార్జీల సవరణ
ఇక నుంచి ప్రతి సంవత్సరం పరిస్థితులకు తగ్గట్టుగా చార్జీల సవరణ ఉండబోతోంది. ఈ మేరకు సీఎం నేరుగా అధికారులను ఆదేశించారు. ‘‘నాలుగైదేళ్లపాటు చార్జీలు పెంచకుండా ఎన్నికల స్టంట్‌తో గడిపి, ఆ తర్వాత ఒక్కసారిగా మోత మోగిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అలా కాకుండా వారిపై పెద్దగా భారం లేకుండా ప్రతి సంవత్సరం నిర్ధారిత మొత్తంలో చార్జీలను పెంచటం మంచిది. ఆ పెంపు ఎలా ఉండాలనేది తేల్చేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. నేను ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే లక్ష్యంతో ఉన్నా. విద్యుత్ సంస్థలను బలోపేతం చేస్తున్నట్టే ఆర్టీసీని దేదీప్యమానంగా తయారు చే సే బాధ్యత నాది. అవగాహన ఉన్న మంత్రి, చైర్మన్ ఉన్నారు. ఆర్టీసీలో పనిచేసిన అనుభవం ఉన్న రమణారావును ఎండీ చేశా’’ అని అన్నారు.
 
పర్యాటకశాఖకు బస్సులెందుకు?
ప్రస్తుతం పర్యాటకుల కోసం పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. ఇక వాటిని ఆర్టీసీ స్వాధీనం చేసుకోనుంది. పర్యాటకులకు వసతులు కల్పించటం, ఆయా ప్రాంతాల అభివృద్ధి మాత్రమే పర్యాటకశాఖ పరిధిలో ఉండాలని, బస్సుల నిర్వహణ వద్దని సీఎం పేర్కొన్నారు. ఇక ఆ బస్సులను స్వాధీనం చేసుకుని ఆర్టీసీనే నిర్వహించాలని సూచించారు.
 
జీహెచ్‌ఎంసీ నుంచి రూ.198 కోట్ల చెక్కు
హైదరాబాద్ సిటీ బస్సుల నష్టాలను జీహెచ్‌ఎంసీతో భర్తీ చేయించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆర్టీసీ చైర్మన్‌కు ఈ సమీక్షలోనే రూ.198 కోట్ల చెక్కు అందజేశారు. సిటీ సర్వీసులను జీహెచ్‌ఎంసీతో అనుసంధానించినందున నష్టాలను ఆ సంస్థే భరించాల్సి ఉంది. 2015-16 సంవత్సరానికి గాను రూ.336 కోట్లు అందాల్సి ఉండగా ఇప్పటికే కొంతమొత్తం చెల్లించారు. మిగతాది శుక్రవారం చెక్కు అందజేతతో ముట్టినట్టయింది.
 
గుర్తింపు సంఘం ఎన్నికలు నాలుగైదేళ్లకోసారి
ప్రస్తుతం ప్రతి రెండేళ్లకోసారి జరుగుతున్న కార్మిక సంఘం ఎన్నికలను ఇక నుంచి నాలుగైదేళ్లకోసారి జరపాలని సీఎం ఆదేశించారు. త్వరలో జరగనున్న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఈ మేరకు అధికారికంగా మార్పు జరగనుంది. బస్ పాసుల రూపంలో ఆర్టీసీ నష్టపోయే మొత్తం ఇకపై ప్రభుత్వం భర్తీ చేస్తుందని సీఎం చెప్పారు. పల్లె వెలుగు బస్సులు పూర్తిగా నిండనందున ఓఆర్ దెబ్బతింటోందని, చిన్న బస్సులు నడపటం ద్వారా దీన్ని అధిగమించాలని సూచించారు. అవకాశం ఉన్న అన్ని బస్టాండ్ భవనాల్లో మినీ థియేటర్లు ఏర్పాటు చేయాలని, విరివిగా వాణిజ్య ప్రకటనలు సేకరించాలని ఆదేశించారు.  సిటీలో చిన్న ఏసీ బస్సులు నడపడంతోపాటు ‘సర్వీస్ ఎట్ యువర్ డోర్‌స్టెప్’ అనే పద్ధతిలో అవసరమైతే ప్రయాణికుల ఇళ్ల వరకు వెళ్లాలని సూచించారు. ప్రజలు ఇళ్ల వద్దే బస్సులెక్కి గమ్యస్థానాలకు చేరేలా చిన్న బస్సులు నడపాలని, వాటిని హైదరాబాద్-వరంగల్, నిజామాబాద్ మార్గాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలంచాలని సూచించారు.
 
ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు
డిపోల వారీగా ఇయర్ క్యాలెండర్‌ను రూపొందించి పెద్ద ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు నడపాలని సీఎం సూచించారు. కృష్ణా పుష్కరాలు, శబరిమల, కొండగట్టు వంటి ప్రాంతాలకు వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి బస్సులు నడపాలన్నారు. నిత్యం 90 లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు సరైన ప్రచారం ఉండటం లేదని, ప్రైవేటు వాహనాల పోటీని తట్టుకునేందుకు ప్రత్యేక  కార్యాచరణ ఉండాలన్నారు. అవసరమైతే భక్తులతో నేరుగా మాట్లాడి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పెళ్లిళ్ల వంటి వాటికి అద్దెకిచ్చేప్పుడు నిబంధనలను సర ళం చేయాలన్నారు. విద్యార్థుల విహార యాత్రలకు ఆర్టీసీ బస్సులే వెళ్లేలా చేయాలని, డిమాండ్ ఉన్న మార్గాలను గుర్తించి బస్సు సర్వీసుల సంఖ్య పెంచాలన్నారు. ప్రతీ డిపో నుంచి తిరుపతికి బస్సులు నడపాలన్నారు.
 
 భద్రతకు భరోసా.. పరిశుభ్రత..
 ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే భావన ప్రజల్లో మరింత పెరగాలని సీఎం చెప్పారు. ఇందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బస్టాండ్లు, బస్సులు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, డీఎంలతో పక్షం రోజులకోమారు సమావేశాలు జరగాలన్నారు.
 
సరుకు రవాణా మొదలు పెట్టండి..
ఆర్టీసీ బస్సులు కేవలం ప్రయాణికుల తరలింపునకే పరిమితం కాకుండా సరుకు రవాణాకు కూడా ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకోవాలని సీఎం ఆదేశించారు. నగరం నుంచి నిత్యం ప్రయాణించే 2,800 బస్సుల ద్వారా సరుకు రవాణాకు కూడా అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
 
అవినీతి సిబ్బందిని ఉపేక్షించొద్దు
ఆర్టీసీలో అవినీతి పూర్తిగా తగ్గించాలని, దుబారాను కూడా నియంత్రించాలని, టికెట్ ఇవ్వకుండా డబ్బులు జేబులో వేసుకునే వారి విషయంలో నిర్దయగా ఉండాలని సీఎం స్పష్టంచేశారు. ప్రైవేటు రవాణా పర్మిట్లు దుర్వినియోగం అవుతున్నాయని, అంతర్‌రాష్ట్ర పర్మిట్లు తీసుకుని నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆర్టీసీని నష్టపరుస్తున్నారని పేర్కొన్నారు. దాన్ని వెంటనే నివారించాలని ఆదేశించారు. కార్మికుల సంక్షేమం కోసం 44 శాతం ఫిట్‌మెంటు ఇచ్చామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించామని, ఇంకా నెలకు 600 కేసులు నమోదు కావటం సిగ్గుచేటన్నారు. తప్పు చేస్తే విధుల నుంచి తొలగించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
 
 అంతరాష్ట్ర సర్వీసులేవీ?
 ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు ప్రాధాన్యమివ్వాలని సీఎం పేర్కొన్నారు. అటు నుంచి ఇటు ఎన్ని బస్సులొస్తున్నాయో, ఇటు నుంచి అటు కూడా అన్ని బస్సులు తిరిగేలా చూడాలని, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు అంతర్ రాష్ట్ర సర్వీసులు సమంగా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కొత్త జిల్లాలు వస్తున్నందున అందుకు తగ్గట్టుగా ఆర్టీసీ సర్వీసులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రాత్రివేళ బస్టాండ్లలో ప్రయాణికులు బస చేసేలా వసతి కల్పించాలన్నారు. బస్టాండ్లు, డిపోల్లో అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధుల నుంచి నిధులు రాబట్టాలన్నారు. డిపోల్లో లంచ్‌రూం, డ్రెస్ రూం, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వసతి ఉండాలన్నారు. ఆర్టీసీ-రవాణా శాఖ మధ్య సమన్వయం పెరగాలని, ఇందుకు జేటీసీ వెంకటేశ్వర్లు సమన్వయకర్తగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.
 
భూమి చుట్టూ 80 సార్లు తిరిగినట్టే..
ఆర్టీసీ బస్సులు నిత్యం 34 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయని, ఇది భూమి చుట్టూ 80 సార్లు చక్కర్లు కొట్టినదానితో సమానమని సీఎం కే సీఆర్ పేర్కొన్నారు. ‘‘ప్రతిరోజూ 90 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్నున్నారు. దీన్ని ఒడిసిపట్టుకుని ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇక్కడ 56 వేల మంది పనిచేస్తుంటే అందులో 55 వేల మంది కార్మికులే. కార్మికులు-అధికారులు అంతా సమానమే. కలిసి భోజనం చేయాలి, కలిసి పనిచేయాలి. శత్రుత్వం కూడదు. కార్మికులు చీటికిమాటికి సమ్మెకు దిగొద్దు. డిపో మేనేజర్లకు టెండర్లు సహా ఇతర అధికారాలను కేటాయించాలి’’ అని సూచించారు.
 
క్యాంటీన్లలో మాంసాహారం
ప్రస్తుతం ఆర్టీసీ క్యాంటీన్లను పూర్తిగా శాఖాహారానికే పరిమితం చేయటం సరికాదని, వాటిల్లో మాంసాహారం అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. సొంత జిల్లాలో పని చేయొద్దనే నిబంధన సడలించాలని, స్పౌజ్ ఉద్యోగి అయితే భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో ఉండేలా చూడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement