1,300గ్రామాలకు బస్సులు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో పది వేల గ్రామాలకు ఆర్టీసీ బస్సు చేరగలుగుతోంది. కానీ ఇంకా 1,300 గ్రామాలకు నేటికీ బస్సు వసతి లేదు. ఆయా గ్రామాలకు సరైన రహదారి వసతి లేకపోవటమే ఇందుకు కారణం. ఈ పరిస్థితిని యుద్ధప్రాతిపదికన మార్చాలని నిర్ణయించాం. రోడ్డు లేని గ్రామాలకు కొత్తగా రోడ్లు, ఉన్నా... సరిగా లేని చోట మరమ్మతులు పూర్తి చేసి వీలైనంత తొందరలో ఆ గ్రామాలకు ఆర్టీసీ బస్సు వెళ్లేలా చర్యలు తీసుకోబోతున్నాం’’ అని తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరో రెండుమూడు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
అన్ని గ్రామాలకు రవాణా వసతి ప్రధాన ధ్యేయం.
ఆర్టీసీ బస్సు అనగానే పేదల బండి అనే విషయం గుర్తొస్తుంది. కానీ ఇంకా 1,300 గ్రామాల ప్రజలకు ఆ వసతి లేకుండాపోయింది. వీటిల్లో చాలావరకు మారుమూల పల్లెలే. అన్ని ఊళ్లకు కూడా బస్సు వసతి కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు.
అదనంగా 35 నుంచి 45 వరకు కొత్త డిపోలు...
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఆర్టీసీ డిపోలపై భారం పెరిగిపోయింది. వాటి పరిధి కూడా పెద్దగా ఉంది. అందుకే కొత్తగా 35 నుంచి 45 వరకు కొత్త డిపోలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. అదనంగా బస్సులను సమకూర్చుకుని వాటికి కేటాయిస్తాం. కొన్ని చోట్ల డిపో భవనాల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తాం. కాలంచెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొంటాం.
నష్టాలు పూడ్చుకునేందుకు చర్యలు...
దేశంలో ఉత్తమ రవాణా సంస్థగా గుర్తింపు పొందినప్పటికీ ఏపీఎస్‌ఆర్టీసీ నష్టాల్లో ఉండిపోయింది. విభజన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీకి వచ్చే నష్టాల మొత్తం ఎంతో త్వరలో సమీక్షించుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి విలువైన ఖాళీ భూములున్నా యి. వాటిల్లో ఉపయోగపడేవాటిని గుర్తించి వాణిజ్య సముదాయాలను నిర్మించి అద్దెకిస్తాం. పెట్టుబడి ఎక్కువగా ఉండకుండా చిన్న నిర్మాణాలకే తొలుత పరిమితం కావాలని నిర్ణయించాం.