Transko
-
మూడేళ్లు దాటితే స్థాన చలనమే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సాధారణ బదిలీల కసరత్తు ప్రారంభమైంది. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలో పనిచేస్తున్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఆయా సంస్థల యాజమాన్యాలు పచ్చ జెండా ఊపాయి. ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలు వర్తించనున్నాయి. ఈ నెల 15లోగా ఈ ఉత్తర్వులు జారీ కానున్నాయి. స్థాన చలనం పొందిన ఉద్యోగులు 22వ తేదీలోగా రిలీవ్ కావాల్సి వుండనుంది. 15వ తేదీ తర్వాత బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి రానుంది. అయితే, క్రమ శిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల విషయంలో మాత్రం సడలింపులుంటాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తుతం అప్రధాన స్థానాల్లో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత గల స్థానాలు కేటాయించాలని, ప్రాధాన్యత గల స్థానాల్లో పనిచేస్తున్న వారికి అప్రధాన పోస్టింగ్‌లు ఇవ్వాలని ఈ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడేళ్లు, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీల్లో డిస్కంలు వేర్వేరు విధానాన్ని అనుసరించనున్నాయి. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను వారి స్థాయిని బట్టి సాధ్యమైనంత వరకు ప్రస్తుత సబ్ డివిజన్/డివిజన్/సర్కిల్ పరిధిలోనే మరో చోటకు బదిలీ చేయనున్నారు. ఐదేళ్లు దాటితే మాత్రం మరో డివిజన్/సర్కిల్‌కు వెళ్లక తప్పదు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేస్తే... సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈ/ఏడీఈలను అదే సబ్ డివిజన్లో మరో పోస్టుకు బదిలీ చేస్తారు. విజ్ఞప్తిపై మరో సబ్ డివిజన్‌కు పంపిస్తారు. సర్కిల్ ఎస్ఈ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరుగుతాయి. ఏఈఈ(సివిల్), ఏఏఓలు అంతకు పై స్థాయి అధికారుల బదిలీలను నేరుగా సంస్థల యాజమాన్యాలు జరుపుతాయి. ఐదేళ్లు పూర్తి చేసుకుంటే.. సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈ/ఏడీఈలను ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేస్తారు. సర్కిల్ ఎస్ఈ పర్యవేక్షణలో ఈ బదిలీలు జరగుతాయి. సర్కిల్ బయటకు బదిలీ కోరుకుంటే సంస్థ యాజమాన్యమే నేరుగా బదిలీ జరపనుంది. ఏఈఈ(సివిల్), ఏఏఓల అంతకు పై స్థాయి అధికారులను మరో సర్కిల్‌కు సంస్థ యాజమాన్యమే బదిలీ చేయనుంది. -
మృతదేహంతో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా
జటప్రోల్ (వీపనగండ్ల) : మండలంలోని కొప్పునూర్ కు చెందిన వ్యవసాయ కూలీ బడికెల కిష్టన్న (36) శుక్రవారం మధ్యాహ్నం విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత ట్రాన్స్‌కో అధికారులదేనంటూ గ్రామస్తులు శనివారం ఉదయం మృతదేహంతో జటప్రోల్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇన్చార్జి ఏఈ నర్సింహ, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. అనేకసార్లు విద్యుత్ సమస్యను అధికారులకు విన్నవించినా పరిష్కారానికి కృషి చేయలేదన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ విషయమై ఏఈని చుట్టుముట్టారు. దీంతో జెడ్పీటీసీ సభ్యుడు మేడిపల్లి లోకారెడ్డి, మాజీ సభ్యుడు కృష్ణప్రసాద్‌యాదవ్, స్థానిక నాయకులు రాంచంద్రారెడ్డి, గోవిందుగౌడ్ విద్యుత్ సిబ్బందితో చర్చలు జరిపారు. చివరకు *లక్ష ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బీచుపల్లియాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గంటధర్మారెడ్డి, స్థానిక నాయకులు ఆనంద్‌యాదవ్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సీఐ రాఘవాచారి, ఎస్ఐ వినయ్‌కుమార్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. -
పాపం ఆ నాలుగు శాఖలదే..
సాక్షి, సిటీబ్యూరో: ఆ నాలుగు ప్రభుత్వ విభాగాల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే హజ్ హౌస్ వద్ద జరిగిన విద్యుదాఘాతంలో నలుగురు యువకులు బలయ్యేవారు కాదు. మైనార్టీ శాఖకు చెందిన హజ్ కమిటీ, జీహెచ్ఎంసీ, ట్రాన్స్‌కో, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణంగా నిలిచాయి. హజ్ హౌస్ ప్రధాన ద్వారం పక్కన ఫుట్‌పాత్‌పై కనీసం 20 చిన్నా చితక దుకాణాలు వెలిశాయి. వీటికి అక్రమ విద్యుత్ కనె క్షన్లను తీసుకున్నారు. సమీపంలోని ఆర్టీసీ బస్టాప్‌లో ఏకంగా చోటు అనే వ్యక్తి హోటల్ పెట్టేశాడు. ఫుట్‌పాత్‌పై కనీసం ఒక్క అడుగు స్థలం కూడా లేకుండాపోయింది. ఈ షాప్‌ల వారు తమ దుకాణాలపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లు (సింగిల్‌ఫేజ్) నుంచి వైర్లు తగిలించి అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారు. ఇది ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోలేదు. అప్పుడే విద్యుత్ చౌర్యాన్ని నివారించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదు. మరోపక్క ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని షాప్‌లు ఏర్పాటుచేస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు గుడ్లప్పగించి చూశారు. ఇక మైనార్టీ శాఖ.. ఇష్టానుసారం దుకాణాలు ఏర్పాటైనా అడ్డుకోలేదు. బస్టాప్‌లో హోటల్ ఏర్పాటైనా ఆర్టీసీ అధికారులు గమనించలేకపోయారు. ఇవన్నీ కలిసి నాలుగు ప్రాణాల్ని బలిగొన్నాయి. ప్రమాదానికి కారణమిదే.. బస్టాప్‌లో ఉన్న హోటల్‌కు అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. వీరు తగిలించిన రెండు వైర్లలో ఒకటి గాలిదుమారానికి కింద పడింది. అదే ఘటనకు కారణమైంది. ఈ తీగ ఫుట్‌పాత్‌కు ఆనుకుని వేసిన బారికేడ్లకు తగలడంతో విద్యుత్ సరఫరా జరిగింది. ఇదే హోటల్లో పనిచేస్తున్న ముంబయికి చెందిన రాజు, ఖయ్యూం త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఇద్దరు ఎటువంటి ఇనుప సామానులను పట్టుకోకుండా ధైర్యాన్ని కూడదీసుకుని పది నిముషాల పాటు అక్కడే ఉండి జాగ్రత్తగా బయటపడ్డారు. -
పేరుకుపోయిన బకాయిలు
ట్రాన్స్‌కోకు స్థానిక సంస్థల బకాయిలు రూ.93 కోట్లు వసూలుకు అధికారుల సన్నద్ధం తిరుపతి: ట్రాన్స్‌కోకు స్థానిక సంస్థలు రూ.93 కోట్లు బకాయి ఉన్నాయి. వీధిలైట్లు, గ్రామీణ నీటి సరఫరా, ఇతర అవసరాలకు స్థానిక సంస్థలు వాడిన కరెంట్‌కు సంబంధించి ఈ మొత్తం చెల్లించాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ.20 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వీటి వసూలుకు ట్రాన్స్ కో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. డిస్కం గణాంకాల ప్రకారం జిల్లాలో వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాలకు సంబంధించి 20,648 సర్వీసులున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రూ.6.91 కోట్ల బకాయిలు స్థానిక సంస్థలు చెల్లించాల్సి ఉంది. మద నపల్లె సబ్ డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో రూ.15.06 కోట్ల బకాయిలు ఉన్నాయి. పలమనేరు ట్రాన్స్‌కో డివిజన్ పరిధిలోని 90 గ్రామ పంచాయతీల నుంచి రూ.2 కోట్లకు పైగా కరెంట్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాటిలో వీకోట గ్రామపంచాయతీ అత్యధికంగా రూ.80 లక్షలు బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. నగరి మండలంలో స్థానిక సంస్థలు రూ.45 లక్షల మేర విద్యుత్ చార్జీలు ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. బకాయిల వసూలుపై దృష్టి సారించిన ఎస్పీడీసీఎల్ అధికారులు ముందుగా ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే కరెంట్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయిం చారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీకి వారం రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. కొత్తగా సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టిన తాము పంచాయతీ ఆర్థిక స్థితిగతులపై అవగాహన పెంచుకోకనే బకాయిల పేరుతో నోటీసులు పంపడం, కరెంట్ సరఫరా నిలిపివేయడంపై సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు. ఐదేళ్లుగా స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడం, గ్రామాల్లో పన్నులు సరిగా వసూలు కాకపోవడం, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం తదితర కారణాలతో చాలా గ్రామ పంచాయతీలు కనీసం కరెంట్ చార్జీలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాయి. పరిస్థితి అర్థం చేసుకోవాలని అంటున్నారు. బకాయిల వసూలుకు చర్యలు చేపడుతున్నాం స్థానిక సంస్థల నుంచి విద్యుత్ చార్జీల బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. బకాయిలు పేరుకుపోవడంతో ఒత్తిడి చేయక తప్పడం లేదు. చెల్లించని గ్రామ పంచాయతీలకు కరెంట్ సర ఫరా నిలిపివేయడం లేదు. మరీ ఎక్కువ మొత్తంలో ఉన్న పంచాయతీలపై ట్రాన్స్‌కో క్షేత్రస్థాయి సిబ్బం ది ఒత్తిడి పెంచుతున్నారు. - ఎన్వీఎస్.సుబ్బరాజు , సూపరింటెండింగ్ ఇంజనీర్, తిరుపతి -
ట్రాన్స్‌కోకు షాక్ !
భూములు ఇవ్వడానికి రైతుల నిరాకరణ చుక్కల్ని అంటుతున్న ధరలే కారణం! పెరుగుతున్న విద్యుత్ అవసరాలు కొత్త సబ్స్టేషన్లు తప్పనిసరి అంటున్న అధికారులు సాక్షి, విజయవాడ : జిల్లాలో నూతన విద్యుత్ సబ్స్టేషన్లు, లైన్ల ఏర్పాటు కోసం ట్రాన్స్‌కో అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ‘మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి’ అన్న చందంగా మారాయి. భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. రైతులు తమ భూములను ట్రాన్స్‌కోకు అప్పగించేందుకు నిరాకరిస్తున్నారు. విభజన నేపథ్యంలో.. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశం ఉంది. విజయవాడలో మల్టీప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల షాపింగ్ కాంపెక్స్‌లు వెలుస్తున్నాయి. జిల్లాలో పలు కంపెనీలు, ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వాటి అవసరాలకు తగినట్లుగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రస్తుతం ఉన్న సబ్స్టేషన్లు, లైన్లు ఏమాత్రం సరిపోవని ట్రాన్స్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు ట్రాన్స్‌కో అధికారులు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను ఇవ్వడానికి రైతులు ముందుకురావడం లేదు. కొన్నిచోట్ల సబ్స్టేషన్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. కోర్టులకు సైతం వెళ్తున్నారు. కొత్తగా వచ్చే సబ్స్టేషన్లు ఇవే.. గన్నవరం నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు ఉన్న ఎస్పీడీసీఎల్ సబ్స్టేషన్లకు విజయవాడలోని ట్రాన్స్‌కో సబ్స్టేషన్ల నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం విజయవాడలోనే విద్యుత్ లోడు పెరగడంతో గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేస్తున్నారు. నూజీవీడు పరిసర ప్రాంతాల్లో ఎస్పీడీసీఎల్ సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు రంగన్నగూడెంలో సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నారు. ఆయా మార్గాల్లోని గ్రామస్తుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుణదలలో సబ్‌స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు నున్న-గుణదల మధ్య ఉన్న సింగల్ లైన్ బదులుగా డబుల్ సర్కూట్ లైన్ వేయనున్నారు. కొత్త భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో ట్రాన్స్‌కోకు ఇప్పటికే ఉన్న భూముల్లోనే కొత్తలైన్లు వేస్తున్నారు. నూజీవీడులో 220 కేవీ సబ్‌స్టేషన్‌కు, విజయవాడ భవానీపురంలో 133 కే వీ సబ్‌స్టేషన్‌కు టెండర్లు పిలవనున్నారు. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి అధికారులు టెక్నికల్ అనుమతులైతే సాధిస్తున్నారు గానీ, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇదీ కారణం.. తమ భూముల మీదగా 132 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుందని తెలిస్తేనే గ్రామాల్లో ప్రజలు భయపడుతున్నారు. ఈ లైను వల్ల తమ భూముల ధరలు సగానికి పడిపోతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందువల్లే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. గతంలో విజయవాడ ఆటోనగర్‌లో భవన యజమానులు తమ ఇళ్లపై నుంచి ట్రాన్స్‌కో లైన్లు వెళ్లడానికి వీలు లేదంటూ హైకోర్టుకు వెళ్లడంతో తప్పని పరిస్థితుల్లో భూమిలోంచి కేబుల్ వేసి ఆ ప్రాంతంలో సబ్‌స్టేషన్ ఏర్పాటుచేయాల్సి వచ్చింది. పంట నష్టం ఏ మూలకు..! ప్రస్తుతం భూముల ధరలు చుక్కల్ని అంటుతుంటే ట్రాన్స్‌కో మాత్రం రైతులకు నష్టపరిహారం నామమాత్రంగానే ఇస్తోంది. ట్రాన్స్‌కో ఏర్పాటు చేసే టవర్లు, లైన్లు వల్ల దెబ్బతినే పంటకు మాత్రమే నష్టపరిహారం చెల్లించాలని ఆ సంస్థ నిబంధనలు చెబుతున్నాయి. తాము లక్షలాది రూపాయల ఆస్తి నష్టపోతుంటే కేవలం వేల రూపాయల్లో మాత్రమే నష్టపరిహారం వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రాన్స్‌కో నిబంధనలు మార్చి భూములకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ అవసరాలను గుర్తించాలి రాబోయే రోజుల్లో విద్యుత్ అవసరాలు బాగా పెరుగుతాయి. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ట్రాన్స్‌కోకు సహకరించాలి. రెవెన్యూ అధికారులతో సంప్రదించి, వారు సూచించిన విధంగా ట్రాన్స్‌కో నిబంధనల మేరకు రైతుల భూములకు నష్టపరిహారం చెల్లిస్తాం. కొత్తగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఉన్న సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై లోడు ఎక్కువ పడి అవి దెబ్బతింటున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వీటి నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. - బత్తుల రామయ్య, ట్రాన్స్‌కో ఎస్ఈ -
విద్యుత్ బంద్ చిమ్మచీకట్లు
రాష్ట్ర విభజనపై రగిలిన విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. ట్రాన్స్‌కో, జెన్కో సమ్మెతో జిల్లా అంతటా చీకట్లు కమ్ముకున్నాయి. మంచినీరు సరఫరా లేక జిల్లాలోని పట్టణాలు, పల్లెవాసులు అవస్థలు పడ్డారు. కరెంటుపై ఆధారపడిన పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడ్డాయి. రైళ్లు రద్దయ్యాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో ప్రజలు ప్రత్యక్షంగా అవస్థలు పడుతున్నప్పటికీ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. 67 రోజులుగా చేస్తున్న ఉద్యమంపై కనీస కదలిక లేని సర్కార్ కరెంటు సమ్మెతో ఆగమేఘాలపై స్పందించి నివారణోపాయాలపై సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో ఎనిమిది వేల మంది కరెంటు ఉద్యోగులుసమ్మెబాట పట్టారు. ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్లో పనిచేస్తున్న సుమారు ఐదు వేల మంది జెన్కో ఉద్యోగులు, జిల్లాలోని 176 విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న మూడు వేల మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఎన్టీటీపీఎస్లో నిర్వహణ లేక గ్రిడ్లు ఆగిపోయాయి. విద్యుత్ సరఫరా లేక జిల్లా అంతటా గంటల తరబడి అప్రకటిత విద్యుత్ కోతలు అమలయ్యాయి. మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు పట్టణాల్లో మంచినీటి సరఫరా అరకొరగానే జరిగింది. జిల్లాలో సుమారు 460 గ్రామాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా గ్రామాల్లోను, పట్టణాల్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. గ్రామాల్లో వీధి దీపాలు వెలగలేదు. విద్యుత్‌తో వినియోగించే పరికరాలు పనిచేయక గృహిణులు అవస్థలు పడ్డారు. పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. హోటళ్లు సైతం విద్యుత్ కోతతో కుదేలయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు, శస్త్రచికిత్సలను జనరేటర్ల సాయంతో నిర్వహించారు. జిల్లాలో వయా గుడివాడ మీదుగా వచ్చే తిరుపతి-మచిలీపట్నం-నర్సాపురం(17401)రైలును తిరుపతిలోనే నిలిపివేశారు. మంగళవారం ఉదయం జిల్లాకు చేరాల్సిన ఈ రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ ఎన్జీవో హోంలో జేఏసీ జిల్లా నేతల సమావేశం చీకట్లోనే నిర్వహించడం విశేషం. దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి ఆలయాల్లో అంధకారం నెలకొంది. రామగుండం నుంచి విద్యుత్.. తెలంగాణ ప్రాంతానికి సరిహద్దున ఉన్న జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలకు సోమవారం కరెంటు కష్టాలు తగ్గాయి. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు అన్ని ప్రాంంతాలకు కోత తప్పలేదు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలకు రామగుండం నుంచి విద్యుత్ లైన్ రావడంతో కోతలు తక్కువగానే అమలు చేశారు. మచిలీపట్నంలో సుమారు ఆరు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణంలో ప్రాంతాలవారీగా కరెంటు కోతలను అమలు చేశారు. కైకలూరు ప్రాంతంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి కోతను అమలు చేసి సోమవారం ఒక్కరోజు సుమారు ఎనిమిది గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పెడన, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, ఉయ్యూరు, నూజివీడు ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కోత విధించారు. తెగిపడిన విద్యుత్ లైన్.. నాగయలంక నుంచి అవనిగడ్డకు వచ్చే 132 కేవీ విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. వాటికి మరమ్మతులు చేసే నాథుడు లేకపోవడంతో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 6.30 వరకు 26 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్‌కో ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కాంట్రాక్ట్ కార్మికులతో విద్యుత్‌లైను పునరుద్ధరించారు. విద్యుత్ స్టేషన్ల వద్ద బందోబస్తు.. విద్యుత్ ఉత్పత్తి పడిపోయి జిల్లాలో కోతలు తీవ్రమైన తరుణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై ప్రభుత్వ ఉన్నతస్థాయి యంత్రాంగం దృష్టి సారించింది. రెండు రోజుల కరెంటు సమ్మెపై స్పందించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం హైదరాాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం చీఫ్ సెక్రటరీ పీకే మహంతి జిల్లాల్లోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయనతోపాటు డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ డీజీ మహేందర్‌రెడ్డి, ఎనర్జీ స్పెషల్ సెక్రటరీ పాల్గొని జిల్లా ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో కరెంటు ఉద్యోగుల సమ్మె కారణంగా అన్ని విద్యుత్ ఫీడర్లు, సబ్స్టేషన్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగేలా ఎక్కడ సాంకేతిక లోపం ఏర్పడినా దాన్ని సరిచేయాలని చెప్పారు. సమ్మె విరమణకు బుధవారం ఏపీఎన్జీవోలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, అంతవరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, ఏఎస్పీ షీమూసిబాజ్పాయి, బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో అధికారులు
పెనుబల్లి, న్యూస్‌లైన్ : ఓ రైతు దగ్గర నుంచి లంచం తీసుకున్న ఇద్దరు ట్రాన్స్‌కో అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాయిబాబ వెల్లడించిన వివరాల ప్రకారం...పెనుబల్లి మండలం గణేషన్‌పాడు గ్రామానికి చెందిన రైతు గోదా చెన్నారావు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా పెనుబల్లి ట్రాన్స్‌కో ఇన్‌ఛార్జి ఏఈగా పనిచేస్తున్న హరిప్రవీణ్కుమార్, లైన్ ఇన్స్పెక్టర్ పరిమి సత్యన్నారాయణ 50 వేల రూపాయలు లంచం అడిగారు. అంతమొత్తం ఇచ్చుకోలేననగా చివరికి 30 వేలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్న సమయంలో పెనుబల్లి విద్యుత్తు సబ్ స్టేషన్ కార్యాలయం నుంచి ట్రాన్స్ఫార్మర్ తీసుకువెళుతున్న రైతు చెన్నారావు నుంచి 30 వేల రూపాయలు లైన్ ఇన్స్పెక్టర్ పరిమి సత్యన్నారాయణ తీసుకుని ఆ సొమ్మును ఇన్చార్జి ఏఈ హరిప్రవీణ్కుమార్కు అందజేశారు. దీనిపై నిఘావేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు వరంగల్ రేంజ్ డీఎస్పీ సాయిబాబ ఆధ్వర్యంలో ఖమ్మం ఇన్స్పెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, వరంగల్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, సిబ్బంది దాడి చేసి ఏఈ హరి ప్రవీణ్‌కుమార్ వద్ద నుంచి 30 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఏఈని, లైన్ ఇన్స్పెక్టర్ను విడివిడిగా విచారించారు. రైతు గోదా చెన్నారావు నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదుచేసినట్లు, నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయిబాబ తెలిపారు. నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా... తాను 2010 సంవత్సరం మే నెలలో తన పొలానికి ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైను ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే ఖర్చును డిడి రూపంలో అధికారులకు అందజేశానని, దీనికి కొంత సొమ్ము లంచంగా ముట్టచెప్పినప్పటికీ నాలుగేళ్లుగా తిప్పించుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో ఏసీబీని ఆశ్రయించానని బాధిత రైతు గోదా చెన్నారావు తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. 2010లో డీడీలు అందజేసినప్పుడు అప్పుడు పనిచేస్తున్న సిబ్బందికి రూ.20 వేలు లంచం ఇచ్చాకే 10 కరెంట్ స్తంబాలను అందజేశారని, అప్పటి నుంచి అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కరెంటు స్తంభాలకు తీగలు లాగడం గానీ, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు గానీ చేయడం లేదని, ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ట్రాన్స్ఫార్మర్లు, లైను ఏర్పాటు చేశారని, తాను ఏఈ హరిప్రవీణ్కుమార్, లైన్ ఇన్స్పెక్టర్ పరిమి సత్యన్నారాయణలను సంప్రతించగా 50 వేలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు, ఆ సొమ్మును తాను ఇవ్వలేక ఏసీబీని ఆశ్రయించినట్లు రైతు గోదా చెన్నారావు తెలిపారు. అవినీతి అధికారుల సమాచారం అందించండి సమాజంలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల సమాచారాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు అందజేయాలని ఆ శాఖ డీఎస్పీ సాయిబాబ తెలిపారు. తన సెల్ నంబరు 9440446146కు గానీ, ఖమ్మం ఇన్స్పెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు సెల్ నంబర్9440446147కు గాని సమాచారం అందించాలని సూచించారు.