రాష్ట్ర విభజనపై రగిలిన విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సమ్మెతో జిల్లా అంతటా చీకట్లు కమ్ముకున్నాయి. మంచినీరు సరఫరా లేక జిల్లాలోని పట్టణాలు, పల్లెవాసులు అవస్థలు పడ్డారు. కరెంటుపై ఆధారపడిన పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడ్డాయి. రైళ్లు రద్దయ్యాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో ప్రజలు ప్రత్యక్షంగా అవస్థలు పడుతున్నప్పటికీ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. 67 రోజులుగా చేస్తున్న ఉద్యమంపై కనీస కదలిక లేని సర్కార్ కరెంటు సమ్మెతో ఆగమేఘాలపై స్పందించి నివారణోపాయాలపై సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో ఎనిమిది వేల మంది కరెంటు ఉద్యోగులుసమ్మెబాట పట్టారు. ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్‌లో పనిచేస్తున్న సుమారు ఐదు వేల మంది జెన్‌కో ఉద్యోగులు, జిల్లాలోని 176 విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న మూడు వేల మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఎన్టీటీపీఎస్‌లో నిర్వహణ లేక గ్రిడ్‌లు ఆగిపోయాయి. విద్యుత్ సరఫరా లేక జిల్లా అంతటా గంటల తరబడి అప్రకటిత విద్యుత్ కోతలు అమలయ్యాయి. మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు పట్టణాల్లో మంచినీటి సరఫరా అరకొరగానే జరిగింది. జిల్లాలో సుమారు 460 గ్రామాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చాలా గ్రామాల్లోను, పట్టణాల్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. గ్రామాల్లో వీధి దీపాలు వెలగలేదు. విద్యుత్‌తో వినియోగించే పరికరాలు పనిచేయక గృహిణులు అవస్థలు పడ్డారు. పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. హోటళ్లు సైతం విద్యుత్ కోతతో కుదేలయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు, శస్త్రచికిత్సలను జనరేటర్ల సాయంతో నిర్వహించారు. జిల్లాలో వయా గుడివాడ మీదుగా వచ్చే తిరుపతి-మచిలీపట్నం-నర్సాపురం(17401)రైలును తిరుపతిలోనే నిలిపివేశారు. మంగళవారం ఉదయం జిల్లాకు చేరాల్సిన ఈ రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ ఎన్జీవో హోంలో జేఏసీ జిల్లా నేతల సమావేశం చీకట్లోనే నిర్వహించడం విశేషం. దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి ఆలయాల్లో అంధకారం నెలకొంది.
రామగుండం నుంచి విద్యుత్..
తెలంగాణ ప్రాంతానికి సరిహద్దున ఉన్న జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలకు సోమవారం కరెంటు కష్టాలు తగ్గాయి. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు అన్ని ప్రాంంతాలకు కోత తప్పలేదు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలకు రామగుండం నుంచి విద్యుత్ లైన్ రావడంతో కోతలు తక్కువగానే అమలు చేశారు. మచిలీపట్నంలో సుమారు ఆరు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణంలో ప్రాంతాలవారీగా కరెంటు కోతలను అమలు చేశారు. కైకలూరు ప్రాంతంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి కోతను అమలు చేసి సోమవారం ఒక్కరోజు సుమారు ఎనిమిది గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పెడన, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, ఉయ్యూరు, నూజివీడు ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కోత విధించారు.
తెగిపడిన విద్యుత్ లైన్..
నాగయలంక నుంచి అవనిగడ్డకు వచ్చే 132 కేవీ విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. వాటికి మరమ్మతులు చేసే నాథుడు లేకపోవడంతో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 6.30 వరకు 26 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్‌కో ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కాంట్రాక్ట్ కార్మికులతో విద్యుత్‌లైను పునరుద్ధరించారు.
విద్యుత్ స్టేషన్ల వద్ద బందోబస్తు..
విద్యుత్ ఉత్పత్తి పడిపోయి జిల్లాలో కోతలు తీవ్రమైన తరుణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై ప్రభుత్వ ఉన్నతస్థాయి యంత్రాంగం దృష్టి సారించింది. రెండు రోజుల కరెంటు సమ్మెపై స్పందించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం హైదరాాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం చీఫ్ సెక్రటరీ పీకే మహంతి జిల్లాల్లోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయనతోపాటు డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ డీజీ మహేందర్‌రెడ్డి, ఎనర్జీ స్పెషల్ సెక్రటరీ పాల్గొని జిల్లా ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో కరెంటు ఉద్యోగుల సమ్మె కారణంగా అన్ని విద్యుత్ ఫీడర్లు, సబ్‌స్టేషన్‌ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగేలా ఎక్కడ సాంకేతిక లోపం ఏర్పడినా దాన్ని సరిచేయాలని చెప్పారు. సమ్మె విరమణకు బుధవారం ఏపీఎన్‌జీవోలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, అంతవరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, ఏఎస్పీ షీమూసిబాజ్‌పాయి, బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ బంద్ చిమ్మచీకట్లు
Published Tue, Oct 8 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement