ఏసీబీ వలలో ట్రాన్స్‌కో అధికారులు
Published Tue, Sep 17 2013 3:37 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
పెనుబల్లి, న్యూస్‌లైన్ : ఓ రైతు దగ్గర నుంచి లంచం తీసుకున్న ఇద్దరు ట్రాన్స్‌కో అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాయిబాబ వెల్లడించిన వివరాల ప్రకారం...పెనుబల్లి మండలం గణేషన్‌పాడు గ్రామానికి చెందిన రైతు గోదా చెన్నారావు తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా పెనుబల్లి ట్రాన్స్‌కో ఇన్‌ఛార్జి ఏఈగా పనిచేస్తున్న హరిప్రవీణ్‌కుమార్, లైన్ ఇన్‌స్పెక్టర్ పరిమి సత్యన్నారాయణ 50 వేల రూపాయలు లంచం అడిగారు.
అంతమొత్తం ఇచ్చుకోలేననగా చివరికి 30 వేలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్న సమయంలో పెనుబల్లి విద్యుత్తు సబ్ స్టేషన్ కార్యాలయం నుంచి ట్రాన్స్‌ఫార్మర్ తీసుకువెళుతున్న రైతు చెన్నారావు నుంచి 30 వేల రూపాయలు లైన్ ఇన్‌స్పెక్టర్ పరిమి సత్యన్నారాయణ తీసుకుని ఆ సొమ్మును ఇన్‌చార్జి ఏఈ హరిప్రవీణ్‌కుమార్‌కు అందజేశారు. దీనిపై నిఘావేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు వరంగల్ రేంజ్ డీఎస్పీ సాయిబాబ ఆధ్వర్యంలో ఖమ్మం ఇన్‌స్పెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, వరంగల్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, సిబ్బంది దాడి చేసి ఏఈ హరి ప్రవీణ్‌కుమార్ వద్ద నుంచి 30 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఏఈని, లైన్ ఇన్‌స్పెక్టర్‌ను విడివిడిగా విచారించారు. రైతు గోదా చెన్నారావు నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదుచేసినట్లు, నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయిబాబ తెలిపారు.
నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా...
తాను 2010 సంవత్సరం మే నెలలో తన పొలానికి ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ లైను ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే ఖర్చును డిడి రూపంలో అధికారులకు అందజేశానని, దీనికి కొంత సొమ్ము లంచంగా ముట్టచెప్పినప్పటికీ నాలుగేళ్లుగా తిప్పించుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో ఏసీబీని ఆశ్రయించానని బాధిత రైతు గోదా చెన్నారావు తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. 2010లో డీడీలు అందజేసినప్పుడు అప్పుడు పనిచేస్తున్న సిబ్బందికి రూ.20 వేలు లంచం ఇచ్చాకే 10 కరెంట్ స్తంబాలను అందజేశారని, అప్పటి నుంచి అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కరెంటు స్తంభాలకు తీగలు లాగడం గానీ, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు గానీ చేయడం లేదని, ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ట్రాన్స్‌ఫార్మర్లు, లైను ఏర్పాటు చేశారని, తాను ఏఈ హరిప్రవీణ్‌కుమార్, లైన్ ఇన్‌స్పెక్టర్ పరిమి సత్యన్నారాయణలను సంప్రతించగా 50 వేలు లంచం ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు, ఆ సొమ్మును తాను ఇవ్వలేక ఏసీబీని ఆశ్రయించినట్లు రైతు గోదా చెన్నారావు తెలిపారు.
అవినీతి అధికారుల
సమాచారం అందించండి
సమాజంలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల సమాచారాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు అందజేయాలని ఆ శాఖ డీఎస్పీ సాయిబాబ తెలిపారు. తన సెల్ నంబరు 9440446146కు గానీ, ఖమ్మం ఇన్‌స్పెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు సెల్ నంబర్9440446147కు గాని సమాచారం అందించాలని సూచించారు.
Advertisement
Advertisement