పేరుకుపోయిన బకాయిలు
- ట్రాన్స్‌కోకు స్థానిక సంస్థల బకాయిలు రూ.93 కోట్లు
- వసూలుకు అధికారుల సన్నద్ధం
తిరుపతి: ట్రాన్స్‌కోకు స్థానిక సంస్థలు రూ.93 కోట్లు బకాయి ఉన్నాయి. వీధిలైట్లు, గ్రామీణ నీటి సరఫరా, ఇతర అవసరాలకు స్థానిక సంస్థలు వాడిన కరెంట్‌కు సంబంధించి ఈ మొత్తం చెల్లించాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ.20 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వీటి వసూలుకు ట్రాన్స్ కో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. డిస్కం గణాంకాల ప్రకారం జిల్లాలో వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాలకు సంబంధించి 20,648 సర్వీసులున్నాయి.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రూ.6.91 కోట్ల బకాయిలు స్థానిక సంస్థలు చెల్లించాల్సి ఉంది. మద నపల్లె సబ్ డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో రూ.15.06 కోట్ల బకాయిలు ఉన్నాయి. పలమనేరు ట్రాన్స్‌కో డివిజన్ పరిధిలోని 90 గ్రామ పంచాయతీల నుంచి రూ.2 కోట్లకు పైగా కరెంట్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాటిలో వీకోట గ్రామపంచాయతీ అత్యధికంగా రూ.80 లక్షలు బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నగరి మండలంలో స్థానిక సంస్థలు రూ.45 లక్షల మేర విద్యుత్ చార్జీలు ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. బకాయిల వసూలుపై దృష్టి సారించిన ఎస్‌పీడీసీఎల్ అధికారులు ముందుగా ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే కరెంట్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయిం చారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీకి వారం రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు.
కొత్తగా సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టిన తాము పంచాయతీ ఆర్థిక స్థితిగతులపై అవగాహన పెంచుకోకనే బకాయిల పేరుతో నోటీసులు పంపడం, కరెంట్ సరఫరా నిలిపివేయడంపై సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు. ఐదేళ్లుగా స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడం, గ్రామాల్లో పన్నులు సరిగా వసూలు కాకపోవడం, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం తదితర కారణాలతో చాలా గ్రామ పంచాయతీలు కనీసం కరెంట్ చార్జీలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాయి. పరిస్థితి అర్థం చేసుకోవాలని అంటున్నారు.
బకాయిల వసూలుకు చర్యలు చేపడుతున్నాం
స్థానిక సంస్థల నుంచి విద్యుత్ చార్జీల బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. బకాయిలు పేరుకుపోవడంతో ఒత్తిడి చేయక తప్పడం లేదు. చెల్లించని గ్రామ పంచాయతీలకు కరెంట్ సర ఫరా నిలిపివేయడం లేదు. మరీ ఎక్కువ మొత్తంలో ఉన్న పంచాయతీలపై ట్రాన్స్‌కో క్షేత్రస్థాయి సిబ్బం ది ఒత్తిడి పెంచుతున్నారు.
- ఎన్‌వీఎస్.సుబ్బరాజు , సూపరింటెండింగ్ ఇంజనీర్, తిరుపతి