తిరుపతి, న్యూస్‌లైన్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని మరోసారి మోపడానికి కిరణ్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఒకటికి రెండుసార్లు పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సతమతమవుతుంటే డిస్కంల ప్రతిపాదనల ముసుగులో ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేస్తోంది. డిస్కంలు సమర్పించిన తాజా ప్రతిపాదనల ప్రకారం వివిధ కేటగిరీలలో విద్యుత్ చార్జీలు యూనిట్‌కు 50 పైసల నుంచి ఒక రూపాయి వరకు పెరగనున్నాయి.
గృహావసరాలకు సంబంధించి 150 యూనిట్ల వరకు యూనిట్‌కు 50 ైపైసల వంతును పెంచేందుకు డిస్కం ప్రతిపాదను విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు సమర్పించింది. కస్టమర్ చార్జీలను రూ.5 నుంచి రూ.20కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలను ఈఆర్‌సీ ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా యధాతధంగా ప్రభుత్వానికి సమర్పిస్తే ఎస్పీడీసీఎల్ పరిధిలోని 6 జిల్లాల్లో వినియోగదారులపై సుమారు 2356 కోట్ల రూపాయల భారం పడనుంది.
తిరుపతి కేంద్రంగా ఉన్న సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్పీడీసీఎల్) పరిధిలో 0-50 యూనిట్ల విద్యుత్ వాడకందార్లు 15 లక్షల మంది ఉన్నారు. 51 నుంచి 100 యూనిట్ల వరకు వాడేవారు 16 లక్షల మంది, 101 నుంచి 200 యూనిట్ల వాడకందార్లు 10.5 లక్షలు, 201-300 యూనిట్ల వరకు వినియోగించేవారు 2.5 లక్షల మంది ఉన్నట్లు డిస్కం గణాంకాలు చెబుతున్నాయి. అలాగే 301-500 యూనిట్లు వాడేవారు 90 వేల మంది, 500 యూనిట్లకు పైబడి వినియోగించేవారు సుమారు 30 వేల మంది ఉన్నారు.
డిస్కంల తాజా ప్రతిపాదనలు అమలైతే సుమారు 45 లక్షల మంది వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడనుంది. అయితే కంపెనీని నష్టాల బాట నుంచి గట్టెక్కించడానికి పెంపు అనివార్యమని డిస్కం అధికారులు అంటున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎస్పీడీసీఎల్‌కు 13,649 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం కాగా ప్రస్తుతం అమలులో ఉన్న టారిఫ్ ప్రకారం కంపెనీకి 8931 కోట్ల రూపాయల ఆదాయం మాత్రం వస్తుందని 4718 కోట్ల రూపాయల లోటు ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు.
తాజా పెంపు ప్రతిపాదనల వల్ల 2356 కోట్ల రూపాయల లోటును పూడ్చుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అంటే డిస్కం ప్రతిపాదనలు యధాతథంగా అమలు జరిగినా కంపెనీకి ఇంకా 2362 కోట్ల రూపాయల లోటు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ చేసి వారి అభిప్రాయాలను ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందనేది ప్రశ్నార్థకం.
ప్రతిపాదనలు మాత్రమే
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు డిస్కంలు సమర్పించింది కేవలం ప్రతిపాద నలు మాత్రమే. అప్పుడే కరెంట్ చార్జీలు పెరిగినట్లు కాదు. ఈఆర్‌సీ రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హియరింగ్ సమావేశాలు నిర్వహించి వినియోగదారులు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయలు సేకరిస్తుంది. మార్పులు, చేర్పులు అవసరమని భావిస్తే చేసి అందరికీ ఆమోదయోగ్యమైన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ తతంగం అంతా పూర్తి కావడానికి 2014 మార్చి వరకు గడువు ఉంది.
- రాధాకృష్ణ, డెరైక్టర్ (ఆపరేషన్), ఎస్పీడీసీఎల్
మళ్లీ ‘కరెంట్’ బాదుడు
Published Thu, Dec 5 2013 3:34 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement