సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సాధారణ బదిలీల కసరత్తు ప్రారంభమైంది. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలో పనిచేస్తున్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఆయా సంస్థల యాజమాన్యాలు పచ్చ జెండా ఊపాయి. ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలు వర్తించనున్నాయి. ఈ నెల 15లోగా ఈ ఉత్తర్వులు జారీ కానున్నాయి. స్థాన చలనం పొందిన ఉద్యోగులు 22వ తేదీలోగా రిలీవ్ కావాల్సి వుండనుంది. 15వ తేదీ తర్వాత బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి రానుంది.
అయితే, క్రమ శిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల విషయంలో మాత్రం సడలింపులుంటాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తుతం అప్రధాన స్థానాల్లో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత గల స్థానాలు కేటాయించాలని, ప్రాధాన్యత గల స్థానాల్లో పనిచేస్తున్న వారికి అప్రధాన పోస్టింగ్‌లు ఇవ్వాలని ఈ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడేళ్లు, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీల్లో డిస్కంలు వేర్వేరు విధానాన్ని అనుసరించనున్నాయి. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను వారి స్థాయిని బట్టి సాధ్యమైనంత వరకు ప్రస్తుత సబ్ డివిజన్/డివిజన్/సర్కిల్ పరిధిలోనే మరో చోటకు బదిలీ చేయనున్నారు. ఐదేళ్లు దాటితే మాత్రం మరో డివిజన్/సర్కిల్‌కు వెళ్లక తప్పదు.
మూడేళ్ల సర్వీసు పూర్తి చేస్తే...
సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈ/ఏడీఈలను అదే సబ్ డివిజన్‌లో మరో పోస్టుకు బదిలీ చేస్తారు. విజ్ఞప్తిపై మరో సబ్ డివిజన్‌కు పంపిస్తారు. సర్కిల్ ఎస్‌ఈ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరుగుతాయి.
ఏఈఈ(సివిల్), ఏఏఓలు అంతకు పై స్థాయి అధికారుల బదిలీలను నేరుగా సంస్థల యాజమాన్యాలు జరుపుతాయి.
ఐదేళ్లు పూర్తి చేసుకుంటే..
సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈ/ఏడీఈలను ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేస్తారు. సర్కిల్ ఎస్‌ఈ పర్యవేక్షణలో ఈ బదిలీలు జరగుతాయి. సర్కిల్ బయటకు బదిలీ కోరుకుంటే సంస్థ యాజమాన్యమే నేరుగా బదిలీ జరపనుంది.
ఏఈఈ(సివిల్), ఏఏఓల అంతకు పై స్థాయి అధికారులను మరో సర్కిల్‌కు సంస్థ యాజమాన్యమే బదిలీ చేయనుంది.
మూడేళ్లు దాటితే స్థాన చలనమే
Published Tue, May 12 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement
Advertisement