power employes transfer
-
ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ కేఎం ధర్మాధికారి కమిషన్ తీసుకునే నిర్ణయం సరైంది కాదని భావిస్తే అప్పీల్‌కు రావచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కేడర్ విద్యుత్ ఉద్యోగుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఆప్షన్లు స్వీకరించి, వారి అభీష్టం మేరకే కేటాయింపులు జరపాలన్న ధర్మాధికారి కమిషన్ మార్గదర్శకాలపై స్పష్టత కోరుతూ తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఏపీ స్థానికత గల 1,157 మంది విద్యుత్ ఉద్యోగులను 2015 జూన్‌లో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేశాయి. అయితే రిలీవైన వారిని స్వీకరించడానికి ఏపీ విద్యుత్ సంస్థలు నిరాకరించడంతో ఈ వివాదం ప్రారంభమైంది. దీంతో ఈ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు గతంలో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏకసభ్య కమిషన్ నిర్ణయమే తుది నిర్ణయమని అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు తాజాగా సుప్రీంకోర్టు అనుమతించడంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఊరట లభించింది. వివాదానికి కారణమైన 1,157 మంది ఉద్యోగులకే పరిమితం చేయకుండా, మొత్తం విద్యుత్ ఉద్యోగుల విభజనను మళ్లీ జరపాలని ధర్మాధికారి ఇటీవల మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కేడర్ విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని రెండు రాష్ట్రాలను కోరారు. విద్యుత్ ఉద్యోగుల విభజనను రిలీవైన 1,157 మంది ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయాలా? అందరూ ఉద్యోగులకు వర్తింపజేయాలా? అన్న అంశంపై తెలంగాణ విద్యుత్ సంస్థలు స్పష్టత కోరుతూ పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు పైవిధంగా తీర్పు వెల్లడించింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ధర్మాధికారి కమిషన్ ఇంకా తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఆ లోగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండబోదని అధికార వర్గాలు తెలిపాయి. -
మూడేళ్లు దాటితే స్థాన చలనమే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సాధారణ బదిలీల కసరత్తు ప్రారంభమైంది. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలో పనిచేస్తున్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఆయా సంస్థల యాజమాన్యాలు పచ్చ జెండా ఊపాయి. ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలు వర్తించనున్నాయి. ఈ నెల 15లోగా ఈ ఉత్తర్వులు జారీ కానున్నాయి. స్థాన చలనం పొందిన ఉద్యోగులు 22వ తేదీలోగా రిలీవ్ కావాల్సి వుండనుంది. 15వ తేదీ తర్వాత బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి రానుంది. అయితే, క్రమ శిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల విషయంలో మాత్రం సడలింపులుంటాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తుతం అప్రధాన స్థానాల్లో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత గల స్థానాలు కేటాయించాలని, ప్రాధాన్యత గల స్థానాల్లో పనిచేస్తున్న వారికి అప్రధాన పోస్టింగ్‌లు ఇవ్వాలని ఈ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడేళ్లు, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీల్లో డిస్కంలు వేర్వేరు విధానాన్ని అనుసరించనున్నాయి. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను వారి స్థాయిని బట్టి సాధ్యమైనంత వరకు ప్రస్తుత సబ్ డివిజన్/డివిజన్/సర్కిల్ పరిధిలోనే మరో చోటకు బదిలీ చేయనున్నారు. ఐదేళ్లు దాటితే మాత్రం మరో డివిజన్/సర్కిల్‌కు వెళ్లక తప్పదు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేస్తే... సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈ/ఏడీఈలను అదే సబ్ డివిజన్లో మరో పోస్టుకు బదిలీ చేస్తారు. విజ్ఞప్తిపై మరో సబ్ డివిజన్‌కు పంపిస్తారు. సర్కిల్ ఎస్ఈ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరుగుతాయి. ఏఈఈ(సివిల్), ఏఏఓలు అంతకు పై స్థాయి అధికారుల బదిలీలను నేరుగా సంస్థల యాజమాన్యాలు జరుపుతాయి. ఐదేళ్లు పూర్తి చేసుకుంటే.. సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈ/ఏడీఈలను ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేస్తారు. సర్కిల్ ఎస్ఈ పర్యవేక్షణలో ఈ బదిలీలు జరగుతాయి. సర్కిల్ బయటకు బదిలీ కోరుకుంటే సంస్థ యాజమాన్యమే నేరుగా బదిలీ జరపనుంది. ఏఈఈ(సివిల్), ఏఏఓల అంతకు పై స్థాయి అధికారులను మరో సర్కిల్‌కు సంస్థ యాజమాన్యమే బదిలీ చేయనుంది.