మృతదేహంతో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా
జటప్రోల్ (వీపనగండ్ల) : మండలంలోని కొప్పునూర్ కు చెందిన వ్యవసాయ కూలీ బడికెల కిష్టన్న (36) శుక్రవారం మధ్యాహ్నం విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత ట్రాన్స్‌కో అధికారులదేనంటూ గ్రామస్తులు శనివారం ఉదయం మృతదేహంతో జటప్రోల్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇన్‌చార్జి ఏఈ నర్సింహ, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. అనేకసార్లు విద్యుత్ సమస్యను అధికారులకు విన్నవించినా పరిష్కారానికి కృషి చేయలేదన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ విషయమై ఏఈని చుట్టుముట్టారు. దీంతో జెడ్పీటీసీ సభ్యుడు మేడిపల్లి లోకారెడ్డి, మాజీ సభ్యుడు కృష్ణప్రసాద్‌యాదవ్, స్థానిక నాయకులు రాంచంద్రారెడ్డి, గోవిందుగౌడ్ విద్యుత్ సిబ్బందితో చర్చలు జరిపారు. చివరకు *లక్ష ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బీచుపల్లియాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గంటధర్మారెడ్డి, స్థానిక నాయకులు ఆనంద్‌యాదవ్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సీఐ రాఘవాచారి, ఎస్‌ఐ వినయ్‌కుమార్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు.