
సాక్షి, సూర్యాపేట, నడిగూడెం: ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విద్యుత్ ఆపరేటర్ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తెల్లబల్లి గ్రామానికి చెందిన నెమ్మాది సుధాకర్ (40) మునగాల మండలం రేపాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
సుధాకర్ గురువారం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తెల్లబల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు రత్నవరం రహదారిలోని ట్రాన్స్‌ఫార్మర్ పనిచేయడం లేదని అతన్ని తీసుకెళ్లారు. ఆ ట్రాన్స్‌ఫార్మర్ మునగాల మండలం ఆకుపాముల విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉందనుకొని అక్కడి నుంచి సుధాకర్ ఎల్‌సీ తీసుకున్నాడు.
కానీ ఆ ట్రాన్స్‌ఫార్మర్ నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉంది. ఈ విషయం తెలియకపోవడంతో సుధాకర్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment