సీఎం కేసీఆర్కు భట్టి విక్రమార్క సవాల్
సాక్షి, సూర్యాపేట : కాళేశ్వరం నీళ్లు, తెచ్చిన అప్పులపై రాష్ట్రంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా శనివారం సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఇక్కడ జరుగుతున్నది రాజకీయ సమాశం కాదు.. ఎన్నికల సమావేశం అంతకన్నాకాదని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలు అమల్లోకి వస్తే.. కోట్లాది రైతాంగ సోదరులు జీవితాలు దుర్భరంగా మారతాయని భట్టి చెప్పారు. ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. రైతాంగ సోదరులు పడుతున్న బాధను శాసనసభలో మీ గొంతుగా వినిపంచాలనే రైతులతో ముఖాముఖీగా మాట్లాడుందుకు ఇక్కడకు వచ్చానని భట్టి చెప్నారు. రైతులతో ముఖాముఖీ అనేది విమర్శలు చేసే వేదికకాదు.. కేవలం వాస్తవాలు, రైతుల కష్టాలు చర్చించుకునే సమావేశం మాత్రమేనని భట్టి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడుతూ.. పొలం బ్రహ్మండంగా ఉంది.. రైతులు బాగున్నారు అంటున్నారు.. నిజంగా పొలం బాగుంటే చందుపట్ల గ్రామంలో ఎండిపోయిన వరిపంటను చూపిస్తూ.. రైతు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఏమోచ్చిందని భట్టి ఆగ్రహంగా అన్నారు. ఈ ప్రాంతానికి రాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రమ ఫలితమే.. ఎస్సారెస్పా కాలువ వచ్చిందని చెప్పారు. గాలివాటపు గెలుపుతో వచ్చిన మంత్రి పదవితో స్థానికమంత్రి జగదీశ్వర్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని భట్టి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి చెబుతున్నట్లు ఇవి కాళేశ్వరం నీళ్లు కావు.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిన శ్రీరాంసాగర్ ఎస్సారెస్పీ.. డిండీ ప్రాజెక్టుల వల్ల వచ్చిన నీళ్లని భట్టి ప్రజలకు వివరించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడకు తీసుకువచ్చిన నీటి చుక్కకూడా లేదని.. లెక్కలతో సహా వివరించేందుకు సిద్ధమని భట్టి తీవ్రస్థాయిలో చెప్పారు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా వచ్చిన నీళ్లను.. కాళేశ్వరం నీళ్లని ప్రజలకు, రైతులకు అబద్దాలు చెబుతారా? అని భట్టి ఆగ్రహంగా ప్రశ్నించారు.
ఎస్సారెస్పీ ఫేజ్ 2 కాలువ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలని భట్టి వివరించారు. ఇక్కడకు వచ్చే నీళ్లు.. మొదట శ్రీరామ్ సాగర్/కడెం ప్రాజెక్టుల నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి... అక్కడనుంచి మిడ్ మానేరుకు అక్కడనుంచి లోయర్ మానేరుకు.. చివరగా ఇక్కడకు నీళ్లు పారుతున్నాయని భట్టి చెప్పారు. ఈ ఏడేళ్లుగా కేసీఆర్ కొత్తగా కట్టిన ఒక్క ప్రాజెక్ట కూడా లేదన్నారు. రాత్రిపూటో.. పగలో మత్తులో మాట్లాడే మాటలు ప్రజలు నమ్మరని భట్టి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఈ ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా.. కాళేశ్వరం లెక్కలు.. అప్పులు.. పారిన నీళ్లపై రాష్ట్రంలో మీరు ఎక్కడ చర్చకు పెట్టినా నేను సిద్ధమే వచ్చి వివరిస్తా.. అని భట్టి ఛాలెంజ్ చేశారు.
స్థానిక మంత్రి నోరుతెరిస్తే.. చెప్పేవన్నీ అబద్దాలని భట్టి అన్నారు. మంత్రి.. ముఖ్యమంత్రి కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో కొత్తగా ఒక్క విద్యుత్ ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?? అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. 2015లో మొదలు పెట్టిన భద్రాద్రి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. అందులోనూ.. ఈ ప్రాజెక్టులో వాడుతున్న సబ్ క్రిటికల్ టెక్నాలజిని 2018లో నాటి ప్రభుత్వం మూసేసిందని చెప్పారు. ఇందులోనూ దాదాపు రూ. 10 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై అదనపు భారం పడుతోందని అన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీపైనా.. రూ. 10 కోట్ల అవినీతినైనా.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? నేను లెక్కలతో సహా వివరిస్తా.. అని భట్టి చెప్పారు. ఈ అవినీతి సొమ్ములు నీకు (మంత్రి జగదీష్ రెడ్డి) చెందుతున్నాయా..? మీ ముఖ్యమంత్రికి చెందుతున్నాయా? అని భట్టి ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని, ప్రజలను ప్రయివేటు బ్యాంకులకు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు.. రూ. 3 లక్షల కోట్ల అప్పలు తెచ్చారని అన్నారు. ఆ అప్పులు కట్టలేక.. పేదవాళ్లు తాగే మద్యం, డీజిల్ పై పన్నులు పెంచుతున్నారని అన్నారు. కేసీఆర్ తెచ్చిన అప్పులు కట్టాల్సింది పేద ప్రజలే అని భట్టి చెప్పారు. ఈ ఏడాది మద్యం మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 30 వేల కోట్ల రూపాయాలు పన్నుల రూపంలో వసూలు చేసిందన్నారు. ఇదిలావుండగా.. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలు వెనక్కు తీసుకోవాలని... ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు ఉండాలని భట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మల్లుతో పాటు.. మాజీ ఎంపీ మధు మాష్కీ గౌడ్, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్యే పొడెం వీరయ్య, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఎన్.ఎస్.యూ.ఐ అద్యక్షుడు బల్మూరి వెంకట్ స్థానిక నేతలు పాల్గొన్నారు.
మధుమాష్కీ గౌడ్
పవర్ లేని పవర్ మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయమంటే ప్రజలనే కుటుంబ సభ్యులుగా చూసుకోవాలి. నమ్మకంతో ఇటు టీఆర్ఎస్ ను, అటు బీజేపీని అధికారం ఇస్తే.. ప్రజలను నట్టేట ముంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మేల్యలు దోపిడీ దారులుగా మారుతున్నారు.
రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి
మరోరెండు సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తోంది. రైతులకు వ్యతిరేకంగా న్రవర్తించిన ఏ ఒక్కరిని వదిలి పెట్టం.
వీ. హనుమంత రావు
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. అప్పులు తెచ్చి రైతులు సన్నబియ్యం వేసి.. నష్టపోతున్నారు.