సాక్షి, హైదరాబాద్: యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన పి.ధాత్రిరెడ్డి సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అల్ ఇండియా 46వ ర్యాంకు సాధించి భేష్ అనిపించుకున్నారు. ధాత్రిరెడ్డి గతంలో సివిల్స్ రాసి 283 ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణలో ఉన్న ఆమె మళ్లీ పట్టుదలతో సివిల్స్ రాసి ఐఏఎస్‌లో 46వ ర్యాంకును సాధించారు. యూపీఎస్‌సీ మంగళవారం వెల్లడించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో ఎంపికై సివిల్స్‌లో తమ సత్తా చాటారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్‌కు 829 మంది ఎంపిక కాగా అందులో 50 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉన్నారు. సివిల్ సర్వీసెస్– 2019కు సంబంధించిన తుది ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 829 మంది అభ్యర్థులను సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. సివిల్స్‌కు ఎంపికైన వారిలో 304 మంది జనరల్ కేటగిరీలో ఎంపికయ్యారు.
కొత్తగా అమల్లోకి తెచ్చిన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూ ఎస్) కోటాలో 78 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఓబీసీ కేటగిరీలో 251, ఎస్సీ 129, ఎస్టీ కేటగిరీలో 67 మంది ఉద్యోగాలు సాధించారు. ఈ ఫలితాల్లో హరియాణాకు చెందిన ప్రదీప్‌సింగ్ ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. ఇక జతిన్ కిషోర్ రెండో ర్యాంకు, ప్రతిభా వర్మ మూడో ర్యాంకు సాధించారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి మల్లవరపు సూర్య తేజ 76వ ర్యాంకు, కట్టా రవితేజ 77వ ర్యాంకు, సింగారెడ్డి రిషికేశ్ రెడ్డి 95వ ర్యాంకు సాధించి టాప్ 100లో నిలిచారు. టాప్ 100 నుంచి 200లోపు ర్యాంకుల్లో మరో ఐదుగురు తెలుగు అభ్యర్థులు ఉండటం విశేషం. ఇక 200 నుంచి 300 ర్యాంకుల్లోపు మరో పది మంది సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment