528 ఐదేళ్లలో ఏనుగుల అసహజ మరణాలు
465 విద్యుదాఘాతం, రైల్వే ప్రమాదాల్లో ఏనుగులు మృత్యువాత
దంతాల కోసం వేటాడి, విష ప్రయోగం చేసి మరో 63 ఏనుగులను మట్టుబెట్టారు!
కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో వివిధ కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో 528 ఏనుగులు అసహజ రీతిలో మృత్యువాత పడ్డాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన నేపథ్యంలో జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా విద్యుదాఘాతం కారణంగా గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24 వరకు) అత్యధికంగా 392 ఏనుగులు మృత్యువాతపడగా.. ఆ తరువాత రైళ్ల ప్రమాదాల బారిన పడి 73 ఏనుగులు మృతి చెందాయి. వేటాడం ద్వారా 50, విషప్రయోగం చేసి 13 ఏనుగులను హతమార్చారు.
విద్యుత్ కంచెలతోనే పెను ముప్పు..
అటవీ ప్రాంతం సమీపంలోని పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండా రైతులు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తుండడంతో అత్యధికంగా ఏనుగులు మృతి చెందుతున్నాయి. విద్యుత్ ఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెలను తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్‌మిషన్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. అండర్ గ్రౌండ్ లేదా, పోల్స్ పైన మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్రం తెలిపింది.
ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేంద్ర ప్రయోజిత పథకం ద్వారా ఏనుగులు, పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైలు పైలట్‌లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగు ఉనికి గురించి పైలట్‌లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్‌పాస్, ఓవర్‌పాస్‌ను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రా ణుల పరిశీలకులు రైల్వే ట్రాక్‌లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం తదితర చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.
ఏనుగు దంతాల కోసం..
ఏనుగు దంతాల కోసం అత్యధికంగా ఒడిశా, మేఘాలయ, తమిళనాడులో వేటాడి హతమారుస్తున్నారని, అలాగే అసోం, ఛత్తీస్‌గఢ్‌లో విషప్రయోగం చేస్తున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రల్లో ఏనుగుల దంతాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. వేటగాళ్లు, విషప్రయోగాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో 71, అసోంలో 55, కర్ణాటకలో 52 మృతి చెందాయి. రైళ్లు ఢీ కొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24, ఒడిశాలో 16 మృతి చెందాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 17, మేఘాలయలో 14 ఏనులను చంపేశారు. అసోంలో విషప్రయోగం ద్వారా 10 ఏనుగులను హతమార్చారు.
Comments
Please login to add a commentAdd a comment