ట్రాన్స్‌కోకు షాక్ !
- భూములు ఇవ్వడానికి రైతుల నిరాకరణ
- చుక్కల్ని అంటుతున్న ధరలే కారణం!
- పెరుగుతున్న విద్యుత్ అవసరాలు
- కొత్త సబ్‌స్టేషన్లు తప్పనిసరి అంటున్న అధికారులు
సాక్షి, విజయవాడ : జిల్లాలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు, లైన్ల ఏర్పాటు కోసం ట్రాన్స్‌కో అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ‘మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి’ అన్న చందంగా మారాయి. భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. రైతులు తమ భూములను ట్రాన్స్‌కోకు అప్పగించేందుకు నిరాకరిస్తున్నారు.
విభజన నేపథ్యంలో..
రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశం ఉంది. విజయవాడలో మల్టీప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల షాపింగ్ కాంపెక్స్‌లు వెలుస్తున్నాయి. జిల్లాలో పలు కంపెనీలు, ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వాటి అవసరాలకు తగినట్లుగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్లు, లైన్లు ఏమాత్రం సరిపోవని ట్రాన్స్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ట్రాన్స్‌కో అధికారులు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను ఇవ్వడానికి రైతులు ముందుకురావడం లేదు. కొన్నిచోట్ల సబ్‌స్టేషన్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. కోర్టులకు సైతం వెళ్తున్నారు.
కొత్తగా వచ్చే సబ్‌స్టేషన్లు ఇవే..
గన్నవరం నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు ఉన్న ఎస్పీడీసీఎల్ సబ్‌స్టేషన్లకు విజయవాడలోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ల నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం విజయవాడలోనే విద్యుత్ లోడు పెరగడంతో గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేస్తున్నారు. నూజీవీడు పరిసర ప్రాంతాల్లో ఎస్పీడీసీఎల్ సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు రంగన్నగూడెంలో సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నారు. ఆయా మార్గాల్లోని గ్రామస్తుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుణదలలో సబ్‌స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు నున్న-గుణదల మధ్య ఉన్న సింగల్ లైన్ బదులుగా డబుల్ సర్కూట్ లైన్ వేయనున్నారు.
కొత్త భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో ట్రాన్స్‌కోకు ఇప్పటికే ఉన్న భూముల్లోనే కొత్తలైన్లు వేస్తున్నారు. నూజీవీడులో 220 కేవీ సబ్‌స్టేషన్‌కు, విజయవాడ భవానీపురంలో 133 కే వీ సబ్‌స్టేషన్‌కు టెండర్లు పిలవనున్నారు. కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అధికారులు టెక్నికల్ అనుమతులైతే సాధిస్తున్నారు గానీ, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
ఇదీ కారణం..
తమ భూముల మీదగా 132 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుందని తెలిస్తేనే గ్రామాల్లో ప్రజలు భయపడుతున్నారు. ఈ లైను వల్ల తమ భూముల ధరలు సగానికి పడిపోతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందువల్లే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. గతంలో విజయవాడ ఆటోనగర్‌లో భవన యజమానులు తమ ఇళ్లపై నుంచి ట్రాన్స్‌కో లైన్లు వెళ్లడానికి వీలు లేదంటూ హైకోర్టుకు వెళ్లడంతో తప్పని పరిస్థితుల్లో భూమిలోంచి కేబుల్ వేసి ఆ ప్రాంతంలో సబ్‌స్టేషన్ ఏర్పాటుచేయాల్సి వచ్చింది.
పంట నష్టం ఏ మూలకు..!
ప్రస్తుతం భూముల ధరలు చుక్కల్ని అంటుతుంటే ట్రాన్స్‌కో మాత్రం రైతులకు నష్టపరిహారం నామమాత్రంగానే ఇస్తోంది. ట్రాన్స్‌కో ఏర్పాటు చేసే టవర్లు, లైన్లు వల్ల దెబ్బతినే పంటకు మాత్రమే నష్టపరిహారం చెల్లించాలని ఆ సంస్థ నిబంధనలు చెబుతున్నాయి. తాము లక్షలాది రూపాయల ఆస్తి నష్టపోతుంటే కేవలం వేల రూపాయల్లో మాత్రమే నష్టపరిహారం వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రాన్స్‌కో నిబంధనలు మార్చి భూములకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
విద్యుత్ అవసరాలను గుర్తించాలి
రాబోయే రోజుల్లో విద్యుత్ అవసరాలు బాగా పెరుగుతాయి. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ట్రాన్స్‌కోకు సహకరించాలి. రెవెన్యూ అధికారులతో సంప్రదించి, వారు సూచించిన విధంగా ట్రాన్స్‌కో నిబంధనల మేరకు రైతుల భూములకు నష్టపరిహారం చెల్లిస్తాం. కొత్తగా సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఉన్న సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై లోడు ఎక్కువ పడి అవి దెబ్బతింటున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వీటి నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి.
- బత్తుల రామయ్య, ట్రాన్స్‌కో ఎస్‌ఈ