హజ్ యాత్ర ఆరంభం
సాక్షి, చెన్నై: ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కా. ఇస్లాంలోని ఐదు సూత్రాల్లో చిట్ట చివరిదిగా హజ్ తీర్థ యాత్రను పరిగణిస్తారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో కనీసం ఒక్క సారైనా ఈ యాత్ర చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రతి ఏటా బక్రీదు నెలలో హజ్‌యాత్ర ఆరంభం అవుతుంది. ప్రపంచ దేశాల్లోని ముస్లింలు ఈ యాత్రతో మక్కానగరం చేరుకుంటారు. బక్రీద్ పండుగ పర్వదినాన మక్కాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. జీవిత కాలంలో తాము చేసిన పాప కర్మల నుంచి విముక్తి కల్పించాలని అల్లాను వేడుకుంటారు. హజ్ యాత్ర : రాష్ట్రంలోని ముస్లింలను ప్రతి ఏటా హజ్ కమిటీ ద్వారా మక్కాకు పంపిస్తున్నారు. ప్రతి ఏటా ఈ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీ, సౌకర్యాలను కల్పిస్తున్నది.
హజ్ కమిటీ ద్వారా అర్హులైన వాళ్లను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరిలో అదృష్ట వంతుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. అదే సమయంలో గత ఏడాది కంటే, ఈ ఏడాది హజ్ యాత్ర సీట్లను కేంద్రం తగ్గించడం ముస్లింలను నిరాశ పరిచింది. రాష్ట్ర వాటాలో కోత వేయడాన్ని సీఎం జయలలిత సైతం ఖండించారు. గత ఏడాది కల్పించిన సీట్లతో పాటుగా, ఈ ఏడాది అదనపు సీట్లను రాబట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడాదికి గాను ఇప్పటి వరకు 3,300 మందిని హజ్ యాత్ర నిమిత్తం లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.
రెండు రోజులుగా చెన్నైలోని హజ్ హౌస్‌లో హజ్ యాత్రకు వెళ్లే తొలి బృందానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సౌదీ పద్ధతులు, అక్కడ వ్యవహరించాల్సిన విధానాలను, కల్పిండిన సదుపాయాలు, సహకరించే అధికారుల గురించి విశదీకరించారు. సర్వం సిద్ధం : 450 మందితో కూడిన తొలి బృందాన్ని సౌదీకి పంపించేందుకు హజ్ హౌస్ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. పాస్ పోర్టులు, వీసా, తదితర వాటిని హాజీలకు అందజేశాయి. మధ్యాహ్న ప్రార్థన అనంతరం హజ్ హౌస్ నుంచి హాజీలను ప్రత్యేక బస్సుల్లో విమానాశ్రయానికి తరలించారు. కొందరు అయితే తమ సొంత వాహనాల్లో విమానాశ్రయానికి చేరుకున్నారు.
హజ్ యాత్రకు వెళ్లే తమ వాళ్లకు వీడ్కోలు పలికేందుకు బంధువులు, ఆప్తులు పెద్ద ఎత్తున మీనంబాక్కంకు తరలి రావడంతో ఆ పరిసరాలు కిటకిటలాడాయి. దీంతో విమానాశ్రయం విదేశీ టెర్మినల్ పరిసరాల్లో గట్టి భద్రత కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ప్రత్యేకంగా నాలుగో నెంబర్ మార్గాన్ని కేటాయించడంతో హాజీలందరూ తమ వాళ్ల నుంచి వీడ్కోలు తీసుకుని హజ్ యాత్రకు బయలు దేరి వెళ్లారు. రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అబ్దుల్ రహీం, వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు తమిళ్ మగన్ హుస్సేన్, హజ్ కమిటీ కార్యవర్గం ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ విభాగం అధికారులు హాజీలకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ప్రయాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ముగియడంతో సాయంత్రం విమానాశ్రయంలో జరిగిన ప్రార్థనాననంతరం హాజీలందరూ సౌదీ అరేబియాకు విమానంలో పయనమయ్యారు. తొలి బృందం పయనంతో మంగళవారం నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో చెన్నై నుంచి జట్లు జట్లుగా హజ్ యాత్రకు ఎంపిక చేసిన హాజీలు పయనం కానున్నారు. నెల రోజులకు పైగా హ జ్ యాత్రను ముగించుకునే ఈ తొలి బృందం అక్టోబరు 20వ తేదీ అర్ధరాత్రి చెన్నైకు చేరుకుంటుంది. కేంద్రం మరిన్ని సీట్లను కేటాయిస్తుందన్న ఆశాభావంతో మరికొంత మంది ముస్లింలు వేచి ఉన్నారు. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న హజ్ కమిటీ వర్గాలు ఇప్పటికే కొందరిని వెయిటింగ్ లిస్టులో ఉంచాయి. సీట్ల సంఖ్య పెరిగిన పక్షంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్లకు హజ్ యాత్ర అవకాశం దక్కుతుంది.