లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి కాషాయం రంగు పూయాలని గతంలో ఆయన అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అది ఇప్పుడు మతపరమైన విమర్శలకు దారితీసింది.
ప్రధాన కార్యాలయంతోసహా హజ్ కమిటీ ఆఫీసులకు కూడా అధికారులు కాషాయం రంగు పూయటంతో ఇస్లాం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆయా కార్యాలయాల గోడల రంగును మార్చేయటంతో అది తీవ్ర స్థాయికి చేరుకుంది. ‘‘ఇది ముమ్మాటికీ ఖండించదగ్గ అంశం. సాధారణంగా ఈ రంగు రాజకీయాల కోసం వాడేది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపు హజ్ యాత్రికులను కూడా కాషాయపు దుస్తులు ధరించమంటారేమో?’’ అని లక్నో హజ్ కమిటీ అధికారి షాహర్ ఖాజీ మౌలానా అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హజ్ కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు.
ఇక షియా పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా యాసుబ్ అబ్బాస్ కూడా యోగి ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా రంగులు మారుస్తారా? అది కూడా మనోభావాలు దెబ్బతీసేలా.. ఇది మంచి పద్ధతి కాదు అంటూ అబ్బాస్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం విమర్శలను చాలా తేలికగా తీసుకుంటోంది. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మోసిన్ రాజా.. సీఎం యోగి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కాషాయం రంగు శక్తి, వెలుగులకు చిహ్నమని... ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన పేర్కొంటున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో కార్యాలయాలకు అంతకు ముందు తెలుపు రంగు ఉండేది. కానీ, గతేడాది అక్టోబర్‌లో వాటన్నింటికి కాషాయం రంగు పూయాలంటూ యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యాలయం లాల్ బహదూర్ శాస్త్రి భవన్‌తో మొదలుపెట్టి ఇప్పటిదాకా 100 స్కూళ్లకు, 50 ఆర్టీసీ బస్సులకు, పలు పోలీస్ స్టేషన్‌లకు కాషాయం రంగు అధికారులు అద్దేశారు.
Comments
Please login to add a commentAdd a comment