ప్రతీకాత్మక చిత్రం
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో పోలీస్ శాఖ దూకుడు ప్రదర్శిస్తోంది. కరడుగట్టిన నేరస్థుల పీచమణచాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశాలివ్వటంతో.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల్లో ఏకంగా 18 ఎన్‌కౌంటర్లు చేసింది. ఇప్పటిదాకా 25 మంది క్రిమినల్స్‌ను అదుపులోకి తీసుకోగా.. ఓ క్రిమినల్‌ను హతమార్చారు.పూర్తి వివరాలను యూపీ డీజీపీ ఓపీ సింగ్ శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలియజేశారు.
‘‘ముజఫర్‌నగర్, గోరఖ్‌పూర్, బులంద్‌షహర్, షామ్లి, హపూర్, మీరట్, సహరన్‌పూర్, భాఘ్‌పట్, కాన్పూర్ మరియు లక్నో ప్రాంతాల్లో ఈ ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. కేవలం వారిని అరెస్ట్ చేసే ఉద్దేశ్యంతోనే దాడులు నిర్వహించాం. కానీ, వారు కాల్పులకు దిగటంతో ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులకు దిగాల్సి వచ్చింది. అయితే వారందరినీ ప్రాణాలతోనే పట్టుకున్నాం. శుక్రవారం సాయంత్రం దాకా మొత్తం 24 మందిని అరెస్ట్ చేశాం. వారి నుంచి పెద్ద ఎత్తున్న నగదు, నగలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. వీరిలో 8 మందిపై నగదు నజరానా కూడా ఉంది’’ అని డీజీపీ వెల్లడించారు.
ఇక 33 కేసులతో యూపీ పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న ఘజియాబాద్ గ్యాంగ్‌స్టర్ ఇంద్రపాల్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టినట్లు ఆయన తెలిపారు.
స్పందించిన జాతీయ మానవహక్కుల సంఘం...
మీడియా కథనాల ఆధారంగా కేసును సుమోటాగా స్వీకరించిన జాతీయ మానవహక్కుల సంఘం.. యోగి ప్రభుత్వంపై మండిపడింది. శాంతి భద్రతలను అదుపు చేసేందుకు తీసుకునే నిర్ణయాలు హింసను ప్రేరేపించేవిగా ఉండకూడదని.. ఎన్‌కౌంటర్లను ప్రోత్సహించే నిర్ణయం సరికాదని అభిప్రాయపడింది. ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేసి యూపీ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు నోటీసులు అందించనున్నట్లు తెలిపింది.
మరోవైపు తుపాకీ మోతలతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత నెలలో మధురలో పోలీసులకు-గ్యాంగ్‌స్టర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment