యోగి ఆదిత్యానాథ్ (పాత చిత్రం)
లక్నో : అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు. 10 నెలల వ్యవధిలో 1,142 ఎన్‌కౌంటర్లు.. 38 మంది క్రిమినల్స్ హతం. గత 25 రోజుల్లో 60 ఎన్‌కౌంటర్లు 8 మంది గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టేశారు. ఇది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ హయాంలో ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖ సాధించిన ట్రాక్ రికార్డు. అయితే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గోరఖ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాస్త తీవ్రంగానే స్పందించారు.
‘‘ప్రతీ ఒక్కరికీ రక్షణ అవసరం. కానీ, తుపాకీనే నమ్ముకున్న కొందరు మాత్రం శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నారు. తుపాకీకి తుపాకీతోనే దెబ్బ కొట్టాలి. అలాంటి వారికి తూటాలతోనే సమాధానం ఇవ్వాలి. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గొద్దని అధికారులను ఆదేశిస్తున్నా. విమర్శలు చేసేవారు ప్రజల బాగోగులు గురించి ఆలోచించటం లేదు. అలాంటప్పుడు వారిని మేమెందుకు పట్టించుకోవాలి’’ అని యోగి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది కాలంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఓవైపు రాజకీయంగా విమర్శలు ఎదుర్కుంటుండగా.. యోగి ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం(గత నవంబర్‌లోనే) నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ ఎన్‌కౌంటర్‌ల విషయంలో యోగి ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు.
అసెంబ్లీలో రచ్చ...
ఇక ఈ అంశంపై గురువారం యూపీ అసెంబ్లీలో పెద్ద రచ్చే జరిగింది. ఫేక్ ఎన్‌కౌంటర్‌లలో అమాయకపు పౌరులను బలి తీసుకుంటున్నారని సమాజ్‌వాదీ పార్టీ వాదన వినిపించగా.. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఫ్లకార్డులు, నినాదాలతో సభను హోరెత్తించారు. ఇక మరికొందరు ప్రతిపక్ష సభ్యులు బెలూన్లను ఎగరేయటం.. గవర్నర్ మీదకు పేపర్లను విసిరేయటంతో మార్షల్స్ సీన్‌లోకి రావటం.. కాస్త ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment