సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమ శాఖ ప్రక్షాళనకు సర్కారు ఉపక్రమించింది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న అధికారుల బదిలీతోపాటు అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణా చేపడుతోంది. వివిధ శాఖల్లో ప్రతి మూడేళ్లు.. అంతకన్నా ముందే ఉన్నతాధికారులు బదిలీ అవుతుండగా, మైనార్టీ సంక్షేమ శాఖలోని కొన్నిపోస్టుల్లో మాత్రం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నారు. దీంతో పలు అంశాల్లో అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు సీఎం కార్యాలయానికి వెళ్లాయి. ఈ క్రమంలో స్పందించిన ఉన్నతాధికారులు మెల్లమెల్లగా ఆ శాఖలో జరుగుతున్న తంతుపై పరిశీలన మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సుదీర్ఘ కాలంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎస్‌ఏ షుకూర్‌ను పలు పోస్టుల నుంచి తప్పించిన ప్రభుత్వం, ఆయా స్థానాల్లో ఇతర అధికారులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు ప్రభుత్వ పోర్టల్‌లో కాకుండా అంతర్గతంగా పంపించడం గమనార్హం.
కీలక పోస్టుల్లో ఆయనే...
సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సీఈడీఎం) డైరెక్టర్‌గా ఉన్న షుకూర్‌ను ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా 2011 డిసెంబర్‌లో నియమించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆయన తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో నియమితులయ్యారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గానూ ప్రభుత్వం ఆయనకు అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. అదేవిధంగా ఉర్దూ అకాడమీ ప్రత్యేకాధికారి హోదాలోనూ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒకే అధికారికి ఇన్ని బాధ్యతలు ఉండడాన్ని పరిశీలించిన ప్రభుత్వం పలు పోస్టుల నుంచి ఆయన్ను రిలీవ్ చేసి కొత్త వారికి కట్టబెట్టింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షానవాజ్ ఖాసీంను ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా మైనార్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి.షఫీఉల్లాను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ...
మైనార్టీ స్టడీ సర్కిల్, ఉర్దూ అకాడమీలో అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మైనార్టీ స్టడీ సర్కిల్‌కు కేటాయించిన నిధులను సీఈడీఎంకు ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. అదేవిధంగా నిధుల వినియోగంలోనూ అవకతవకలు జరిగినట్లు విమర్శలున్నాయి. ఉర్దూ అకాడమీ పోస్టుల భర్తీలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ రిజర్వేషన్లు పాటించకుండా నియామకాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. వీటితోపాటు పలు అంశాల్లోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వ కార్యదర్శులకు లిఖిత పూర్వక ఫిర్యాదులు రావడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మైనార్టీ శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. అక్రమాలపై విచారణ చేపట్టేందుకు చర్యలు మొదలుపెట్టినట్టు సమాచారం.
మైనార్టీ సంక్షేమ శాఖలో ప్రక్షాళన
Published Tue, Apr 2 2019 4:08 AM | Last Updated on Tue, Apr 2 2019 4:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment