సెప్టెంబర్ 2 నుంచి హజ్‌యాత్ర
* యాత్రికులకు ఖుర్బానీ వెసులుబాటు
* రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్‌ఎం షుకూర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్ర-2015 సెప్టెంబర్ రెండు నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎం.షుకూర్ వెల్లడించారు. ముంబైలో జరిగిన కేంద్ర హజ్ కమిటీ సమావేశానికి హాజరై వచ్చిన సందర్భంగా గురువారం హజ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యాత్రికులు హైదరాబాద్ నుంచే హజ్‌యాత్రకు బయలుదేరుతారని ఆయన వివరించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి హజ్‌యాత్రకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సేవలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ సేవలపై అభ్యంతరాలు వ్యక్తమైనా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హమీ ఇచ్చిందన్నారు. మక్కాలో హజ్ ప్రార్థనల సందర్భంగా యాత్రికులు నేరుగా ఖుర్బానీ ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.
సౌదీ ప్రభుత్వం తరఫున ఖుర్బానీకి అంగీకరిస్తే మాత్రం యాత్రికుల ఖర్చుకు ఇచ్చే 469 సౌదీ రియాల్స్ మినహాయించడం జరుగుతుందని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో కేంద్ర హజ్ కమిటీ రెండో విడత డబ్బులు చెల్లించే తేదీ ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. హజ్ యాత్రకు మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.