సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ముస్లింలకు అనేక వరాలు ఇవ్వడంతోపాటు వారిని విద్యావంతుల్ని చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ముస్లిం నాయకులు కితాబిచ్చారు. ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా అనేక నిర్ణయాలు తీసుకోవడంపై పలువురు ముస్లిం నాయకులు ఏపీ మైనార్టీ శాఖ ముఖ్యకార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్‌ను శనివారం విజయవాడలో కలిసి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఇష్టాగోష్టి సమావేశంలో ముస్లింల విద్యకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిధుల విడుదల తదితర విషయాలను ఇంతియాజ్ వారికి వివరించారు. కర్నూలులోని అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.51.40 కోట్లు మంజూరు చేశారన్నారు. దీంతోపాటు గుంటూరులో అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్సిటీ శాఖ ఏర్పాటుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారన్నారు.
ఇప్పటికే ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ ఉర్దూ తరగతులు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో ఎంఏ అరబిక్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని 175 మదర్సాలలో ఆధునిక విద్య (మోడ్రన్ ఎడ్యుకేషన్) బోధించేందుకు అవసరమైన టీచర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఉర్దూ స్కూళ్లలో టీచర్ల నియామకాలకు నిధులు రూ.17 కోట్లు మంజూరు చేసిందని ఇంతియాజ్ వివరించారు.
‘గత ప్రభుత్వం ఎంతో వివక్ష చూపింది’
ముస్లిం నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మైనార్టీ లపై తీవ్రమైన వివక్ష చూపిందని, కనీసం ముస్లింల సమస్యలు చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చివరకు మైనార్టీ శాఖను కూడా వారికి కాకుండా చేసారన్నారు. తమ సమస్యలపై ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటున్న సీఎం వైఎస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. హజ్ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ రూ.14.51 కోట్లు విడుదల చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
ఇందుకు చొరవ చూపిన ఉప ముఖ్యమంత్రి బీఎస్ అంజాద్ బాషా, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్, మజ్లిసుల్ ఉలేమా ప్రతినిధులు ముఫ్తి అబ్దుల్ బాసిత్, ముఫ్తి యూసుఫ్, ముఫ్తి హబీబ్ మౌలానా, డాక్టర్ ఇషాక్, మౌలానా ఫారూఖ్ సిద్దిఖ్, కృష్ణా జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రెహమాన్, ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శి అబ్దుల్ మతీన్, మహమ్మద్ ఖలీలుల్లా, షఫీ అహ్మద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment