‘ఉపకార’ బకాయిలకు మోక్షం
విడతలవారీగా విడుదలకు సర్కార్ చర్యలు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతన బకాయిలకు మోక్షం లభించింది. దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల విడుదలకు తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈ ఏడాది తొలి త్రైమాసికం బడ్జెట్‌లో కొన్ని బకాయిలను విడుదల చేసింది. 2015–16, 2016–17 విద్యాసంవత్సరాల బకాయిలను ప్రాధాన్యతాక్రమంలో విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బడ్జెట్ పరిమితిని బట్టి ఉపకారవేతన బకాయిల బిల్లులను సంక్షేమశాఖల అధికారులు ఆమోదిస్తూ వాటిని ఖజానా విభాగానికి పంపుతున్నారు. ఖజానాశాఖలో ఆమోదం పొందిన వెంటనే విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో జమకానున్నాయి.
బకాయిలు రూ.778.83 కోట్లు : రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించి పోస్టుమెట్రిక్ ఉపకారవేతన బకాయిలు రూ.778.83 కోట్లు ఉన్నాయి. ఇందులో 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.564.44 కోట్లు కాగా, మిగతా 214.39 కోట్లు 2015–16 విద్యా సంవత్సరానికి సంబంధించినవి. ప్రభుత్వం తాజాగా 2017–18 తొలి త్రైమాసిక నిధులను విడుదల చేసింది. ఇందులో గత బకాయిలను పూర్తిస్థాయిలో ఇచ్చే అవకాశం లేదు. తొలుత 2015–16 విద్యా సంవత్సరానికి చెందిన నిధులు విడుదల చేస్తూ ఆ తర్వాత మిగులును 2016–17 సంవత్సరం బకాయిలకు సర్దుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ శాఖల నిధులు అవసరమైనంత అందుబాటులో ఉండడంతో ఆయా శాఖల బకాయిలన్నీ దాదాపు పూర్తి కానున్నాయి.
బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల బకాయిలు మరికొంతకాలం పెండింగ్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2016–17 విద్యాసంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,606.86 కోట్లు ఉండగా అంతకు ముందుకు ఏడాదివి దాదాపు రూ.1,200 కోట్లు ఉన్నాయి. రెండు రకాల బిల్లులను ఖజానాశాఖకు పంపుతున్నా నిధుల అందుబాటును బట్టి ఆన్‌లైన్‌లో వాటికి ఆమోదం తెలుపుతామని సంక్షేమాధికారులు చెబుతున్నారు.