‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక చేయూత’ పేరిట పథకానికి కొత్తరూపు
రంగారెడ్డి జిల్లా : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం కొలిక్కివస్తోంది. ‘స్థానికత’ ఆధారంగా తెలంగాణ విద్యార్థులకే ఫీజు రాయితీ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకనుగుణంగా మార్గదర్శకాలపై తర్జనభర్జన పడుతోంది. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా నిబంధనలను కఠినతరం చేస్తోంది. ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక చేయూత’(ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ - ఫాస్ట్) పేరిట పథకాన్ని పునర్నిర్వచించాలని సర్కారు నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్దిపొందాలంటే సదరు విద్యార్థి కుల, ఆదాయ, స్థానికత సర్టిఫికెట్‌తోపాటు విద్యార్థి తండ్రి, తాత స్థానికత డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. నూతనంగా కోర్సుల్లో చేరే విద్యార్థితోపాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరూ ఈ వివరాలు సమర్పించాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సూచనలిచ్చిన సర్కారు.. త్వరలో మార్గదర్శకాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
విద్యార్థులు సమర్పించిన వివరాల పరిశీలనపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ‘ఆర్థిక చేయూత’ అంశం పూర్తి పారదర్శకంగా అమలు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి కాలేజీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించి దరఖాస్తులను తనిఖీ చేయించాలని భావిస్తోంది. దీని ద్వారా తనిఖీ ప్రక్రియ సులభతరంతోపాటు వేగిరమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మరోవైపు విద్యార్థుల ధ్రువపత్రాల్లో అక్రమాలు బయటపడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం కొలిక్కి?
Published Wed, Jul 9 2014 1:20 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement