Postumetrik students
-
‘ఉపకార’ బకాయిలకు మోక్షం
విడతలవారీగా విడుదలకు సర్కార్ చర్యలు సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతన బకాయిలకు మోక్షం లభించింది. దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల విడుదలకు తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈ ఏడాది తొలి త్రైమాసికం బడ్జెట్లో కొన్ని బకాయిలను విడుదల చేసింది. 2015–16, 2016–17 విద్యాసంవత్సరాల బకాయిలను ప్రాధాన్యతాక్రమంలో విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బడ్జెట్ పరిమితిని బట్టి ఉపకారవేతన బకాయిల బిల్లులను సంక్షేమశాఖల అధికారులు ఆమోదిస్తూ వాటిని ఖజానా విభాగానికి పంపుతున్నారు. ఖజానాశాఖలో ఆమోదం పొందిన వెంటనే విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో జమకానున్నాయి. బకాయిలు రూ.778.83 కోట్లు : రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించి పోస్టుమెట్రిక్ ఉపకారవేతన బకాయిలు రూ.778.83 కోట్లు ఉన్నాయి. ఇందులో 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.564.44 కోట్లు కాగా, మిగతా 214.39 కోట్లు 2015–16 విద్యా సంవత్సరానికి సంబంధించినవి. ప్రభుత్వం తాజాగా 2017–18 తొలి త్రైమాసిక నిధులను విడుదల చేసింది. ఇందులో గత బకాయిలను పూర్తిస్థాయిలో ఇచ్చే అవకాశం లేదు. తొలుత 2015–16 విద్యా సంవత్సరానికి చెందిన నిధులు విడుదల చేస్తూ ఆ తర్వాత మిగులును 2016–17 సంవత్సరం బకాయిలకు సర్దుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ శాఖల నిధులు అవసరమైనంత అందుబాటులో ఉండడంతో ఆయా శాఖల బకాయిలన్నీ దాదాపు పూర్తి కానున్నాయి. బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల బకాయిలు మరికొంతకాలం పెండింగ్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2016–17 విద్యాసంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,606.86 కోట్లు ఉండగా అంతకు ముందుకు ఏడాదివి దాదాపు రూ.1,200 కోట్లు ఉన్నాయి. రెండు రకాల బిల్లులను ఖజానాశాఖకు పంపుతున్నా నిధుల అందుబాటును బట్టి ఆన్లైన్లో వాటికి ఆమోదం తెలుపుతామని సంక్షేమాధికారులు చెబుతున్నారు. -
మా కాలేజీ జాడేదీ?
పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాల దరఖాస్తుల ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఈ నెల 30తో గడువు ముగియనుంది. కానీ ఇప్పటికి వందలాది కాలేజీలు ఈపాస్ వెబ్సైట్లో కనిపించకపోవడంతో ఆయా కాలేజీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. జిల్లావ్యాప్తంగా 1,207 కాలేజీలున్నాయి. ఇందులో ఇంటర్ కాలేజీలు మిన హాయిస్తే 904 డిగ్రీ, వృత్తివిద్యా కాలేజీలు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 3.2లక్షల మంది విద్యార్థులున్నాయి. విద్యాసంవత్సరం మధ్యలోనే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తులు స్వీకరించాల్సిఉండగా.. సర్కారు నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో తక్కువ వ్యవధి ఉండడంతో అనేక కాలేజీలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఫలితంగా ఆయా కాలేజీలు ఈపాస్ వెబ్సైట్లో కనిపించక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో ఇంటర్మీడియెట్ కాలేజీలు మినహాయిస్తే.. 904 కాలేజీలు కొనసాగుతున్నాయి. వీటిలో 750 కాలేజీలు ఇప్పటికే వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే పూర్తిస్థాయి వివరాలు ఇవ్వకపోవడంతో పలు కాలేజీలను అధికారులు తిరస్కరించారు. ఈ క్రమంలో జిల్లాలో కేవలం 422 కాలేజీలకు మాత్రమే ఆమోదముద్ర పడడంతో అవి మాత్రమే ఈపాస్ వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. మిగతా 482 కాలేజీలు ఈ పాస్‌లో జాడలేకపోవడంతో అందులో చదువుతున్న విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తుకు దూరమయ్యారు. కొత్త విధానంతో.. కాలేజీల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో జిల్లాస్థాయిలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు రిజిస్ట్రేషన్ దరఖాస్తులు అందించేవారు. వాటిని వెరిఫై చేసిన అనంతరం ఈ పాస్‌లో నమోదుకు ఆమోదించేవారు. కానీ 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి.. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ వద్ద కాకుండా నేరుగా సంబంధిత యూనివర్సిటీల్లోనే రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలోని 904 కాలేజీలే ఉస్మానియా, జేఎన్టీయూ, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ తదితర 17 వర్సిటీల్లో సంబంధిత వాటిలో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. ఈ క్రమంలో పరిశీలన మరింత పకడ్బందీ కావడంతో పలు కాలేజీలు రిజిస్ట్రేషన్‌కు అర్హత సాధించలేక పోయారు. గడువు పెంచితేనే ఫలితం.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈనెల 30వరకు గడువుంది. అయితే సగానికిపైగా కాలేజీలు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో విద్యార్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. అసలే విద్యాసంవత్సరం ముగియడం.. ఆపై ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుకు మరో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గడువు పెంచకుంటే వారికి ఉపకార ఫలితాలు శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో గడువు పెంచాల్సిందేనని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఫీజు రీయింబర్స్మెంట్ అంశం కొలిక్కి?
‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక చేయూత’ పేరిట పథకానికి కొత్తరూపు రంగారెడ్డి జిల్లా : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశం కొలిక్కివస్తోంది. ‘స్థానికత’ ఆధారంగా తెలంగాణ విద్యార్థులకే ఫీజు రాయితీ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకనుగుణంగా మార్గదర్శకాలపై తర్జనభర్జన పడుతోంది. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా నిబంధనలను కఠినతరం చేస్తోంది. ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక చేయూత’(ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ - ఫాస్ట్) పేరిట పథకాన్ని పునర్నిర్వచించాలని సర్కారు నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్దిపొందాలంటే సదరు విద్యార్థి కుల, ఆదాయ, స్థానికత సర్టిఫికెట్‌తోపాటు విద్యార్థి తండ్రి, తాత స్థానికత డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. నూతనంగా కోర్సుల్లో చేరే విద్యార్థితోపాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరూ ఈ వివరాలు సమర్పించాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సూచనలిచ్చిన సర్కారు.. త్వరలో మార్గదర్శకాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. విద్యార్థులు సమర్పించిన వివరాల పరిశీలనపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ‘ఆర్థిక చేయూత’ అంశం పూర్తి పారదర్శకంగా అమలు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి కాలేజీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించి దరఖాస్తులను తనిఖీ చేయించాలని భావిస్తోంది. దీని ద్వారా తనిఖీ ప్రక్రియ సులభతరంతోపాటు వేగిరమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మరోవైపు విద్యార్థుల ధ్రువపత్రాల్లో అక్రమాలు బయటపడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.