పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాల దరఖాస్తుల ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఈ నెల 30తో గడువు ముగియనుంది. కానీ ఇప్పటికి వందలాది కాలేజీలు ఈపాస్ వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో ఆయా కాలేజీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. జిల్లావ్యాప్తంగా 1,207 కాలేజీలున్నాయి. ఇందులో ఇంటర్ కాలేజీలు మిన హాయిస్తే 904 డిగ్రీ, వృత్తివిద్యా కాలేజీలు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 3.2లక్షల మంది విద్యార్థులున్నాయి. విద్యాసంవత్సరం మధ్యలోనే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులు స్వీకరించాల్సిఉండగా.. సర్కారు నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో తక్కువ వ్యవధి ఉండడంతో అనేక కాలేజీలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఫలితంగా ఆయా కాలేజీలు ఈపాస్ వెబ్‌సైట్‌లో కనిపించక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో ఇంటర్మీడియెట్ కాలేజీలు మినహాయిస్తే.. 904 కాలేజీలు కొనసాగుతున్నాయి. వీటిలో 750 కాలేజీలు ఇప్పటికే వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే పూర్తిస్థాయి వివరాలు ఇవ్వకపోవడంతో పలు కాలేజీలను అధికారులు తిరస్కరించారు. ఈ క్రమంలో జిల్లాలో కేవలం 422 కాలేజీలకు మాత్రమే ఆమోదముద్ర పడడంతో అవి మాత్రమే ఈపాస్ వెబ్‌సైట్లో కనిపిస్తున్నాయి. మిగతా 482 కాలేజీలు ఈ పాస్‌లో జాడలేకపోవడంతో అందులో చదువుతున్న విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు దరఖాస్తుకు దూరమయ్యారు.
కొత్త విధానంతో..
కాలేజీల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో జిల్లాస్థాయిలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు రిజిస్ట్రేషన్ దరఖాస్తులు అందించేవారు. వాటిని వెరిఫై చేసిన అనంతరం ఈ పాస్‌లో నమోదుకు ఆమోదించేవారు. కానీ 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి.. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ వద్ద కాకుండా నేరుగా సంబంధిత యూనివర్సిటీల్లోనే రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలోని 904 కాలేజీలే ఉస్మానియా, జేఎన్‌టీయూ, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ తదితర 17 వర్సిటీల్లో సంబంధిత వాటిలో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. ఈ క్రమంలో పరిశీలన మరింత పకడ్బందీ కావడంతో పలు కాలేజీలు రిజిస్ట్రేషన్‌కు అర్హత సాధించలేక పోయారు.
గడువు పెంచితేనే ఫలితం..
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈనెల 30వరకు గడువుంది. అయితే సగానికిపైగా కాలేజీలు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో విద్యార్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. అసలే విద్యాసంవత్సరం ముగియడం.. ఆపై ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుకు మరో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గడువు పెంచకుంటే వారికి ఉపకార ఫలితాలు శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో గడువు పెంచాల్సిందేనని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మా కాలేజీ జాడేదీ?
Published Wed, May 27 2015 2:09 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement