గతేడాది లక్షన్నర.. ఈసారి 87 వేల దరఖాస్తులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలు, జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) ప్రవేశాల కోసం ఈసారి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. గత ఏడాది తెలంగాణ జిల్లాల నుంచి లక్షన్నర మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఈసారి ఆ సంఖ్య 87 వేలకు పడిపోయింది. ప్రవేశాల నోటిఫికేషన్ జారీలో ఆలస్యం కావడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో డీఈఈసెట్ నిర్వహణ, నోటిఫికేషన్ జారీకి అవసరమైన చట్ట సవరణ చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లే విద్యార్థులు ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరిపోయినట్లు సమాచారం.
డైట్, డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష డీఈఈసెట్-2015 నోటిఫికేషన్‌ను ఈనెల 5వ తేదీన జారీ చేసిన విద్యాశాఖ 8వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించేలా, 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపేలా చర్యలు చేపట్టింది.
సోమవారం వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు, మంగళవారం దరఖాస్తులు అందించేందుకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం వరకు 87 వేల దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల 9న డీఈఈసెట్ నిర్వహించి, ఫలితాలు, ర్యాంకులను వచ్చే నెల 22న ప్రకటించనున్నట్లు తెలిపాయి.
అందుబాటులోకి రానున్న 15 వేల సీట్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో దాదాపు 15 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 100 చొప్పున వేయి సీట్లు ఉండగా, 272 ప్రైవేటు కాలేజీల్లో 50 చొప్పున 13,600 సీట్లు ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేటు కాలేజీల్లోనూ 100 వరకు సీట్లకు అనుమతి తెచ్చుకున్నాయి. దీంతో ఈసారి డీఎడ్‌లో 15 వేల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
డైట్‌సెట్‌కు తగ్గిన ఆదరణ
Published Tue, Jul 21 2015 3:34 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement
Advertisement