diploma in elementary education
-
నేటి నుంచి డీఎడ్ సెమిస్టర్ పరీక్షలు
యడ్లపాడు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (2019–21) విద్యార్థులకు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5, 6, 7, 8వ తేదీలలో జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ జి.మాణిక్యాంబ తెలిపారు. రోజూ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో వసతులు కల్పించింనట్టు వెల్లడించారు. విద్యార్థులు మాస్కు ధరించాలని, శానిటైజర్లను వెంట తెచ్చుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. 601 మంది పరీక్షలకు హాజరు నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 601 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గుంటూరు పరీక్ష కేంద్రంలో 188 మంది, బాపట్లలో 115 మంది, నరసరావుపేటలో 172 మంది, యడ్లపాడు మండలం బోయపాలెంలోని జిల్లా ప్రభుత్వ డైట్ కళాశాలలో 126 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు వివరించారు. బోయపాలెంలో 144 సెక్షన్ బోయపాలెం ప్రభుత్వ డైట్ కళాశాలలో సోమవారం నుంచి ఫస్టియర్ రెండోసెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నందున పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ జె.శ్రీనివాసరావు తెలిపారు. డైట్ కళాశాల సమీపంలో, బోయపాలెం గ్రామంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులను పరీక్ష జరిగే సమయంలో మూసివేయాలని ఆదేశించారు. ఈనెల 8 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. -
డీఎడ్ పేపర్ వాల్యూయేషన్ బహిష్కరణ
సాక్షి, గుంటూరు : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీ ఎడ్) ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను శుక్రవారం గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరైన 130 మందికి పైగా ప్రైవేటు డీఎడ్ కళాశాలల అధ్యాపకులు గతేడాది డీఎడ్ ద్వితీయ సంవత్సర మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూరేషన్ బకాయిలను చెల్లించకపోవడంతో ఆందోళనకు దిగారు. రెమ్యూనరేషన్ బకాయిలు చెల్లించిన తరువాతే మూల్యాంకన విధుల్లో పాల్గొంటామని అక్కడే ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్ మాణిక్యాంబకు స్పష్టం చేసి, వాల్యూయేషన్ విధులను బహిష్కరించారు. అనంతరం క్యాంప్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా చీఫ్ ఎగ్జామినర్, ఎగ్జామినర్ విధులకు హాజరైన అధ్యాపకులు బి.వెంకటేశ్వరరావు, మరియదాసు, టి.దాసు, రాజ్‌కుమార్ మాట్లాడుతూ గతేడాది వాల్యూయేషన్ చేసిన అధ్యాపకులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన ఫలితంగా తాజాగా డీఎడ్ ప్రథమ సంవత్సర వాల్యూయేషన్ విధులను బహిష్కరిస్తున్నామని చెప్పారు. గతేడాది వాల్యూయేషన్ విధుల్లో పాల్గొన్న 177 మంది అధ్యాపకులకు డీఏతో పాటు పేపర్ వాల్యూయేషన్‌కు కలిపి మొత్తం రూ.9 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉందని తెలిపారు. డీఈవో హామీతో ఆందోళన విరమణ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అధ్యాపకులు ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న డీఈవో ఆర్.ఎస్.గంగా భవానీ అక్కడకు చేరుకున్నారు. అధ్యాపకులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గతేడాదికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ చెల్లింపులు జరగని మాట వాస్తవమేనని, బకాయిలను 20 రోజుల్లోపు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన అధ్యాపకులు తిరిగి వాల్యూయేషన్ విధులకు హాజరయ్యారు. ఈనెల 20వ తేదీ వరకూ వాల్యూయేషన్ జరగనుంది. -
ఉపాధ్యాయ విద్యలో బీసీలే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలు(బీసీ) ఉపాధ్యాయవిద్యలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సులను అభ్యసిస్తున్నవారిలో 67 శాతం బీసీలు, ఆ తరువాత స్థానంలో ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాల వారీగా, వివిధ కోర్సులను అభ్యసిస్తున్నవారి వివరాలను బీసీ కమిషన్ విద్యాశాఖ నుంచి సేకరించింది. గత ఏడాది ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసినవారిలోనూ బీసీలే అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. టెట్‌కు హాజరైన వారిలో 58.99 శాతం బీసీలుండగా, ఆ తరువాత 18.77 శాతంతో రెండో స్థానంలో ఎస్సీ అభ్యర్థులు ఉన్నట్లు తేల్చింది. పరీక్షకు మొత్తంగా 3,40,567 మంది హాజరైతే అందులో బీసీలు 2,00,922 మంది ఉండటం గమనార్హం. 85 శాతం గ్రామీణ ప్రాంతాల వారే.. ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న వారిలో 85 శాతం మంది అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయ విద్యపై ఆసక్తి చూపుతున్న వారిలో పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తక్కువేనని పేర్కొంటున్నారు. అందులోనూ వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులే ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా త్వరగా జీవితంలో స్థిరపడవచ్చన్న భావనే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఇంటర్మీడియట్ తరువాతే డీఎడ్ చేసే అవకాశం ఉన్నందునా ఎక్కువ కాలం చదివే అవకాశంలేని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు డీఎడ్ పూర్తి చేసి ప్రభుత్వ రంగం లేదా ప్రైవేటు రంగంలో స్థిరపడవచ్చన్న భావనే ఇందుకు కారణమని చెబుతున్నారు. టెట్‌లో అర్హత సాధించిన ఓసీలు 10 శాతమే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఓసీలే తక్కువగా అర్హత సాధిస్తుండగా, ఎస్సీల్లో ఎక్కువ అర్హత శాతం ఉంది. ఎస్సీల తరువాత ఎస్టీలు ఎక్కువ శాతం అర్హతను సాధిస్తున్నారు. బీసీలు తక్కువ అర్హత పొందుతున్నారు. అయితే ఇందుకు కారణం అర్హత మార్కుల విధానమే. అర్హత మార్కుల విధానం ఓసీలకు 60 శాత, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం ఉంది. గత ఏడాది నిర్వహించిన టెట్‌లో ఓసీలు 10 శాతం మందే అర్హత సాధించగా, బీసీలు 29.40 శాతం మంది, ఎస్సీలు 53.68 శాతం మంది, ఎస్టీలు 38.22 శాతం మంది అర్హత సాధించారు. -
డీఎడ్‌కు తగ్గిన డిమాండ్
వెబ్ ఆప్షన్లు ఇచ్చింది కేవలం 27 వేల మంది ఈ నెల 26న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుకు ఈసారి డిమాండ్ తగ్గింది. డీఈఈసెట్-2015 పరీక్షకు 1,05,382 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 68,884 మంది అర్హత సాధించారు. వెబ్ కౌన్సెలింగ్‌లో కేవలం 27 వేల మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ప్రభుత్వ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాలకు చేపట్టిన డీఈఈసెట్-2015 వెబ్ఆప్షన్ల గడువు సోమవారంతో ముగిసింది. గతేడాది జూలైలో జరగాల్సిన ప్రవేశాల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 26న సీట్లు కేటాయించనున ్నట్లు డీఈఈసెట్ కన్వీనర్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా 10 ప్రభుత్వ డైట్, 183 ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లోని 8,700 కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మరో 1,890 మేనేజ్మెంట్ కోటా సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకోనున్నాయని వెల్లడించారు. -
డైట్‌సెట్‌కు తగ్గిన ఆదరణ
గతేడాది లక్షన్నర.. ఈసారి 87 వేల దరఖాస్తులే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలు, జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) ప్రవేశాల కోసం ఈసారి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. గత ఏడాది తెలంగాణ జిల్లాల నుంచి లక్షన్నర మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఈసారి ఆ సంఖ్య 87 వేలకు పడిపోయింది. ప్రవేశాల నోటిఫికేషన్ జారీలో ఆలస్యం కావడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో డీఈఈసెట్ నిర్వహణ, నోటిఫికేషన్ జారీకి అవసరమైన చట్ట సవరణ చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లే విద్యార్థులు ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరిపోయినట్లు సమాచారం. డైట్, డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష డీఈఈసెట్-2015 నోటిఫికేషన్‌ను ఈనెల 5వ తేదీన జారీ చేసిన విద్యాశాఖ 8వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించేలా, 9వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు పంపేలా చర్యలు చేపట్టింది. సోమవారం వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు, మంగళవారం దరఖాస్తులు అందించేందుకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం వరకు 87 వేల దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల 9న డీఈఈసెట్ నిర్వహించి, ఫలితాలు, ర్యాంకులను వచ్చే నెల 22న ప్రకటించనున్నట్లు తెలిపాయి. అందుబాటులోకి రానున్న 15 వేల సీట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో దాదాపు 15 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 100 చొప్పున వేయి సీట్లు ఉండగా, 272 ప్రైవేటు కాలేజీల్లో 50 చొప్పున 13,600 సీట్లు ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేటు కాలేజీల్లోనూ 100 వరకు సీట్లకు అనుమతి తెచ్చుకున్నాయి. దీంతో ఈసారి డీఎడ్‌లో 15 వేల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. -
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ (డీఈఈ సెట్) నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ప్రతిభ చూపడం ద్వారా ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్లు), ప్రైవేటు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశించవచ్చు. రెండేళ్ల కాలవ్యవధి గల ఈ కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసి, ఉన్నతమైన ఉపాధ్యాయ కొలువును సొంతం చేసుకోవచ్చు. ఈ క్రమంలో డీఈఈ సెట్ విధానం, పరీక్షలో విజయానికి సబ్జెక్టు నిపుణుల సూచనలు తదితరాలపై ఫోకస్... ప్రభుత్వ డైట్లు, ప్రైవేటు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి డీఈఈ సెట్-2015 నిర్వహిస్తారు. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాలను డీఈఈ పూర్తిచేసిన అభ్యర్థులతోనే భర్తీ చేస్తుండటంతో ఈ కోర్సుకు డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. అయినా పోటీ తీవ్రంగానే ఉండనుంది. ఇందులో మంచి ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కళాశాలలో సీటును చేజిక్కించుకోవచ్చు. అర్హతలు: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు డీసెట్ రాసేందుకు అర్హులు. ఇంటర్లో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ చాలెంజ్డ్ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంటర్లో వృతివిద్యా కోర్సులు పూర్తిచేసిన వారు డీఈఈ సెట్‌కు అనర్హులు. వయసు: 2015, సెప్టెంబర్ 1 నాటికి 17 సంవత్సరాలు నిండాలి. పరీక్ష విధానం డీసెట్ పరీక్ష ప్రశ్నపత్రం మూడు భాగాలుగా ఉంటుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పేపర్ ఉంటుంది. సమయం రెండు గంటలు. పార్ట్-2, పార్ట్-3లోని ప్రశ్నలు 8, 9, 10 తరగతుల సబ్జెక్టుల స్థాయిలో ఉంటాయి. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్; ఉర్దూ/ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష విధానం గతేడాది మాదిరిగానే ఉంది. పరీక్ష విధానం పార్ట్-1 సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు జనరల్ నాలెడ్జ్ 5 5 టీచింగ్ ఆప్టిట్యూడ్ 5 5 పార్ట్-2 జనరల్ ఇంగ్లిష్ 10 10 తెలుగు/ఉర్దూ/తమిళం 20 20 పార్ట్-3 మ్యాథమెటిక్స్ 20 20 ఫిజికల్ సైన్స్ 10 10 బయలాజికల్ సైన్స్ 10 10 సోషల్ 20 20 మొత్తం 100 100 ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ర్యాంకులు కేటాయిస్తారు. ఓసీ, బీసీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అర్హత మార్కులు లేవు. 85 శాతం సీట్లను స్థానిక అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లు అన్రిజర్వ్డ్ సీట్లు. ముఖ్య తేదీలు ఫీజు: రూ.200, ఏపీ ఆన్లైన్ లేదా పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జులై 20, 2015. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: జులై 21, 2015. ఆన్లైన్ ద్వారా హాల్‌టికెట్ల పంపిణీ: జులై 30, 2015. పరీక్ష తేదీ: ఆగస్టు 9, 2015. పరీక్ష సమయం: ఉదయం 10.30 నుంచి 12.30 వరకు. ఫలితాల వెల్లడి: ఆగస్టు 22, 2015. వెబ్సైట్: tsdeecet.cgg.gov.in ప్రిపరేషన్ ప్రణాళిక జనరల్ నాలెడ్జ్ ఈ విభాగానికి అయిదు మార్కులు కేటాయించారు. కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి. దీనికి పేపర్ చదవడం ఉపయోగపడుతుంది. స్టాక్ జీకేలో భాగంగా క్రీడలు, కప్‌లు, విజేతలు; పుస్తకాలు-రచయితలు; శాస్త్రీయ అధ్యయనాలు; శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు; దేశాలు-రాజధానులు; దేశాలు-కరెన్సీలు; విటమిన్లు-లోపం వల్ల కలిగే వ్యాధులు, లభించే పదార్థాలు; వివిధ దేశాలు-పాతపేర్లు తదితర అంశాలను చదవాలి. ఉదా: 2015 బ్రిక్స్ దేశాల సదస్సు రష్యాలోని ఏ నగరంలో జరిగింది? 1) భారత్‌లోని న్యూఢిల్లీ 2) బ్రెజిల్‌లోని బ్రసీలియా 3) చైనాలోని బీజింగ్ 4) రష్యాలోని ఉఫా ఉదా: డ్యూరాండ్ కప్ ఏ ఆటకు సంబంధించినది? 1) క్రికెట్ 2) హాకీ 3) ఫుట్‌బాల్ 4) బ్యాడ్మింటన్ టీచింగ్ ఆప్టిట్యూడ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే బోధనా ప్రవృత్తి. వృత్తిపై గౌరవం, విద్యార్థులపై ప్రేమ, సేవా భావం, పట్టుదల, సత్ప్రవర్తన.. ఇవి బోధనా ప్రవృత్తి ముఖ్య లక్షణాలు. వీటితో పాటు నేటి విద్యా విధానంపై అవగాహన; ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాపథకాలు, ప్రస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు తదితరాలపై దృష్టిసారించాలి. తరగతి గది నిర్వహణ, నూతన విద్యా విధానం, పాఠశాల ఎన్విరాన్మెంట్, బోధన సామర్థ్యం తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఇచ్చిన ప్రశ్నను, ఆప్షన్లను బాగా అర్థం చేసుకొని, తార్కికంగా ఆలోచిస్తే ఈ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు. పరీక్ష రాస్తున్న అభ్యర్థి తనను తాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఊహించుకొని, విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి. ఉదా: {పస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న మూల్యాంకన విధానం ఏది? 1) నిర్మాణాత్మక మూల్యాంకనం 2) రూపాత్మక మూల్యాంకనం 3) గుణాత్మక మూల్యాంకనం 4) నిరంతర సమగ్ర మూల్యాంకనం తెలుగు డీఈఈ సెట్లో తెలుగుకు 20 మార్కులు కేటాయించారు. మంచి ర్యాంకు సాధించాలంటే ఇందులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. కావ్యాలు-కవులు, పుస్తకాలు-రచయితలు, కవుల బిరుదులు, అర్థాలు, పర్యాయపదాలు, అలంకారాలు, సంధులు, సమాసాలు, వాక్యాలు, ఛందస్సు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వ్యాకరణ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఉదా: ‘‘ఈ చీకటి ఆకాశం నుంచి కురుస్తున్న కాటుకా అన్నట్లున్నది’’... ఇది ఏ అలంకారం? 1) శ్లేషాలంకారం 2) ఉపమా అలంకారం 3) ఉత్ప్రేక్ష అలంకారం 4) స్వభావోక్తి అలంకారం ఇంగ్లిష్ జనరల్ ఇంగ్లిష్ నుంచి పది ప్రశ్నలు ఇస్తారు. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కరెక్ట్ వెర్బ్ ఫార్మ్స్, వాయిస్, వొకాబ్యులరీ, సింపుల్-కాంపౌండ్-కాంప్లెక్స్ సెంటెన్సెస్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పదో తరగతి స్థాయిలో గ్రామర్ అంశాలపై దృష్టిసారించడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఫిజికల్ సైన్స్ ఈ విభాగానికి పది మార్కులు కేటాయించారు. గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే ఫిజిక్స్ నుంచి అయిదు ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి అయిదు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. 8, 9, 10 తరగతి పాఠ్యపుస్తకాల్లో ఫిజికల్ సైన్స్‌కు సంబంధించి 34 యూనిట్లు ఉన్నాయి. భౌతిక శాస్త్రంలో ధ్వని, ఉష్ణం, విద్యుత్, కాంతి, బలం, పని-శక్తి అధ్యాయాలను క్షుణ్నంగా చదవాలి. రసాయన శాస్త్రంలో రసాయన చర్యలు-సమీకరణాలు, ఆమ్లాలు-క్షారాలు-లవణాలు, పరమాణు నిర్మాణం, రసాయన బంధం, మూలకాల వర్గీకరణ, లోహసంగ్రహణ శాస్త్రం, కర్బన సమ్మేళన రసాయన శాస్త్రం ముఖ్యమైన అంశాలు. నిర్వచనాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, శాస్త్రవేత్తలు, ఉదాహరణలు, ఉపయోగాలు, నియమాలు, సమస్యలు-సాధనలు, అణునిర్మాణాలు, ఫార్ములాలు, భౌతిక స్థిరాంకపు విలువలు నుంచి ప్రశ్నలు వస్తాయి. బయాలజీ శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు, రక్త కణాలు, జీవుల్లో వైవిధ్యం-వర్గీకరణ, పోషకాహార లోపం-వ్యాధులు, శాస్త్రీయ నామాలు, శరీర భాగాలు, ఎరువులు, పోషక పదార్థాలు, ఆల్కలాయిడ్లు, వినాళ గ్రంథులు- అవి ఉండే స్థానాలు- స్రవించే హార్మోన్లు, జీవులు-ప్రసరణ వ్యవస్థలు, ఫైటో హార్మోన్లు, జీర్ణ ఎంజైమ్‌లు వంటి అంశాలను చదవాలి. మ్యాథమెటిక్స్ గణితంలో ఎక్కువ ప్రశ్నలు పదో తరగతి నుంచి వస్తాయి. అందువల్ల బహుపదులు, వర్గసమీకరణాలు, శ్రేఢులు, నిరూపక రేఖాగణితం, త్రికోణమితి, సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత పాఠ్యాంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు బీజగణితం, వ్యాపార గణితం, క్షేత్ర గణితం పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి. రేఖా గణితం ప్రిపరేషన్ తప్పనిసరి. ప్రతి పాఠ్యాంశంలోని ముఖ్యమైన భావనలు, సూత్రాలను ఒకచోట రాసుకోవాలి. సమస్యల్ని షార్ట్‌కట్ పద్ధతిలో సాధించడం ప్రాక్టీస్ చేయాలి. గత ప్రశ్నపత్రాల్ని ప్రాక్టీస్ చేయాలి. సోషల్ గత పరీక్షపత్రాల పరిశీలన ద్వారా ఏ అంశాల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తరగతి భూగోళశాస్త్రం చరిత్ర పౌరశాస్త్రం అర్థశాస్త్రం మొత్తం 8 2 2 1 1 6 9 2 2 1 1 6 10 2 2 2 2 8 మొత్తం 6 6 4 4 8 భూగోళశాస్త్రంలో ముఖ్యంగా పటాల అధ్యయనం-విశ్లేషణ, భూమి-భూ చలనాలు-భూ ఆవరణాలు; భారతదేశ భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, వ్యవసాయం, నీటిపారుదల వసతులు అంశాలపై దృష్టిసారించాలి. అట్లాస్ సహాయంతో పాఠాల్లో తారసపడే వివిధ భౌగోళికాంశాలను, దేశాలు, ముఖ్య పట్టణాలు, పర్వతాలు, నదులను పరిశీలించాలి.చరిత్రలో వివిధ సంఘటనలు జరిగిన సంవత్సరాలను, పౌరశాస్త్రంలోని వివిధ చట్టాలను, రాజ్యాంగ ప్రకరణలను అధ్యయనం చేయాలి. భారత జాతీయోద్యమం ముఖ్య ఘటనలు; మెదటి, రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలపై అవగాహన అవసరం.అర్థశాస్త్రంలో ద్రవ్య వ్యవస్థ, బడ్జెట్-పన్నులు, బ్యాంకింగ్, అభివృద్ధి భావనలు, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ముఖ్యమైనవి. షెడ్యూల్ పరీక్ష తేదీ సమయం వ్యవధి 9-8-2015 (ఆదివారం) 10.30-12.30 రెండు గంటలు ఇన్పుట్స్ ఎన్.కె.మద్దిలేటి (తెలుగు, టీచింగ్ ఆప్టిట్యూడ్) బి.శ్రీనివాస్ (సోషల్) వై.వనంరాజు (మ్యాథమెటిక్స్) ఎస్.పి.డి.పుష్పరాజ్ (బయాలజీ) ఎ.వి.సుధాకర్ (ఫిజికల్ సైన్స్) -
డీఎడ్ కాలేజీల్లో అఫిలియేషన్ తనిఖీలు
ఈ సారైనా పక్కాగా జరిగేనా? ఏటా అడ్డగోలు నివేదికలు చివరకు న్యాయ వివాదాలు.. కౌన్సెలింగ్ ఆలస్యం హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారం మళ్లీ మొదలైంది. విద్యాశాఖ ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని 272 ప్రైవే టు డీఎడ్ కాలేజీలలో తనిఖీలు నిర్వహించనుంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధన లను పాటించని కాలేజీలకు కూడా అనుబంధ గుర్తింపు కోసం అన్నీ బాగున్నాయన్న నివేదికలు ఇవ్వడం, ఆ తరువాత మళ్లీ లోపాలు ఉన్నాయంటూ పాఠశాల విద్యాశాఖ మెలికపెట్టడం ఆనవాయితీగా మారింది. దీంతో న్యాయ వివాదాలు, నెలల తరబడి కౌన్సెలింగ్‌లో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఈసారైనా పక్కాగా తనిఖీలు చేపట్టి నివేదికలు ఇస్తారా? లేదా? అనే గందరగోళం నెలకొంది. మరీ ఆలస్యం కాకుండా చూస్తేనే.. రాష్ట్రంలో డీఎడ్ ప్రవేశాలు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. విద్యాశాఖ ఈ నెల 8న వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఆగస్టు 9న డీఈఈసెట్ నిర్వహిస్తోంది. ఇక మొదటి దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను సెప్టెంబర్ 1నుంచి నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో డీఈఈసెట్ నిర్వహించేందుకు యాక్ట్‌కు సవరణ చేపట్టాల్సి ఉండటంతో సంబంధిత ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపేసరికి ఆలస్యమైంది. ఇటీవలే ఫైల్ క్లియర్ కావడంతో విద్యాశాఖ డీఈఈసెట్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. నిర్ణీత వ్యవధిలో ప్రవేశాలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. -
‘ఇంగ్లిష్’లోనూ డీఈఎల్ఈడీ
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో భారీ మార్పులు {పతి సబ్జెక్టులో 60 శాతం మార్కులకే రాత పరీక్ష ఇంటర్నల్స్‌కు మిగిలిన 40 శాతం మార్కులు నూతన పాఠ్యపుస్తకాలకు అనుగుణంగా బోధన పద్ధతులు త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ - ఓల్డ్ డీఎడ్) రెండేళ్ల కోర్సులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రాథమ్యాలు, అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్ మీడియంలోనూ డీఈఎల్ఈడీ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో ఉండగా, రెండేళ్ల పాత డీఎడ్ (ప్రస్తుత డీఈఎల్ఈడీ) కోర్సు ఇంగ్లిష్ మీడియంలో లేదు. అయితే ఇంగ్లిష్ మీడియంలో కేజీ టు పీజీ కేంద్రాలను 2016-17 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న నేపథ్యంలో డీఈఎల్ఈడీ కోర్సును ఇంగ్లిష్ మీడియంలో కూడా ప్రవేశపెట్టడం అవసరమని అధికారులు నిర్ణయించారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆమోదం తీసుకొని 2015-16 విద్యా సంవత్సరంలో ఈ మార్పులు అమల్లోకి తేవాలనుకుంటున్నారు. డీఈఎల్ఈడీ కోర్సు సిలబస్‌లో మార్పులపై ఇటీవలే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రొఫెసర్లు, అధ్యాపకులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సిలబస్‌లో మార్పులు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తీసుకురావాల్సిన మార్పులపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. వీటిని ఒకటి, రెండు రోజుల్లో ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన మార్పులివే... రాష్ట్రంలో మార్పు చేసిన నూతన పాఠ్య పుస్తకాలపై అవగాహన వచ్చేవిధంగా బోధన పద్ధతుల్లో మార్పులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో 60 మార్కులకే రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్నల్స్కే (ప్రాజెక్టులు, అసైన్మెంట్లు, టీచింగ్ ప్రాక్టీస్) 40 మార్కులు ఉంటాయి. రెండేళ్ల కోర్సులో మొత్తం 400 పనిదినాల్లో 120 రోజుల పాటు టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రథమ సంవత్సరంలో 11 పేపర్లు, ద్వితీయ సంవత్సరంలో 14 పేపర్లు ఉంటాయి. రెండు సంవత్సరాలకు గానూ మొత్తం 2,400 మార్కులు ఉంటాయి. ఇందులో 40 శాతం మార్కులు ఇంటర్నల్స్‌కు, 60 శాతం మార్కులు రాత పరీక్షలకు ఉంటాయి. ప్రథమ సంవత్సరంలో మొత్తం 950 మార్కులు ఉంటాయి. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 1,450 మార్కులు ఉంటాయి. అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్జెక్టులు ఈసారి కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా అండర్స్టాండింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్, పూర్వ ప్రాథమిక విద్యార్థులకు కూడా బోధించేలా ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, స్కూల్ కల్చర్ లీడర్షిప్ వంటి కొత్త పేపర్లు ఉంటాయి. ఒకటి, రెండు తరగతులకు పాఠ్యాంశాలు బోధించడంపై ప్రథమ సంవత్సరంలో మెథడాలజీ ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో 3, 4, 5 తరగతులకు పాఠ్యాంశాలు బోధించడంపై ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలోనే 6, 7, 8 తరగతులకు ఒక సబ్జెక్టు బోధించే విధానం ఆప్షనల్ సబె ్జక్టు కింద ఉంటుంది. -
ఆ 42 డీఎడ్ కాలేజీల్లో చేరొద్దు
నేటి కౌన్సెలింగ్‌లో వాటిని ఎంచుకోవద్దు మైనారిటీ హోదాపై ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు ఆగాల్సిందే కౌన్సెలింగ్ వాయిదా వేయాలని కన్వీనర్‌కు విద్యాశాఖ లేఖ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 42 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలకు మైనారిటీ హోదాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, బుధవారం జరిగే డీఎడ్ కౌన్సెలింగ్ విద్యార్థులు అందులో చేరవద్దని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం వెలువడే వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. వాటిలో చేరితే ఆ ప్రవేశాలకు విద్యాశాఖ బాధ్యత వహించదని వివరించారు. మరోవైపు ఆ 42 కాలేజీల మైనారిటీ హోదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రానందున, ఈ నెల 11 నుంచి తలపెట్టిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని డీఈఈసెట్-ఈసీ-ఎస్డబ్ల్యూ-2 కన్వీనర్‌కు లేఖ రాశారు. మైనారిటీ హోదా నిర్ణయం వెలువడని కాలేజీల వివరాలు. . నల్లగొండ: అల్ జిహాన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-వెంకటాద్రిపాలెం, డాన్ కాలేజీ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఖతీజాఖతూన్ డిప్లొమా ఇన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-వేంపహాడ్, నౌమాన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, జోసఫ్ యువ డీఎడ్ కాలేజ్, సనా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, తేజ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-కోదాడ, కేజీఎన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-జీవీగూడెం, షయాన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-దేవరకొండ, సోఘ్రా కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-కొండభీమనపల్లి, తుమారా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-గొల్లగూడ, మదర్ మేరీ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్-చింతల్, భగత్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-ఆకుపాముల. ఖమ్మం: హోలీపాథ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హోలీ ఫెయిత్ మైనారిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-ఓల్డ్ పాల్వంచ. రంగారెడ్డి: కరుణోదయ డీఎడ్ కాలేజ్-హైదర్శకోటే, లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-యాప్రాల్, విశ్వభారతి డీఎడ్ కాలేజ్-చేవెళ్ల, రవీంద్రనాథ్ ఠాగూర్ టీచర్ ట్రైనింగ్ కాలేజీ-కుమ్మెర, ఎస్ఆర్ఎం డీఎడ్ కాలేజీ- గుర్రంగూడ, ప్రజ్ఞ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-సీతారామ్పేట, అసిఫియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-చింతుల్ల, ఐన్‌స్టీన్ డీఎడ్ కాలేజ్-చేవెళ్ల. హైదరాబాద్: మొఘల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-బండ్లగూడ, ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-ఎస్ఆర్టీకాలనీ యాకత్పురా, వీపీఈఎస్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-తిలక్‌నగర్ నల్లకుంట, ప్రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-ఫలక్‌నుమా బస్టాప్, గులామ్ అహ్మద్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-బంజారాహిల్స్, ఎస్ఎస్వీ డీఈడీ కాలేజ్-ఆల్మాస్‌గూడ. వరంగల్: రహమాన్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-యశ్వంతపూర్.ఆదిలాబాద్: పంచశీల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-గాజులపేట. మెదక్: గజ్వేల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-పాములపర్తి, నేషనల్ టీచర్ ట్రైనింగ్ కాలేజ్-మునిదేవనపల్లి, ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్-సిద్ధిపేద్, రీమన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-సంగారెడ్డి, డెక్కన్ కాలేజ్ ఆఫ్ డీఎడ్-పాములపర్తి. మహబూబ్‌నగర్: నూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-సోలిపూర్.నిజామాబాద్: సెయింట్ థామస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-ఆచన్‌పల్లి, అహ్మద్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-రామేశ్వరపల్లి, అహ్మద్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-ఆచ న్‌పల్లి. కరీంనగర్: క్రిసెంట్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-కరీంనగర్, అలెగ్జాండర్ కాలేజ్ ఆఫ్ డీఎడ్ ఎడ్యుకేషన్-ముగ్దుంపూర్. -
మూడేళ్ల కోర్సుగా పార్ట్‌టైం బీఎడ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా పార్ట్‌టైం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును ప్రవేశపెట్టింది. బీఎడ్ లేకుండానే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఈ కోర్సును అమల్లోకి తెచ్చింది. అలాగే దూరవిద్య విధానంలో ఇన్నాళ్లు లేని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సును కూడా ప్రవేశ పెట్టింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు చేసి ప్రాథమిక పాఠశాలల్లో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు దూర విద్య విధానంలో బీఎడ్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. దూరవిద్య విధానంలో నిర్వహించే డీఈఎల్ఈడీ, బీఎడ్ కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు ఉంటుందని పేర్కొంది. అలాగే విజువల్ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. లలిత కళల విద్యలోనూ డిప్లొమా కోర్సును అమల్లోకి తెచ్చింది. ఇవి రెండూ రెండేళ్ల కోర్సులుగా ఉంటాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ కొత్త కోర్సుల ను అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది. వాటి వివరాలిలా ఉన్నాయి. # పార్ట్‌టైం బీఎడ్: ఇది మూడేళ్ల కోర్సు. బీఎడ్ లేకపోయినా ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు ఐదేళ్లలో దీనిని పూర్తి చేయవచ్చు. ఇందులో ముఖాముఖి విద్యా బోధన 120 రోజులు ఉంటుంది. ఏటా 40 రోజుల బోధన ఉంటుంది. మరో 60 రోజులు స్కూల్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఏటా 20 రోజులు స్కూళ్లలో ట్రైనీ టీచర్లుగా పని చేయాలి. అంతేకాదు మరో 150 రోజులపాటు పాఠశాల, సామాజిక కార్యక్రమాలు ఉంటాయి. ఏటా 50 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల సెలవు దినాల్లో ఈ పార్ట్‌టైం బీఎడ్ విద్యను నిర్వహించాలి. ఆ విద్యా సంస్థలు వారంలో 42 గంటలు పని చేయాలి. # డిస్టెన్స్ డీఈఎల్ఈడీ: దూరవిద్య విధానంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సును కొత్తగా ప్రవేశ పెట్టింది. ఉపాధ్యాయ విద్య కోర్సులు చేయని ఇన్‌సర్వీసు టీచర్లు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. ఇది రెండేళ్ల కోర్సు. ఇందులో ఒక్కో విద్యాసంస్థ 500 మందికి ప్రవేశాలు కల్పించవచ్చు. స్టడీ సెంటర్ల ప్రవేశాలు 100 మందికి మించకూడదు. # డిస్టెన్స్ బీఎడ్: దూరవిద్య బీఎడ్ కూడా రెండేళ్ల కోర్సు. దీనిని ఐదేళ్లలో పూర్తి చేయవచ్చు. విద్యా సంస్థల్లో 100 మందికి మించకుండా, స్టడీ సెంటర్ల ద్వారా 50 మందికి మించకుండా ప్రవేశాలు కల్పించవచ్చు. # దేశ వ్యాప్తంగా కళలకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో డిప్లొమా ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ (విజువల్ ఆర్ట్స్), డిప్లొమా ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) కోర్సులను కొత్తగా ప్రవేశ పెట్టింది. ఇవి రెండేళ్ల కోర్సులు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు 1 నుంచి 8వ తరగతివరకు బోధించేందుకు అర్హులు. ఇందులో 16 వారాలపాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. -
డీఎడ్ కాలేజీల్లో అన్నీ లోపాలే..!
* అరకొర వసతులు.. నైపుణ్యం లేని అధ్యాపకులు సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాల్సిన కాబోయే ఉపాధ్యాయులకే నాణ్యమైన విద్య అందడంలేదు. సరిగ్గా బోధించలేని అధ్యాపకులు, అరకొర వసతులు వారిని వెక్కిరిస్తున్నాయి. రాష్ట్రం లోని ప్రైవేటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలన్నీ లోపాల పుట్టలే. చాలా కాలేజీల్లో సరిపడా అధ్యాపకులు లేరు. అధ్యాపకులుంటే ల్యాబ్‌లు, లైబ్రరీలు లేవు. అవి ఉన్నవాటిలో సరిపడా తరగతి గదుల్లేవు. కొన్ని డీఎడ్ కాలేజీలైతే ఇంజనీరింగ్, బీఎడ్ కళాశాలల ఆవరణలోనే కొనసాగుతున్నాయి. ఇక కాలేజీల్లో పనిచేస్తున్న కొద్దిపాటి సిబ్బందిదీ వెట్టిచాకిరే. నెలకు ఆరేడు వేల రూపాయల వేతనంతోనే పని చేయించుకుంటున్నారు. పైగా ఒకే అధ్యాపకుడ్ని రెండు మూడు కాలేజీల్లో చూపించేసి అఫిలియేషన్లు పొందడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 259 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 20 కాలేజీలు కొత్తగా ఏర్పడినవే. కనీసం కొత్త కాలేజీల్లోనైనా అన్ని వసతులు ఉన్నాయా? అంటే అదీ లేదు. అయినా అఫిలియేషన్ల కోసం దరఖాస్తు చేశాయి. వాటిన్నింటినీ పరిశీలించిన విద్యాశాఖ.. లోపాలు సవరించుకోవాలని నోటీసులు ఇస్తూ, ఈ ఒక్క ఏడాదికి అఫిలియేషన్లు ఇచ్చేద్దామని ప్రభుత్వానికి నివేదించడం గమనార్హం. 199 కాలేజీల్లో ఏదో ఒక లోపం 259 ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో నిబంధనల ప్రకారం అగ్నిమాపక చర్యలు ఏ ఒక్క కళాశాలలోనూ లేవు. ఇది కాకుండా 199 కాలేజీల్లో ఏదో ఒక లోపం ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వీటిలోని 55 కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నిబంధనల మేరకు లేరని తేల్చింది. కేవలం 40 కాలేజీలు మాత్రమే నిబంధనల ప్రకారం ఉన్నట్లు నిర్ధారించింది. 10 కాలేజీల్లో ల్యాబ్ సదుపాయమే లేదని, మరో పది కాలేజీల్లో సరిపడా తరగతి గదులే లేవని, ఇంకో పది కాలేజీల్లో లైబ్రరీలు కూడా లేవని తేలింది. లైబ్రరీ గదులు ఉన్నా వాటిలో పుస్తకాలు లేవని అధికారులు గుర్తించారు. చాలా కాలేజీల్లో సరిపడా అధ్యాపకులే లేకపోగా, ఒకే అధ్యాపకుడు రెండు మూడు కాలేజీల్లో పనిచేస్తున్నట్టు కనుగొన్నారు. వారికి కూడా నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని తేలింది. నాలుగేళ్లకు అనుమతులిస్తే అంతే.. ఇలాంటి కాలేజీలు నాలుగేళ్లకు ఒకేసారి అఫిలియేషన్లు పొందేందుకు ప్రభుత్వమే అవకాశం కల్పించింది. ఏటా తనిఖీల పేరుతో అధికారులు ముడుపులు వసూళ్లు చేసుకుంటున్నారు తప్ప.. లోపాలు ఉన్న ఏ ఒక్క కాలేజీపైనా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నాలుగేళ్లకు ఒకేసారి అఫిలియేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచిత్రం ఏమిటంటే, గత ప్రభుత్వంలోని ఓ మంత్రి నాలుగేళ్లకు ఒకసారి అఫిలియేషన్ ఇచ్చేందుకు రూపొందించిన ఫైలుపై సంతకం చేసేందుకు కూడా యాజమాన్యాల నుంచి ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తానికి జీఓ వచ్చింది. దానిని ఉపయోగించుకొని ప్రస్తుతం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో పనిచేసే సిబ్బంది భారీగా ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐదు నెలలుగా ఈ తతంగం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒక్కో కాలేజీ నుంచి లోపాలను బట్టి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాము ఎలాగూ ముడుపులు ముట్టజెప్పామనే ఉద్దేశంతో నాలుగేళ్లకు ఒకేసారి అఫిలియేషన్ పొందేందుకు యాజమాన్యాలు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఏళ్ల తరబడి అక్రమాలే.. డీఎడ్ అఫిలియేషన్ల వ్యవహారంలో ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. గతంలో ముడుపులకు అలవాటు పడిన అధికారులు, ప్రభుత్వ పెద్దలు చూసీ చూడనట్లు వ్యవహరించారు. తద్వారా ఉపాధ్యాయ విద్యార్థులకు నాసిరకం చదువులే అందించారు. ముందస్తుగా కాలేజీల్లో వసతుల కల్పనకు చర్యలు చేపట్టలేని ప్రభుత్వ పెద్దలు.. ముడుపుల కోసం రెండుమూడు సార్లు తనిఖీల పేరుతో విద్యాసంవత్సరాన్నే ఆలస్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోనీ తనిఖీలు చేసి ఏ ఒక్క కాలేజీపై అయినా చర్యలు చేపట్టారా? అంటే అదీ లేదు. 2012 జూలైలో ప్రారంభం కావాల్సిన తరగతులను 2013 ఫిబ్రవరిలో ప్రారంభించే స్థితికి తెచ్చారు. ఇదంతా కేవలం కాలేజీల నుంచి ముడుపుల కోసమే చేశారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. -
కొత్తగా ‘బీఈఎల్ఈడీ’ కోర్సు!
ఉపాధ్యాయ విద్యలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్న ఎన్సీటీఈ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి.. ఎస్జీటీ పోస్టులకు ఈ కోర్సుతో అర్హత డీఎడ్ అభ్యర్థులకు ‘నాలుగేళ్ల బీఎడ్’ లోకి లేటరల్ ఎంట్రీ.. నేరుగా మూడో సంవత్సరంలో చేరే అవకాశం హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ.. గతంలో డీఎడ్) అభ్యర్థులకు నాలుగేళ్ల ‘బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్)’ కోర్సులో లేటరల్ ఎంట్రీకి అవకాశం కల్పించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) కసరత్తు చేస్తోంది. రెండేళ్ల డీఈఎల్ఈడీ కోర్సు చదివే విద్యార్థులు... నేరుగా నాలుగేళ్ల బీఎడ్ కోర్సులోని మూడో సంవత్సరంలో చేరే అవకాశం కల్పించనుంది. ఉపాధ్యాయ విద్యలో సంస్కరణల్లో భాగంగా.. ఇప్పటివరకూ కాలమే ఉన్న బీఎడ్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్) కోర్సులను రెండేళ్ల కాల వ్యవధిగల కోర్సులుగా ఎన్సీటీఈ మార్పు చేసింది. దీంతోపాటు బీఎడ్, డీఈఎల్‌ఈడీలో 30 శాతం మార్కులను ఇంటర్నల్స్‌కు కేటాయించే విధానాన్ని అమలు పరచనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయి. వీటితోపాటు నాలుగేళ్ల బీఎడ్ కోర్సును కూడా యూనివర్సిటీ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో చేరే అభ్యర్థులు డీఈఎల్ఈడీ కోర్సును పూర్తి చేయడమే కాకుండా.. డిగ్రీతో కూడిన బీఎడ్ కోర్సును కూడా పూర్తి చేసినట్లు అవుతుంది. దీంతో ఆ అభ్యర్థులకు రెండు రకాల ప్రయోజనం చేకూరనుంది. డీఈఎల్ఈడీ అర్హతతో ఎస్జీటీ పోస్టులకు, బీఎడ్ అర్హతతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఏర్పడనుంది. నాలుగేళ్ల బీఈఎల్ఈడీ.. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల మేరకు చేపట్టిన ఉపాధ్యాయ విద్య సంస్కరణల్లో భాగంగా సమీకృత (ఇంటిగ్రేటెడ్) విద్యా కోర్సులకు ఎన్సీటీఈ ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా నాలుగేళ్ల ‘బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ)’ కోర్సును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఢిల్లీలోని రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ)కి చెందిన ప్రొఫెసర్ పూనమ్ బాత్రా కసరత్తు చేస్తున్నారు. వీలైతే ఈ కోర్సును వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తేవాలని ఎన్సీటీఈ భావిస్తోంది. ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (ఇంతకుముందటి డీఎడ్) అభ్యర్థులకే పరిమితమైన ఎస్జీటీ పోస్టుల్లో ఇకపై ‘బీఈఎల్ఈడీ’ అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. అంతేగాకుండా ఈ కోర్సు చేసినవారు 6, 7, 8 తరగతుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీనిని మొదట యూనివర్సిటీ కాలేజీల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. డీఈఎల్ఈడీ, బీఎడ్ సిలబ స్లోనూ మార్పులు.. రాష్ట్రంలో విద్యార్థులు బట్టీపట్టే విధానానికి స్వస్తిచెప్పేందుకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను మార్పు చేసిన సంగతి తెలిసిందే. తరగతుల్లో చేసిన ఈ మార్పులకు అనుగుణంగా డీఈఎల్ఈడీ, బీఎడ్ కోర్సుల్లోనూ సిలబస్‌ను మార్పు చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) భావిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు కొత్త పాఠ్య పుస్తకాల ప్రకారం శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధ్యాయ విద్య చదివే అభ్యర్థులకు కూడా ఈ కొత్త విధానంలో బోధన పద్ధతులు నేర్పించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది. -
డీఎస్సీ-14లో మాకూ ఛాన్స్ ఇవ్వాలి
బాలాజీ చెరువు(కాకినాడ) : త్వరలో వెలువడనున్న డీఎస్సీ-14లో తమకూ అవకాశం కల్పించాలంటూ సోమవారం డీఎడ్(డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) ద్వితీయ సంవత్సర అభ్యర్థులు నినాదాలు చేశారు. ముందుగా వారు మెయిన్‌రోడ్డులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కార్యాలయ ఏడీ అన్నపూర్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యార్థులందరూ అక్కడి నుంచి ర్యాలీగా మసీదు సెంటర్ నుంచి బాలాజీ చెరువు మీదుగా జీజీహెచ్ నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ నినాదాలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి 2008 డీఎస్సీ పోస్టుల్లో డీఎడ్ ద్వితీయ సంవత్సర అభ్యర్థులకు అవకాశం కల్పించారని, అదే పద్ధతి 2012లోనూ కొనసాగించారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. అనంతరం యూటీఏఫ్ భవనంలో డీఎడ్ ద్వితీయ సంవత్సర అభ్యర్థుల సంఘ అధ్యక్షుడిగా నక్కా పాండురంగారావు, ఉపాధ్యక్షుడిగా కె.రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం.శివసాయిప్రసాద్, కోశాధికారిగా ముమ్మిడి సతీష్, కార్యదర్శిగా బి.హరీష్, కార్యవర్గ సభ్యులుగా పి.అప్పలసూరి, డి.మురళీకృష్ణ, రవితేజ, సతీష్‌కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు పి.వి.వి సత్యనారాయణ,చింతాడ ప్రదీప్‌కుమార్‌తో పాటు దాదాపు రెండువేల మంది డీఎడ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
డీఎడ్ ప్రవేశాల మార్గదర్శకాల్లో సవరణలు
ఎస్సీ, ఎస్టీలకు 45శాతం మార్కులు ఉండాల్సిందే సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాలకు గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు మార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం జీఓ జారీచేశారు. డైట్‌సెట్ రాసే (డీఈఈ సెట్) జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 50 శాతం మార్కులు ఉండాలని గతంలోనే పేర్కొన్నా.. ఇక ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు కూడా 45 శాతం మార్కులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఉత్తర్వుల్లోని మరిన్ని సవరణలు - మేనేజ్మెంట్ కోటాలో చేరే విద్యార్థి కచ్చితంగా డీఈఈసెట్లో ర్యాంకు సాధించాలి. - మైనారిటీ కాలేజీ యాజమాన్యాలు రెగ్యులర్ కౌన్సెలింగ్‌లో కాకుండా తాము ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలంటే నిర్ణీత గడువులోగా మైనారిటీ హోదా సర్టిఫికెట్తో పాఠశాల విద్యా కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. - నాన్‌మైనారిటీ విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ తరువాత మిగిలిపోయిన సీట్ల వివరాలను 15రోజుల్లోగా డీఈఈసెట్ కన్వీనర్‌కు తెలియజేయాలి. - మైనారిటీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయాల్సిన పూర్తి బాధ్యత కన్వీనర్దే. - భర్తీ అయినవి, మిగులు సీట్ల వివరాలు అన్నీ జూలై రెండో వారం నుంచి నాలుగో వారంలోగా సంబంధిత అధికారులు నివేదించాలి. -
జూన్ 15న డీఈఈ సెట్
* మే 17వరకు ఫీజు చెల్లింపు.. నోటిఫికేషన్ జారీ సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో (డీ ఎడ్) ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈసెట్-2014కు పాఠశాల విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 15వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థులు మే 5 నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, మే 6 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో (http://dietcet.cgg.gov.in) దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని డైట్‌సెట్ చైర్మన్, కన్వీనర్ ఎం.జగదీశ్వర్, సురేందర్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను మే 5 నుంచి తమ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. పాత సిలబస్ ప్రకారమే ఈసారి డీఈఈ సెట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
టీచర్ కోర్సుల్లో సమూల మార్పులు
* ‘సాక్షి’తో ఎన్సీటీఈ చైర్పర్సన్ సంతోష్ పండా సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ కోర్సుల స్వరూపం పూర్తిగా మారిపోనుందని, ప్రాథమిక విద్యకు, ప్రాథమికోన్నత విద్యకు, సెకండరీ స్కూల్ విద్యకు వేర్వేరు కోర్సులు రానున్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్సీటీఈ) చైర్పర్సన్ సంతోష్ పండా తెలిపారు. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల మేరకు కేంద్రం ఈ సంస్కరణలు తేనుందని వివరించారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాలను బట్టి వీటి అమలు ఉంటుందని తెలిపారు. గురువారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ప్రస్తుతం అమలులో ఉన్న డీఈడీ కోర్సుకు బదులుగా పన్నెండో తరగతి అనంతరం రెండు సమీకృత కోర్సులు ఉంటాయని, ఒకటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) కాగా మరొకటి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్ఈడీ) కోర్సు. డీఈఎల్ఈడీ కోర్సు పన్నెండో తరగతి అనంతరం నాలుగేళ్లపాటు ఉండే సమీకృత డిగ్రీ కోర్సు. అంటే డిగ్రీతో పాటు ఉపాధ్యాయ విద్యలో శిక్షణ ఉంటుంది. అయితే ఇది కేవలం ప్రాథమిక విద్యార్థులకు బోధించేందుకు ఉద్దేశించిన శిక్షణ కోర్సు. అంటే ఐదోతరగతి వరకు బోధించవచ్చు. అలాగే బీఈఎల్ఈడీ కోర్సు కూడా పన్నెండో తరగతి అనంతరం నాలుగేళ్ల పాటు చదవాల్సి ఉంటుంది. ఇది కూడా సమీకృత డిగ్రీ కోర్సు. డిగ్రీతోపాటు ఉపాధ్యాయ విద్యలో శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పొందిన వారు 8వ తరగతి వరకు బోధించవచ్చు. ఇక డిగ్రీ అనంతరం ఉండే బీఈడీ రెండేళ్లపాటు ఉంటుంది. ఇది సెకండరీ విద్యకు సంబంధించింది..’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఒకే సంవత్సరం 600 డీఈడీ కళాశాలలకు అనుమతి ఇచ్చారని, వచ్చే ఏడాది కూడా ఇంకా కొత్త కళాశాలలకు అనుమతి ఇవ్వనున్నారా అని ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘రాష్ట్రంలో ఇప్పటికే అవసరానికి మించి ఉపాధ్యాయ విద్య కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్‌ను బట్టే సరఫరా ఉండాలి. అయితే ఉపాధ్యాయ విద్యలో నాణ్యత మాత్రం చాలా అవసరం. అవసరానికి మించి కళాశాలలు, సీట్ల సంఖ్య ఉంటే కళాశాలలు సంక్షోభంలో కూరుకుపోతాయి..’ అని పేర్కొన్నారు. వర్మ సిఫార్సుల అమలుకు వర్సిటీలు సిద్ధం కావాలి దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యాకోర్సుల్లో సంస్కరణలు తేవాలని సూచించిన జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల అమలుకు విశ్వవిద్యాలయాలు సన్నద్ధం కావాలని కేంద్రం సూచించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.భట్టాచార్య, సహాయక కార్యదర్శి డాక్టర్ అమర్జిత్ సింగ్, ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి(ఎన్సీటీఈ) చైర్మన్ సంతోష్ పండా గురువారం సచివాలయం నుంచి ఉపకులపతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఈడీ కరికులం, సిలబస్‌లో మార్పుల తీరుపై చర్చించారు. ఉపాధ్యాయ కోర్సుల్లో జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫారసులను వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ సిఫారసులు అమలుకావాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు.