డీఎడ్ కాలేజీల్లో అఫిలియేషన్ తనిఖీలు
ఈ సారైనా పక్కాగా జరిగేనా?
ఏటా అడ్డగోలు నివేదికలు
చివరకు న్యాయ వివాదాలు..
కౌన్సెలింగ్ ఆలస్యం
హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారం మళ్లీ మొదలైంది. విద్యాశాఖ ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని 272 ప్రైవే టు డీఎడ్ కాలేజీలలో తనిఖీలు నిర్వహించనుంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధన లను పాటించని కాలేజీలకు కూడా అనుబంధ గుర్తింపు కోసం అన్నీ బాగున్నాయన్న నివేదికలు ఇవ్వడం, ఆ తరువాత మళ్లీ లోపాలు ఉన్నాయంటూ పాఠశాల విద్యాశాఖ మెలికపెట్టడం ఆనవాయితీగా మారింది. దీంతో న్యాయ వివాదాలు, నెలల తరబడి కౌన్సెలింగ్‌లో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఈసారైనా పక్కాగా తనిఖీలు చేపట్టి నివేదికలు ఇస్తారా? లేదా? అనే గందరగోళం నెలకొంది.
మరీ ఆలస్యం కాకుండా చూస్తేనే..
రాష్ట్రంలో డీఎడ్ ప్రవేశాలు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. విద్యాశాఖ ఈ నెల 8న వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఆగస్టు 9న డీఈఈసెట్ నిర్వహిస్తోంది. ఇక మొదటి దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను సెప్టెంబర్ 1నుంచి నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో డీఈఈసెట్ నిర్వహించేందుకు యాక్ట్‌కు సవరణ చేపట్టాల్సి ఉండటంతో సంబంధిత ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపేసరికి ఆలస్యమైంది. ఇటీవలే ఫైల్ క్లియర్ కావడంతో విద్యాశాఖ డీఈఈసెట్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. నిర్ణీత వ్యవధిలో ప్రవేశాలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.