‘ఇంగ్లిష్’లోనూ డీఈఎల్‌ఈడీ
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో భారీ మార్పులు
{పతి సబ్జెక్టులో 60 శాతం మార్కులకే రాత పరీక్ష
ఇంటర్నల్స్‌కు మిగిలిన 40 శాతం మార్కులు
నూతన పాఠ్యపుస్తకాలకు అనుగుణంగా బోధన పద్ధతులు
త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ - ఓల్డ్ డీఎడ్) రెండేళ్ల కోర్సులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రాథమ్యాలు, అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్ మీడియంలోనూ డీఈఎల్‌ఈడీ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో ఉండగా, రెండేళ్ల పాత డీఎడ్ (ప్రస్తుత డీఈఎల్‌ఈడీ) కోర్సు ఇంగ్లిష్ మీడియంలో లేదు. అయితే ఇంగ్లిష్ మీడియంలో కేజీ టు పీజీ కేంద్రాలను 2016-17 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న నేపథ్యంలో డీఈఎల్‌ఈడీ కోర్సును ఇంగ్లిష్ మీడియంలో కూడా ప్రవేశపెట్టడం అవసరమని అధికారులు నిర్ణయించారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆమోదం తీసుకొని 2015-16 విద్యా సంవత్సరంలో ఈ మార్పులు అమల్లోకి తేవాలనుకుంటున్నారు.
డీఈఎల్‌ఈడీ కోర్సు సిలబస్‌లో మార్పులపై ఇటీవలే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రొఫెసర్లు, అధ్యాపకులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సిలబస్‌లో మార్పులు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తీసుకురావాల్సిన మార్పులపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. వీటిని ఒకటి, రెండు రోజుల్లో ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రధాన మార్పులివే...
రాష్ట్రంలో మార్పు చేసిన నూతన పాఠ్య పుస్తకాలపై అవగాహన వచ్చేవిధంగా బోధన పద్ధతుల్లో మార్పులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో 60 మార్కులకే రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్నల్స్‌కే (ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు, టీచింగ్ ప్రాక్టీస్) 40 మార్కులు ఉంటాయి. రెండేళ్ల కోర్సులో మొత్తం 400 పనిదినాల్లో 120 రోజుల పాటు టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రథమ సంవత్సరంలో 11 పేపర్లు, ద్వితీయ సంవత్సరంలో 14 పేపర్లు ఉంటాయి. రెండు సంవత్సరాలకు గానూ మొత్తం 2,400 మార్కులు ఉంటాయి. ఇందులో 40 శాతం మార్కులు ఇంటర్నల్స్‌కు, 60 శాతం మార్కులు రాత పరీక్షలకు ఉంటాయి. ప్రథమ సంవత్సరంలో మొత్తం 950 మార్కులు ఉంటాయి. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 1,450 మార్కులు ఉంటాయి.
అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్జెక్టులు
ఈసారి కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా అండర్‌స్టాండింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్, పూర్వ ప్రాథమిక విద్యార్థులకు కూడా బోధించేలా ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, స్కూల్ కల్చర్ లీడర్‌షిప్ వంటి కొత్త పేపర్లు ఉంటాయి. ఒకటి, రెండు తరగతులకు పాఠ్యాంశాలు బోధించడంపై ప్రథమ సంవత్సరంలో మెథడాలజీ ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో 3, 4, 5 తరగతులకు పాఠ్యాంశాలు బోధించడంపై ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలోనే 6, 7, 8 తరగతులకు ఒక సబ్జెక్టు బోధించే విధానం ఆప్షనల్ సబె ్జక్టు కింద ఉంటుంది.