డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ | Diploma in Elementary Education Set | Sakshi
Sakshi News home page

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్

Published Thu, Jul 16 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్

 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ (డీఈఈ సెట్) నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ప్రతిభ చూపడం ద్వారా ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్లు), ప్రైవేటు  ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లలో ప్రవేశించవచ్చు. రెండేళ్ల కాలవ్యవధి గల ఈ కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసి, ఉన్నతమైన ఉపాధ్యాయ కొలువును సొంతం చేసుకోవచ్చు. ఈ క్రమంలో డీఈఈ సెట్ విధానం, పరీక్షలో విజయానికి సబ్జెక్టు నిపుణుల సూచనలు తదితరాలపై ఫోకస్...
 
 ప్రభుత్వ డైట్‌లు, ప్రైవేటు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి డీఈఈ సెట్-2015 నిర్వహిస్తారు. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉద్యోగాలను డీఈఈ పూర్తిచేసిన అభ్యర్థులతోనే భర్తీ చేస్తుండటంతో ఈ కోర్సుకు డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. అయినా పోటీ తీవ్రంగానే ఉండనుంది. ఇందులో మంచి ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కళాశాలలో సీటును చేజిక్కించుకోవచ్చు.
 
 అర్హతలు:
 ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు డీసెట్ రాసేందుకు అర్హులు. ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ చాలెంజ్డ్ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంటర్‌లో వృతివిద్యా కోర్సులు పూర్తిచేసిన వారు డీఈఈ సెట్‌కు అనర్హులు.  వయసు: 2015, సెప్టెంబర్ 1 నాటికి 17 సంవత్సరాలు నిండాలి.
 
 పరీక్ష విధానం
 డీసెట్ పరీక్ష ప్రశ్నపత్రం మూడు భాగాలుగా ఉంటుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పేపర్ ఉంటుంది. సమయం రెండు గంటలు. పార్ట్-2, పార్ట్-3లోని ప్రశ్నలు 8, 9, 10 తరగతుల సబ్జెక్టుల స్థాయిలో ఉంటాయి. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్; ఉర్దూ/ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష విధానం గతేడాది మాదిరిగానే ఉంది.

 పరీక్ష విధానం
 పార్ట్-1
 సబ్జెక్ట్    ప్రశ్నలు    మార్కులు
 జనరల్ నాలెడ్జ్    5    5
 టీచింగ్ ఆప్టిట్యూడ్    5    5
 పార్ట్-2
 జనరల్ ఇంగ్లిష్    10    10
 తెలుగు/ఉర్దూ/తమిళం    20    20
 పార్ట్-3
 మ్యాథమెటిక్స్    20    20
 ఫిజికల్ సైన్స్    10    10
 బయలాజికల్ సైన్స్    10    10
 సోషల్    20    20
 మొత్తం    100    100
 
 ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ర్యాంకులు కేటాయిస్తారు. ఓసీ, బీసీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అర్హత మార్కులు లేవు. 85 శాతం సీట్లను స్థానిక అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లు అన్‌రిజర్వ్‌డ్ సీట్లు.
 
 ముఖ్య తేదీలు
 ఫీజు: రూ.200, ఏపీ ఆన్‌లైన్ లేదా పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలి.
 ఆన్‌లైన్లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జులై 20, 2015.
 
 ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:
 జులై 21, 2015.
 ఆన్‌లైన్ ద్వారా హాల్‌టికెట్ల పంపిణీ: జులై 30, 2015.
 పరీక్ష తేదీ: ఆగస్టు 9, 2015.
 పరీక్ష సమయం: ఉదయం 10.30 నుంచి 12.30 వరకు.
 ఫలితాల వెల్లడి: ఆగస్టు 22, 2015.
 వెబ్‌సైట్: tsdeecet.cgg.gov.in
 
 ప్రిపరేషన్ ప్రణాళిక జనరల్ నాలెడ్జ్
 ఈ విభాగానికి అయిదు మార్కులు కేటాయించారు. కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి. దీనికి పేపర్ చదవడం ఉపయోగపడుతుంది. స్టాక్ జీకేలో భాగంగా క్రీడలు, కప్‌లు, విజేతలు; పుస్తకాలు-రచయితలు; శాస్త్రీయ అధ్యయనాలు; శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు; దేశాలు-రాజధానులు; దేశాలు-కరెన్సీలు; విటమిన్లు-లోపం వల్ల కలిగే వ్యాధులు, లభించే పదార్థాలు; వివిధ దేశాలు-పాతపేర్లు తదితర అంశాలను చదవాలి.
 ఉదా:    2015 బ్రిక్స్ దేశాల సదస్సు రష్యాలోని ఏ నగరంలో జరిగింది?
 1) భారత్‌లోని న్యూఢిల్లీ    2) బ్రెజిల్‌లోని బ్రసీలియా
 3) చైనాలోని బీజింగ్    4) రష్యాలోని ఉఫా
 ఉదా:    డ్యూరాండ్ కప్ ఏ ఆటకు సంబంధించినది?
 1) క్రికెట్     2) హాకీ    3) ఫుట్‌బాల్     4) బ్యాడ్మింటన్
 
 టీచింగ్ ఆప్టిట్యూడ్
 టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే బోధనా ప్రవృత్తి. వృత్తిపై గౌరవం, విద్యార్థులపై ప్రేమ, సేవా భావం, పట్టుదల, సత్ప్రవర్తన.. ఇవి బోధనా ప్రవృత్తి ముఖ్య లక్షణాలు. వీటితో పాటు నేటి విద్యా విధానంపై అవగాహన; ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాపథకాలు, ప్రస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు తదితరాలపై దృష్టిసారించాలి. తరగతి గది నిర్వహణ, నూతన విద్యా విధానం, పాఠశాల ఎన్విరాన్‌మెంట్, బోధన సామర్థ్యం తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఇచ్చిన ప్రశ్నను, ఆప్షన్లను బాగా అర్థం చేసుకొని, తార్కికంగా ఆలోచిస్తే ఈ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు. పరీక్ష రాస్తున్న అభ్యర్థి తనను తాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఊహించుకొని, విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి.

 ఉదా:    {పస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న మూల్యాంకన విధానం ఏది?
 1) నిర్మాణాత్మక మూల్యాంకనం    2) రూపాత్మక మూల్యాంకనం
 3) గుణాత్మక మూల్యాంకనం    4) నిరంతర సమగ్ర మూల్యాంకనం
 
 తెలుగు
 డీఈఈ సెట్‌లో తెలుగుకు 20 మార్కులు కేటాయించారు. మంచి ర్యాంకు సాధించాలంటే ఇందులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. కావ్యాలు-కవులు, పుస్తకాలు-రచయితలు, కవుల బిరుదులు, అర్థాలు, పర్యాయపదాలు, అలంకారాలు, సంధులు, సమాసాలు, వాక్యాలు, ఛందస్సు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వ్యాకరణ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి.

 ఉదా:    ‘‘ఈ చీకటి ఆకాశం నుంచి కురుస్తున్న కాటుకా అన్నట్లున్నది’’... ఇది ఏ అలంకారం?
 1) శ్లేషాలంకారం     2) ఉపమా అలంకారం
 3) ఉత్ప్రేక్ష అలంకారం     4) స్వభావోక్తి అలంకారం
 
 ఇంగ్లిష్
 జనరల్ ఇంగ్లిష్ నుంచి పది ప్రశ్నలు ఇస్తారు. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కరెక్ట్ వెర్బ్ ఫార్మ్స్, వాయిస్, వొకాబ్యులరీ, సింపుల్-కాంపౌండ్-కాంప్లెక్స్ సెంటెన్సెస్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పదో తరగతి స్థాయిలో గ్రామర్ అంశాలపై దృష్టిసారించడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
 
 ఫిజికల్ సైన్స్
 ఈ విభాగానికి పది మార్కులు కేటాయించారు. గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే ఫిజిక్స్ నుంచి అయిదు ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి అయిదు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. 8, 9, 10 తరగతి పాఠ్యపుస్తకాల్లో ఫిజికల్ సైన్స్‌కు సంబంధించి 34 యూనిట్లు ఉన్నాయి. భౌతిక శాస్త్రంలో ధ్వని, ఉష్ణం, విద్యుత్, కాంతి, బలం, పని-శక్తి అధ్యాయాలను క్షుణ్నంగా చదవాలి. రసాయన శాస్త్రంలో రసాయన చర్యలు-సమీకరణాలు, ఆమ్లాలు-క్షారాలు-లవణాలు, పరమాణు నిర్మాణం, రసాయన బంధం, మూలకాల వర్గీకరణ, లోహసంగ్రహణ శాస్త్రం, కర్బన సమ్మేళన రసాయన శాస్త్రం ముఖ్యమైన అంశాలు.  నిర్వచనాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, శాస్త్రవేత్తలు, ఉదాహరణలు, ఉపయోగాలు, నియమాలు, సమస్యలు-సాధనలు, అణునిర్మాణాలు, ఫార్ములాలు, భౌతిక స్థిరాంకపు విలువలు నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 బయాలజీ
 శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు, రక్త కణాలు, జీవుల్లో వైవిధ్యం-వర్గీకరణ, పోషకాహార లోపం-వ్యాధులు, శాస్త్రీయ నామాలు, శరీర భాగాలు, ఎరువులు, పోషక పదార్థాలు, ఆల్కలాయిడ్లు, వినాళ గ్రంథులు- అవి ఉండే స్థానాలు- స్రవించే హార్మోన్లు, జీవులు-ప్రసరణ వ్యవస్థలు, ఫైటో హార్మోన్లు, జీర్ణ ఎంజైమ్‌లు వంటి అంశాలను చదవాలి.
 
 మ్యాథమెటిక్స్
 గణితంలో ఎక్కువ ప్రశ్నలు పదో తరగతి నుంచి వస్తాయి. అందువల్ల బహుపదులు, వర్గసమీకరణాలు, శ్రేఢులు, నిరూపక రేఖాగణితం, త్రికోణమితి, సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత పాఠ్యాంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు బీజగణితం, వ్యాపార గణితం, క్షేత్ర గణితం పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి. రేఖా గణితం ప్రిపరేషన్ తప్పనిసరి. ప్రతి పాఠ్యాంశంలోని ముఖ్యమైన భావనలు, సూత్రాలను ఒకచోట రాసుకోవాలి. సమస్యల్ని షార్ట్‌కట్ పద్ధతిలో సాధించడం ప్రాక్టీస్ చేయాలి. గత ప్రశ్నపత్రాల్ని ప్రాక్టీస్ చేయాలి.
 
 సోషల్
 గత పరీక్షపత్రాల పరిశీలన ద్వారా ఏ అంశాల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
     తరగతి    భూగోళశాస్త్రం    చరిత్ర    పౌరశాస్త్రం    అర్థశాస్త్రం    మొత్తం
     8    2    2    1    1    6
     9    2    2    1    1    6
     10    2    2    2    2    8
     మొత్తం    6    6    4    4    8
 
 భూగోళశాస్త్రంలో ముఖ్యంగా పటాల అధ్యయనం-విశ్లేషణ, భూమి-భూ చలనాలు-భూ ఆవరణాలు; భారతదేశ భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, వ్యవసాయం, నీటిపారుదల వసతులు అంశాలపై దృష్టిసారించాలి.
 అట్లాస్ సహాయంతో పాఠాల్లో తారసపడే వివిధ భౌగోళికాంశాలను, దేశాలు, ముఖ్య పట్టణాలు, పర్వతాలు, నదులను పరిశీలించాలి.చరిత్రలో వివిధ సంఘటనలు జరిగిన సంవత్సరాలను, పౌరశాస్త్రంలోని వివిధ చట్టాలను, రాజ్యాంగ ప్రకరణలను అధ్యయనం చేయాలి. భారత జాతీయోద్యమం ముఖ్య ఘటనలు; మెదటి, రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలపై అవగాహన అవసరం.అర్థశాస్త్రంలో ద్రవ్య వ్యవస్థ, బడ్జెట్-పన్నులు, బ్యాంకింగ్, అభివృద్ధి భావనలు, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ముఖ్యమైనవి.
 
 షెడ్యూల్
 పరీక్ష తేదీ    సమయం    వ్యవధి
 9-8-2015 (ఆదివారం)    10.30-12.30    రెండు గంటలు
 
 
 ఇన్‌పుట్స్
 ఎన్.కె.మద్దిలేటి     (తెలుగు, టీచింగ్ ఆప్టిట్యూడ్)
 బి.శ్రీనివాస్     (సోషల్)
 వై.వనంరాజు     (మ్యాథమెటిక్స్)
 ఎస్.పి.డి.పుష్పరాజ్     (బయాలజీ)
 ఎ.వి.సుధాకర్     (ఫిజికల్ సైన్స్)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement