మూడేళ్ల కోర్సుగా పార్ట్‌టైం బీఎడ్ | part time B.Ed three years in telangana | Sakshi
Sakshi News home page

మూడేళ్ల కోర్సుగా పార్ట్‌టైం బీఎడ్

Published Mon, Dec 15 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

మూడేళ్ల కోర్సుగా పార్ట్‌టైం బీఎడ్

మూడేళ్ల కోర్సుగా పార్ట్‌టైం బీఎడ్

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా పార్ట్‌టైం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును ప్రవేశపెట్టింది. బీఎడ్ లేకుండానే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఈ కోర్సును అమల్లోకి తెచ్చింది. అలాగే దూరవిద్య విధానంలో ఇన్నాళ్లు లేని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కోర్సును కూడా ప్రవేశ పెట్టింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు చేసి ప్రాథమిక పాఠశాలల్లో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు దూర విద్య విధానంలో బీఎడ్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది.

దూరవిద్య విధానంలో నిర్వహించే డీఈఎల్‌ఈడీ, బీఎడ్ కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు ఉంటుందని పేర్కొంది. అలాగే విజువల్ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. లలిత కళల విద్యలోనూ డిప్లొమా కోర్సును అమల్లోకి తెచ్చింది. ఇవి రెండూ రెండేళ్ల కోర్సులుగా ఉంటాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ కొత్త కోర్సుల ను అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది. వాటి వివరాలిలా ఉన్నాయి.

#    పార్ట్‌టైం బీఎడ్: ఇది మూడేళ్ల కోర్సు. బీఎడ్ లేకపోయినా ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు ఐదేళ్లలో దీనిని పూర్తి చేయవచ్చు. ఇందులో ముఖాముఖి విద్యా బోధన 120 రోజులు ఉంటుంది. ఏటా 40 రోజుల బోధన ఉంటుంది. మరో 60 రోజులు స్కూల్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఏటా 20 రోజులు స్కూళ్లలో ట్రైనీ టీచర్లుగా పని చేయాలి. అంతేకాదు మరో 150 రోజులపాటు పాఠశాల, సామాజిక కార్యక్రమాలు ఉంటాయి. ఏటా 50 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల సెలవు దినాల్లో ఈ పార్ట్‌టైం బీఎడ్ విద్యను నిర్వహించాలి.  ఆ విద్యా సంస్థలు వారంలో 42 గంటలు పని చేయాలి.

#    డిస్టెన్స్ డీఈఎల్‌ఈడీ: దూరవిద్య విధానంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కోర్సును కొత్తగా ప్రవేశ పెట్టింది. ఉపాధ్యాయ విద్య కోర్సులు చేయని ఇన్‌సర్వీసు టీచర్లు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. ఇది రెండేళ్ల కోర్సు. ఇందులో ఒక్కో విద్యాసంస్థ 500 మందికి ప్రవేశాలు కల్పించవచ్చు. స్టడీ సెంటర్ల ప్రవేశాలు 100 మందికి మించకూడదు.

#    డిస్టెన్స్ బీఎడ్: దూరవిద్య బీఎడ్ కూడా రెండేళ్ల కోర్సు. దీనిని ఐదేళ్లలో పూర్తి చేయవచ్చు. విద్యా సంస్థల్లో 100 మందికి మించకుండా, స్టడీ సెంటర్ల ద్వారా 50 మందికి మించకుండా ప్రవేశాలు కల్పించవచ్చు.

#    దేశ వ్యాప్తంగా కళలకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో డిప్లొమా ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ (విజువల్ ఆర్ట్స్), డిప్లొమా ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) కోర్సులను కొత్తగా ప్రవేశ పెట్టింది. ఇవి రెండేళ్ల కోర్సులు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు 1 నుంచి 8వ తరగతివరకు బోధించేందుకు అర్హులు. ఇందులో 16 వారాలపాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement