teacher education
-
ఉపాధ్యాయ విద్యకు చికిత్స
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ విద్యను బోధించే డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈలను బలోపేతం చేసేందుకు ఖాళీలను సత్వరమే భర్తీ చేయడంతోపాటు అక్రమ ప్రవేశాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీ పోస్టుల్లో అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను డిప్యుటేషన్‌పై నియమించనున్నారు. డీసెట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు మాత్రమే డీఈడీలో ప్రవేశాలు కల్పించనున్నారు. కరిక్యులమ్‌లో పలు మార్పులు చేసినా టీచర్ అభ్యర్థులకు సరైన శిక్షణ లేనందున ఫలితాలు సాధించడం కష్టంగా మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ నిర్వాకం.. పోస్టులు ఖాళీగా ► జిల్లా ఉపాధ్యాయ విద్యా బోధనా సంస్థలు (డైట్లు), కాలేజ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లలో 90 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైట్స్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించినా అందుకు తగ్గట్టుగా గత ప్రభుత్వం బోధనా సిబ్బందిని నియమించలేదు. డైట్స్‌లో పలు చోట్ల విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులు లేవు. పేరుకు మాత్రమే కాలేజీలు.. ► ప్రైవేట్ డీఈడీ కాలేజీల్లో అర్హులైన టీచర్లు లేరు. కాలేజీలు పేరుకు మాత్రమే ఉంటాయి కానీ విద్యార్థులు ఉండరు. తనిఖీల సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ► బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయడం ద్వారా ఈ కాలేజీల్లో అక్రమాలకు కొంతవరకు తెరపడనుంది. పాఠశాల విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ పరిధిలోకి డీఎడ్ కాలేజీలను కూడా ప్రభుత్వం చేర్చింది. ఉన్నత విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ పరిధిలోకి బీఈడీ కాలేజీలను తెచ్చింది. ► అక్రమాలు జరిగినట్లు తేలిన 180 ప్రైవేట్ డీఎడ్ కాలేజీల గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది. 2018–20 బ్యాచ్‌కు సంబంధించి అక్రమంగా చేపట్టిన ప్రవేశాలకు అనుమతులు నిరాకరించింది. డైట్ కాలేజీల్లో సీట్లు ఇలా... కేటగిరీ ప్రభుత్వ ప్రైవేట్ మొత్తం ఇంగ్లీషు మెథడాలజీ 650 8,800 9,450 తమిళ మెథడాలజీ 50 –– 50 తెలుగు మెథడాలజీ 700 54,730 55,430 ఉర్దూ మెథడాలజీ 250 170 420 మొత్తం 1,650 63,700 65,350 డీఈడీ ఇలా ప్రభుత్వ డీఈడీ కాలేజీలు 22 ప్రైవేట్ డీఈడీ కాలేజీలు 754 డీఎడ్ సీట్లు 65 వేలకు పైగా ఇటీవల డీసెట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు: 10,810 పరీక్షకు హాజరైన వారు: 9,014 అర్హత సాధించిన వారు: 8,175 డీసెట్ రాయకపోయినా సీటు...! – 2018–20 నిర్వహించిన డీఈఈసెట్లో 65 వేలకు పైగా సీట్లకు 24వేల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2 వేల మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అయితే టీడీపీ హయాంలో మంత్రి, ఉన్నతాధికారులను మేనేజ్ చేయడం ద్వారా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఓసీ, బీసీలకు అర్హత మార్కులను తగ్గించడంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులతో సంబంధం లేకుండా సీట్లు భర్తీ చేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నాయి. – అర్హత మార్కులను తగ్గించినా 20 వేల మంది మాత్రమే అర్హత పొందడంతో యాజమాన్యాలు మిగతా సీట్లను డీఈఈ సెట్ రాయని వారితోనూ భర్తీ చేశాయి. –దీనికి సంబంధించి ఆయా కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వాటి వాదనలను తోసిపుచ్చింది. డీసెట్‌లో అర్హత సాధించని వారిని, డీసెట్ రాయని వారిని అనుమతించడం సరికాదంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. బీఈడీలోనూ.... – బీఈడీ కాలేజీలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 430కిపైగా బీఈడీ కాలేజీల్లో 41,894 సీట్లున్నాయి. 2019–20లో బీఈడీలో కన్వీనర్ కోటాలో భర్తీ అయినవి 3,874 సీట్లు కాగా స్పాట్ అడ్మిషన్ల ద్వారా 19,665 మందిని చేర్చుకున్నారు. ఇది కాకుండా మేనేజ్మెంట్ కోటా ద్వారా 7,849 మందిని చేర్చుకున్నారు. ఇలా మొత్తం 31,388 సీట్లు భర్తీ అయినట్లు చూపించారు. ఎడ్‌సెట్ రాసేవారు 13 వేల లోపే ఉండగా 8 వేల మంది కూడా అర్హత సాధించడం లేదు. చివరకు మాత్రం 80 శాతానికిపైగా సీట్ల భర్తీ అయినట్లు యాజమాన్యాలు చూపిస్తుండడం గమనార్హం. రాసి కాదు.. వాసి ముఖ్యం ‘ఉపాధ్యాయ విద్యలో రాసి కాదు వాసి కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాఠశాల కరిక్యులమ్‌ను పటిష్టం చేస్తున్న తరుణంలో ఉపాధ్యాయ విద్యను కూడా పటిష్టం చేస్తున్నాం. ప్రభుత్వ డైట్లు, ఇతర కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. అక్రమాలకు పాల్పడుతున్న 180 డీఎడ్ కాలేజీల గుర్తింపు రద్దుచేయడంతో పాటు వాటికి అనుమతులు ఇవ్వరాదని ఎన్‌సీటీఈకి లేఖ రాశాం. డీఎడ్ సిలబస్‌ను పునస్సమీక్షించేందుకు కమిటీతో అధ్యయనం చేస్తున్నాం. డీఎడ్ విద్యార్థి శిక్షణలో భాగంగా నెల రోజుల పాటు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనార్టీలకు సంబంధించి సిలబస్‌లో పొందుపరచాలని భావిస్తున్నాం. విద్యాహక్కు చట్టం, ప్రభుత్వ కార్యక్రమాల గురించి కూడా సిలబస్‌లో చేర్చే యోచన ఉంది’ – వాడ్రేవు చినవీరభద్రుడు (పాఠశాల విద్యాశాఖ కమిషనర్) -
డిగ్రీ కాలేజీలు, వర్సిటీల్లోనే నాలుగేళ్ల బీఎడ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పరిగణనలోకి తీసుకొని దేశంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు కొత్త కోర్సులను 2020–21 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తేవాలని భావిస్తోంది. అందులో నాలుగేళ్ల బీఎడ్ కోర్సును, సైన్స్, హ్యుమానిటీస్‌లో డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టేందుకు వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఆ కోర్సులను నిర్వహిస్తారా? లేదా? అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలియజేయాలని ఎన్సీటీఈ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి ఎన్సీటీఈ చైర్పర్సన్ డాక్టర్ సత్బిర్ బేడీ లేఖ రాశారు. ఈనెల 16వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని అందులో కోరారు. దీంతో ఆ దిశగా ఉన్నత విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈనెల 15వ తేదీన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే అధికంగా కాలేజీలు.. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కళాశాలలు ఇప్పటికే అధికంగా ఉన్నాయని, కొత్తగా కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే ఎన్‌సీటీఈకి తెలియజేసింది. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది బీఎడ్, డీఎడ్ వంటి ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారని, కొత్త కాలేజీల నుంచి వచ్చే వారితో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని పేర్కొంది. అంతేకాదు రాష్ట్రానికి కావాల్సిన మేరకు శిక్షణ పూర్తి చేసిన వారు ఉన్నారని, అయితే ఇకపై నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించాల్సి ఉన్నందున కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని అప్పట్లో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలా? వద్దా? వాటిని నిర్వహిస్తామంటూ దరఖాస్తు చేసుకునే కాలేజీల నుంచి దరఖాస్తులను స్వీకరించాలా? వద్దా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లోనే.. ఉపాధ్యాయ విద్యా బోధనలో నాలుగేళ్ల బీఎడ్ ద్వారా మెరుగైన శిక్షణ, నాణ్యమైన విద్యా బోధనకు చర్యలు చేపట్టవచ్చన్న ఆలోచనతో వీటిని ప్రవేశ పెట్టేందుకు ఎన్సీటీఈ చర్యలు చేపట్టింది. వాటికోసం కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేస్తామంటే ఇవ్వమని పేర్కొంది. -
ఆగిపోయిన విద్యా ప్రణాళికలు!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో కీలకమైన పలు విద్యా పథకాల ప్రణాళికలు ఆగిపోయాయి. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్ ఎడ్యుకేషన్ పథకాల విలీన నిర్ణయం నేపథ్యంలో ఆయా పథకాల కింద రూపొందించాల్సిన 2018–19 విద్యా సంవత్సరం ప్రణాళికలను రాష్ట్ర విద్యా శాఖ నిలిపివేసింది. వాస్తవానికి ఈ నెల 13 నుంచి ఆయా పథకాలకు సంబంధించిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మూడు విద్యా పథకాల విలీనం కారణంగా కేంద్రం ఆయా పీఏబీల సమావేశాలను రద్దు చేసింది. దీంతో విద్యా శాఖ సైతం వాటికి అవసరమైన ఆర్థిక సంవత్సరపు ప్రణాళికల రూపకల్పనను నిలిపివేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన పథకాల విలీనం సమావేశంలో అన్ని రాష్ట్రాలు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం గురువారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో కొత్త పథకం పేరును ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యా పథకాలు, వాటికి అవసరమయ్యే ప్రణాళికలు, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యా శాఖ భావిస్తోంది. -
‘గురుకుల’ రాత పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 21 నుంచి జరగాల్సిన పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు మధ్యం తర ఉత్తర్వుల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల తేదీల వివరాలను తరువాత వెల్లడిస్తామని పేర్కొంది. -
ఉపాధ్యాయ విద్యలో బీసీలే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలు(బీసీ) ఉపాధ్యాయవిద్యలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సులను అభ్యసిస్తున్నవారిలో 67 శాతం బీసీలు, ఆ తరువాత స్థానంలో ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాల వారీగా, వివిధ కోర్సులను అభ్యసిస్తున్నవారి వివరాలను బీసీ కమిషన్ విద్యాశాఖ నుంచి సేకరించింది. గత ఏడాది ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసినవారిలోనూ బీసీలే అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. టెట్‌కు హాజరైన వారిలో 58.99 శాతం బీసీలుండగా, ఆ తరువాత 18.77 శాతంతో రెండో స్థానంలో ఎస్సీ అభ్యర్థులు ఉన్నట్లు తేల్చింది. పరీక్షకు మొత్తంగా 3,40,567 మంది హాజరైతే అందులో బీసీలు 2,00,922 మంది ఉండటం గమనార్హం. 85 శాతం గ్రామీణ ప్రాంతాల వారే.. ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న వారిలో 85 శాతం మంది అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయ విద్యపై ఆసక్తి చూపుతున్న వారిలో పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తక్కువేనని పేర్కొంటున్నారు. అందులోనూ వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులే ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా త్వరగా జీవితంలో స్థిరపడవచ్చన్న భావనే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఇంటర్మీడియట్ తరువాతే డీఎడ్ చేసే అవకాశం ఉన్నందునా ఎక్కువ కాలం చదివే అవకాశంలేని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు డీఎడ్ పూర్తి చేసి ప్రభుత్వ రంగం లేదా ప్రైవేటు రంగంలో స్థిరపడవచ్చన్న భావనే ఇందుకు కారణమని చెబుతున్నారు. టెట్‌లో అర్హత సాధించిన ఓసీలు 10 శాతమే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఓసీలే తక్కువగా అర్హత సాధిస్తుండగా, ఎస్సీల్లో ఎక్కువ అర్హత శాతం ఉంది. ఎస్సీల తరువాత ఎస్టీలు ఎక్కువ శాతం అర్హతను సాధిస్తున్నారు. బీసీలు తక్కువ అర్హత పొందుతున్నారు. అయితే ఇందుకు కారణం అర్హత మార్కుల విధానమే. అర్హత మార్కుల విధానం ఓసీలకు 60 శాత, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం ఉంది. గత ఏడాది నిర్వహించిన టెట్‌లో ఓసీలు 10 శాతం మందే అర్హత సాధించగా, బీసీలు 29.40 శాతం మంది, ఎస్సీలు 53.68 శాతం మంది, ఎస్టీలు 38.22 శాతం మంది అర్హత సాధించారు. -
టీచింగ్ ప్రాక్టీస్‌కే పెద్దపీట!
డీఎడ్‌లో ఇక నుంచి ప్రథమ సంవత్సరంలోనూ టీచింగ్ ప్రాక్టీస్ గ్రామీణ అధ్యయనం, ప్రజలతో మమేకానికి ప్రాధాన్యం రెండేళ్ల కోర్సులో టీచింగ్ {పాక్టీస్కు 550 మార్కులు ఈ ఏడాది నుంచే అమల్లోకి.. హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో టీచింగ్ ప్రాక్టీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల మేరకు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో భారీగా మార్పులు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా ఇక నుంచి ఈ కోర్సులో ప్రథమ సంవత్సరంలోనూ స్కూల్ ఇంటర్న్‌షిప్, బోధన అభ్యాసం (టీచింగ్ ప్రాక్టీస్), బోధన అభ్యసనకు సంసిద్ధత, రికార్డుల విధానాన్ని ప్రవేశపెడుతోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి ఈ అంశాలకే 800 మార్కులను కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఇందులో ఒక్క టీచింగ్ ప్రాక్టీస్‌కే 550 మార్కులు ఉండేలా మార్పులు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (జూలై నుంచి) అమల్లోకి తేనున్న ఈ మార్పులను ఇప్పటికే విద్యాశాఖ ఖరారు చేసింది. త్వరలోనే ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది. ప్రస్తుతం ఉన్న విధానం.. డీఎడ్‌లో ప్రస్తుతం ప్రథమ సంవత్సరంలో ఐదు పేపర్లు, ద్వితీయ సంవత్సరంలో పది పేపర్ల విధానం ఉంది. అందులో ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున 1000 మార్కులు, రికార్డులకు 500 మార్కులు ఉంటాయి. ఇంటర్నల్స్‌కు, రికార్డులకు 500 కలిపి మొత్తంగా 2 వేల మార్కుల విధానం ఉంది. ఒక్కో సబ్జెక్టులో ఏడు పీరియడ్ల చొప్పున ఒక సబ్జెక్టులో 35 పీరియడ్ల టీచింగ్ ప్రాక్టీస్ ఉంది. ఇలా ఐదు సబ్జెక్టుల్లో మొత్తంగా 175 పీరియడ్ల టీచింగ్ ప్రాక్టీస్ విధానం ఉంది. అమల్లోకి రానున్న ప్రధాన మార్పులు ఇవే.. ప్రథమ సంవత్సరంలో 10 సబ్జెక్టులు, ద్వితీయ సంవత్సరంలో 10 సబ్జెక్టులు ఉంటాయి. మొత్తంగా డీఎడ్‌లో ఇక 2,600 మార్కుల విధానం ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రాత పరీక్షలకు 1,800 మార్కులు (ఇందులో 16 సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టుకు 60 మార్కులకు రాత పరీక్ష ఉండనుండగా, ఒక్కో సబ్జెక్టులో మిగతా 40 మార్కులు ఇంటర్నల్ ్సకు ఉంటాయి. మరో నాలుగు సబ్జెక్టుల్లో ఒక్కో దానికి 30 మార్కుల చొప్పున రాత పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్టులో మిగతా 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి) ఇవ్వనుంది. వీటికి అదనంగా స్కూల్ ఇంటర్న్‌షిప్, టీచింగ్ ప్రాక్టీస్, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధత, రికార్డులకు 800 మార్కులు ఉంటాయి. ప్రథమ సంవత్సరంలో... ప్రథమ సంవత్సరంలో స్కూల్ ఇంటర్న్‌షిప్, టీచింగ్ ప్రాక్టీస్, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధత, రికార్డులకు 350 మార్కులు ఉంటాయి. ఇందులో స్కూల్ ఇంటర్న్‌షిప్, టీచింగ్ ప్రాక్టీస్‌కు 250 మార్కులు ఇవ్వనుండగా, రికార్డులు, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధతకు 100 మార్కులు కేటాయిస్తారు. టీచింగ్ ప్రాక్టీస్‌కు సంసిద్ధతలో భాగంగా గ్రామీణ అధ్యయనం, వివిధ సంస్థల సందర్శన, పాఠశాల అభివృద్ధి, రికార్డులకు ఒక్కో అంశానికి 25 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ద్వితీయ సంవత్సరంలో.. ద్వితీయ సంవత్సరంలో ఇంటర్నల్స్‌కు 450 మార్కులు ఉంటాయి. ఇందులో స్కూల్ ఇంటర్న్‌షిప్, టీచింగ్ప్రాక్టీస్కు 300 మార్కులు ఇవ్వనుండగా, రికార్డులు, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధతకు 150 మార్కులు ఉంటాయి. టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధతలో భాగంగా ప్రజలతో మమేకం కావడం, విద్యాహక్కు చట్టం అమలు, చైల్డ్ స్టడీ తదితర అంశాలు ఉంటాయి. డీఎడ్‌లో మార్కుల విధానమిదీ.. సంవత్సరం రాత పరీక్ష ఇంటర్న్‌షిప్, మొత్తం టీచింగ్ ప్రాక్టీస్ ప్రథమ 900 350 1,250 ద్వితీయ 900 450 1,350 మొత్తం 1,800 800 2,600 -
మూడేళ్ల కోర్సుగా పార్ట్‌టైం బీఎడ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా పార్ట్‌టైం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును ప్రవేశపెట్టింది. బీఎడ్ లేకుండానే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఈ కోర్సును అమల్లోకి తెచ్చింది. అలాగే దూరవిద్య విధానంలో ఇన్నాళ్లు లేని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సును కూడా ప్రవేశ పెట్టింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు చేసి ప్రాథమిక పాఠశాలల్లో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు దూర విద్య విధానంలో బీఎడ్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. దూరవిద్య విధానంలో నిర్వహించే డీఈఎల్ఈడీ, బీఎడ్ కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు ఉంటుందని పేర్కొంది. అలాగే విజువల్ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. లలిత కళల విద్యలోనూ డిప్లొమా కోర్సును అమల్లోకి తెచ్చింది. ఇవి రెండూ రెండేళ్ల కోర్సులుగా ఉంటాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ కొత్త కోర్సుల ను అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది. వాటి వివరాలిలా ఉన్నాయి. # పార్ట్‌టైం బీఎడ్: ఇది మూడేళ్ల కోర్సు. బీఎడ్ లేకపోయినా ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు ఐదేళ్లలో దీనిని పూర్తి చేయవచ్చు. ఇందులో ముఖాముఖి విద్యా బోధన 120 రోజులు ఉంటుంది. ఏటా 40 రోజుల బోధన ఉంటుంది. మరో 60 రోజులు స్కూల్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఏటా 20 రోజులు స్కూళ్లలో ట్రైనీ టీచర్లుగా పని చేయాలి. అంతేకాదు మరో 150 రోజులపాటు పాఠశాల, సామాజిక కార్యక్రమాలు ఉంటాయి. ఏటా 50 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల సెలవు దినాల్లో ఈ పార్ట్‌టైం బీఎడ్ విద్యను నిర్వహించాలి. ఆ విద్యా సంస్థలు వారంలో 42 గంటలు పని చేయాలి. # డిస్టెన్స్ డీఈఎల్ఈడీ: దూరవిద్య విధానంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సును కొత్తగా ప్రవేశ పెట్టింది. ఉపాధ్యాయ విద్య కోర్సులు చేయని ఇన్‌సర్వీసు టీచర్లు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. ఇది రెండేళ్ల కోర్సు. ఇందులో ఒక్కో విద్యాసంస్థ 500 మందికి ప్రవేశాలు కల్పించవచ్చు. స్టడీ సెంటర్ల ప్రవేశాలు 100 మందికి మించకూడదు. # డిస్టెన్స్ బీఎడ్: దూరవిద్య బీఎడ్ కూడా రెండేళ్ల కోర్సు. దీనిని ఐదేళ్లలో పూర్తి చేయవచ్చు. విద్యా సంస్థల్లో 100 మందికి మించకుండా, స్టడీ సెంటర్ల ద్వారా 50 మందికి మించకుండా ప్రవేశాలు కల్పించవచ్చు. # దేశ వ్యాప్తంగా కళలకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో డిప్లొమా ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ (విజువల్ ఆర్ట్స్), డిప్లొమా ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) కోర్సులను కొత్తగా ప్రవేశ పెట్టింది. ఇవి రెండేళ్ల కోర్సులు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు 1 నుంచి 8వ తరగతివరకు బోధించేందుకు అర్హులు. ఇందులో 16 వారాలపాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. -
ఇక అన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులే!
' ఇంటర్‌తోనే ప్రవేశపెట్టేందుకు ఎన్సీటీఈ కసరత్తు ' ఐదారు రకాల కోర్సులపై అధ్యయనం ' నేడు బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌తోనే ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏడాది కోర్సులుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఈడీ) కోర్సులను వచ్చే విద్యా సంవత్సరంలో రెండేళ్ల కోర్సులుగా మార్పు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులనే ప్రవేశపెట్టే అంశంపైనా దృష్టి సారించింది. అంతేకాదు పక్కాగా కళాశాలల నియంత్రణకు చర్యలు చేపట్టాలని నిర్ణయిం చింది. ఈ అంశాలన్నింటిపై శనివారం బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తోంది. ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేయాల్సిందేనన్న జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఎన్సీటీఈ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పూనమ్ బాత్రా, ప్రొఫెసన్ ఎన్కే జాన్గిరా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు తమ నివేదికలను రెండు నెలల కిందట ఎన్‌సీటీఈకి అందజేశాయి. ఆ కమిటీలు ఉపాధ్యా య విద్య ప్రాధాన్యం, విద్యార్థులను తీర్చిదిద్దడంతో క్రియాశీల ంగా వ్యవహరించే ఉపాధ్యాయ పాత్ర, వారికి ఇచ్చే శిక్షణ ఎలా ఉండాలన్న వివిధ అంశాలను చర్చించారు. పలు సూచనలు, సలహాల కోసం దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, అధికారులు కళాశాలల యాజమాన్యాలతో ఎన్సీటీఈ సమావేశాలు నిర్వహిస్తోంది. కళాశాలలను కూడా పటిష్టం చేసే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ప్రతి కళాశాలలో 100 సీట్లు ఉంటే 50 సీట్లకు ఒక సెక్షన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోం ది. 1:15 రేషియోలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బోధించేందుకు ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు ఉండగా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు అవసరమా? లేదా? అనే అంశాలపైనా చర్చించనుంది. ఎన్సీటీఈ ప్రణాళిక .. వివరాలు - రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ + గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (2+3+2) - నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2) - గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+2+2) - గ్రాడ్యుయేషన్ + మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+3) - నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఏ/బీఎస్సీ బీఈడీ) + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2) -
ఉపాధ్యాయ విద్యపై నిఘా
నాణ్యత మెరుగుకు ప్రాథమిక విద్యా శాఖ చర్యలు డీఎడ్ కాలేజీల్లో వెబ్ ఆధారిత పర్యవేక్షణ, తనిఖీలు నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు ‘సాక్షి’తో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాల్సిన ఉపాధ్యాయుల్లో నాణ్యత తగ్గుతోంది. తూతూ మంత్రం చదువులతో టీచర్ పట్టాతో స్కూళ్లలోకి అడుగుపెడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు! ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో నాణ్యత లోపించ డం, నిబంధనలు పాటించకపోవడాన్ని ప్రాథమిక విద్యాశాఖ గుర్తించింది. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ప్రైవేటు కాలేజీల్లో తరగతులు జరక్కపోయినా ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేస్తున్నారు. ప్రాక్టికల్ తరగతులు నిర్వహించకపోయినా బాగా బోధిస్తారంటూ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాయి. దీంతో ముందు ఇక్కడి నుంచి సంస్కరించడం ప్రారంభించాలని ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎడ్ ప్రైవేటు కాలేజీల్లో పక్కా బోధన అందించేందుకు ప్రత్యేక నిఘావంటి పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగా వెబ్ ఆధారిత పర్యవేక్షణ చేపట్టనున్నామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘సాక్షి’తో చెప్పారు. అలాగే, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఇప్పటికే 600 వరకు ఉన్నందున కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వొద్దని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్సీటీఈ) రాశామని చెప్పారు. డీఎడ్ కాలేజీల్లో పర్యవేక్షణ ఇలా.. ప్రత్యేక వెబ్సైట్లో విద్యార్థులు, అధ్యాపకుల ఫొటోలతో వివరాలు రోజువారీ హాజరు వివరాలను ప్రతినెలా ఆ సైట్లో అప్లోడ్ చేయాలి. పాఠ్యాంశాల వివరాలను కూడా పొందుపరచాలి. అధిక ఫీజులు డిమాండ్ చేస్తే విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారులు వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీలు ప్రతి నెలా కాలేజీలను తనిఖీలు చేస్తాయి. సంబంధిత కాలేజీ అనుబంధ స్కూళ్లలో ప్రాక్టికల్స్ జరిగాయా? లేదా? పరిశీలిస్తాయి. టీచర్ల హాజరు, పాఠ్యాంశాల బోధనపై రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలిస్తాయి. ఈ చర్యల ద్వారా పాఠశాల విద్య నాణ్యత మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు. ఏప్రిల్‌లోనే ‘టెన్త్’ పాఠ్యపుస్తకాల పంపిణీ పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలు ముగిసేలోపే పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైందని, పాఠశాలలకు చివరి పని దినమైన ఏప్రిల్ 23కే పదో తరగతికి వెళ్లే 12 లక్షల మంది విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తామని పూనం మాలకొండయ్య చెప్పారు. సెలవుల్లో ముందుగానే చదువుకునే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టామన్నారు. ఇతర తరగతులకు చెందిన 64 లక్షల మందికి జూన్ 12న స్కూళ్లు తెరిచే రోజున ఉచిత పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.