ఉపాధ్యాయ విద్యపై నిఘా
నాణ్యత మెరుగుకు ప్రాథమిక విద్యా శాఖ చర్యలు
డీఎడ్ కాలేజీల్లో వెబ్ ఆధారిత పర్యవేక్షణ, తనిఖీలు
నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు
‘సాక్షి’తో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాల్సిన ఉపాధ్యాయుల్లో నాణ్యత తగ్గుతోంది. తూతూ మంత్రం చదువులతో టీచర్ పట్టాతో స్కూళ్లలోకి అడుగుపెడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు! ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో నాణ్యత లోపించ డం, నిబంధనలు పాటించకపోవడాన్ని ప్రాథమిక విద్యాశాఖ గుర్తించింది. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ప్రైవేటు కాలేజీల్లో తరగతులు జరక్కపోయినా ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేస్తున్నారు. ప్రాక్టికల్ తరగతులు నిర్వహించకపోయినా బాగా బోధిస్తారంటూ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాయి. దీంతో ముందు ఇక్కడి నుంచి సంస్కరించడం ప్రారంభించాలని ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎడ్ ప్రైవేటు కాలేజీల్లో పక్కా బోధన అందించేందుకు ప్రత్యేక నిఘావంటి పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగా వెబ్ ఆధారిత పర్యవేక్షణ చేపట్టనున్నామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘సాక్షి’తో చెప్పారు. అలాగే, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఇప్పటికే 600 వరకు ఉన్నందున కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వొద్దని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్‌సీటీఈ) రాశామని చెప్పారు.
డీఎడ్ కాలేజీల్లో పర్యవేక్షణ ఇలా..
ప్రత్యేక వెబ్‌సైట్‌లో విద్యార్థులు, అధ్యాపకుల ఫొటోలతో వివరాలు
రోజువారీ హాజరు వివరాలను ప్రతినెలా ఆ సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. పాఠ్యాంశాల వివరాలను కూడా పొందుపరచాలి.
అధిక ఫీజులు డిమాండ్ చేస్తే విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారులు వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు.
కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీలు ప్రతి నెలా కాలేజీలను తనిఖీలు చేస్తాయి. సంబంధిత కాలేజీ అనుబంధ స్కూళ్లలో ప్రాక్టికల్స్ జరిగాయా? లేదా? పరిశీలిస్తాయి. టీచర్ల హాజరు, పాఠ్యాంశాల బోధనపై రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలిస్తాయి. ఈ చర్యల ద్వారా పాఠశాల విద్య నాణ్యత మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు.
ఏప్రిల్‌లోనే ‘టెన్త్’ పాఠ్యపుస్తకాల పంపిణీ
పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలు ముగిసేలోపే పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైందని, పాఠశాలలకు చివరి పని దినమైన ఏప్రిల్ 23కే పదో తరగతికి వెళ్లే 12 లక్షల మంది విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తామని పూనం మాలకొండయ్య చెప్పారు. సెలవుల్లో ముందుగానే చదువుకునే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టామన్నారు. ఇతర తరగతులకు చెందిన 64 లక్షల మందికి జూన్ 12న స్కూళ్లు తెరిచే రోజున ఉచిత పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.