ఉపాధ్యాయ విద్యకు చికిత్స | 180 illegal colleges Recognition Canceled | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ విద్యకు చికిత్స

Published Wed, Jul 29 2020 3:51 AM | Last Updated on Wed, Jul 29 2020 3:51 AM

180 illegal colleges Recognition Canceled - Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ విద్యను బోధించే డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈలను బలోపేతం చేసేందుకు ఖాళీలను సత్వరమే భర్తీ చేయడంతోపాటు అక్రమ ప్రవేశాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీ పోస్టుల్లో అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లను డిప్యుటేషన్‌పై నియమించనున్నారు. డీసెట్‌ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు మాత్రమే డీఈడీలో ప్రవేశాలు కల్పించనున్నారు. కరిక్యులమ్‌లో పలు మార్పులు చేసినా టీచర్‌ అభ్యర్థులకు సరైన శిక్షణ లేనందున ఫలితాలు సాధించడం కష్టంగా మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత ప్రభుత్వ నిర్వాకం.. పోస్టులు ఖాళీగా
► జిల్లా ఉపాధ్యాయ విద్యా బోధనా సంస్థలు (డైట్‌లు), కాలేజ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్, ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ అడ్వాన్సుడ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (ఐఏఎస్‌ఈ)లలో 90 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైట్స్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించినా అందుకు తగ్గట్టుగా గత ప్రభుత్వం బోధనా సిబ్బందిని నియమించలేదు. డైట్స్‌లో పలు చోట్ల విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులు లేవు.

పేరుకు మాత్రమే కాలేజీలు..
► ప్రైవేట్‌ డీఈడీ కాలేజీల్లో అర్హులైన టీచర్లు లేరు. కాలేజీలు పేరుకు మాత్రమే ఉంటాయి కానీ విద్యార్థులు ఉండరు. తనిఖీల సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు.
► బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేయడం ద్వారా ఈ కాలేజీల్లో అక్రమాలకు కొంతవరకు తెరపడనుంది. పాఠశాల విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ పరిధిలోకి డీఎడ్‌ కాలేజీలను కూడా ప్రభుత్వం చేర్చింది. ఉన్నత విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ పరిధిలోకి బీఈడీ కాలేజీలను తెచ్చింది. 
► అక్రమాలు జరిగినట్లు తేలిన 180 ప్రైవేట్‌ డీఎడ్‌ కాలేజీల గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది.  2018–20 బ్యాచ్‌కు సంబంధించి అక్రమంగా చేపట్టిన ప్రవేశాలకు అనుమతులు నిరాకరించింది.

డైట్‌ కాలేజీల్లో సీట్లు ఇలా...
కేటగిరీ                                        ప్రభుత్వ        ప్రైవేట్‌         మొత్తం
ఇంగ్లీషు మెథడాలజీ                      650               8,800          9,450
తమిళ మెథడాలజీ                         50                  ––                  50
తెలుగు మెథడాలజీ                      700              54,730        55,430
ఉర్దూ మెథడాలజీ                         250                   170             420
మొత్తం                                      1,650              63,700        65,350

డీఈడీ ఇలా
ప్రభుత్వ డీఈడీ కాలేజీలు    22
ప్రైవేట్‌ డీఈడీ కాలేజీలు   754
డీఎడ్‌ సీట్లు  65 వేలకు పైగా 
ఇటీవల డీసెట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు: 10,810
పరీక్షకు హాజరైన వారు: 9,014
అర్హత సాధించిన వారు: 8,175

డీసెట్‌ రాయకపోయినా సీటు...!
– 2018–20 నిర్వహించిన డీఈఈసెట్‌లో 65 వేలకు పైగా సీట్లకు 24వేల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2 వేల మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అయితే టీడీపీ హయాంలో మంత్రి, ఉన్నతాధికారులను మేనేజ్‌ చేయడం ద్వారా ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు ఓసీ, బీసీలకు అర్హత మార్కులను తగ్గించడంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులతో సంబంధం లేకుండా సీట్లు భర్తీ చేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నాయి. 
– అర్హత మార్కులను తగ్గించినా 20 వేల మంది మాత్రమే అర్హత పొందడంతో 
యాజమాన్యాలు మిగతా సీట్లను డీఈఈ సెట్‌ రాయని వారితోనూ భర్తీ చేశాయి.
–దీనికి సంబంధించి ఆయా కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వాటి వాదనలను తోసిపుచ్చింది. డీసెట్‌లో అర్హత సాధించని వారిని, డీసెట్‌ రాయని వారిని అనుమతించడం సరికాదంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది.

బీఈడీలోనూ....
– బీఈడీ కాలేజీలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 430కిపైగా బీఈడీ కాలేజీల్లో 41,894 సీట్లున్నాయి. 2019–20లో బీఈడీలో కన్వీనర్‌ కోటాలో భర్తీ అయినవి 3,874 సీట్లు కాగా  స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా 19,665 మందిని చేర్చుకున్నారు. ఇది కాకుండా మేనేజ్‌మెంట్‌ కోటా ద్వారా 7,849 మందిని చేర్చుకున్నారు. ఇలా మొత్తం 31,388 సీట్లు భర్తీ అయినట్లు చూపించారు. ఎడ్‌సెట్‌ రాసేవారు 13 వేల లోపే ఉండగా 8 వేల మంది కూడా అర్హత సాధించడం లేదు. చివరకు మాత్రం 80 శాతానికిపైగా సీట్ల భర్తీ అయినట్లు యాజమాన్యాలు చూపిస్తుండడం గమనార్హం.

రాసి కాదు.. వాసి ముఖ్యం
‘ఉపాధ్యాయ విద్యలో రాసి కాదు వాసి కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాఠశాల కరిక్యులమ్‌ను పటిష్టం చేస్తున్న తరుణంలో ఉపాధ్యాయ విద్యను కూడా పటిష్టం చేస్తున్నాం. ప్రభుత్వ డైట్‌లు, ఇతర కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. అక్రమాలకు పాల్పడుతున్న 180 డీఎడ్‌ కాలేజీల గుర్తింపు రద్దుచేయడంతో పాటు వాటికి అనుమతులు ఇవ్వరాదని ఎన్‌సీటీఈకి లేఖ రాశాం. డీఎడ్‌ సిలబస్‌ను పునస్సమీక్షించేందుకు కమిటీతో అధ్యయనం చేస్తున్నాం. డీఎడ్‌ విద్యార్థి శిక్షణలో భాగంగా నెల రోజుల పాటు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనార్టీలకు సంబంధించి సిలబస్‌లో పొందుపరచాలని భావిస్తున్నాం. విద్యాహక్కు చట్టం, ప్రభుత్వ కార్యక్రమాల గురించి కూడా సిలబస్‌లో చేర్చే యోచన ఉంది’
– వాడ్రేవు చినవీరభద్రుడు (పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement