Bed colleges
-
ఉపాధ్యాయ విద్యకు చికిత్స
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ విద్యను బోధించే డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈలను బలోపేతం చేసేందుకు ఖాళీలను సత్వరమే భర్తీ చేయడంతోపాటు అక్రమ ప్రవేశాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీ పోస్టుల్లో అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను డిప్యుటేషన్‌పై నియమించనున్నారు. డీసెట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు మాత్రమే డీఈడీలో ప్రవేశాలు కల్పించనున్నారు. కరిక్యులమ్‌లో పలు మార్పులు చేసినా టీచర్ అభ్యర్థులకు సరైన శిక్షణ లేనందున ఫలితాలు సాధించడం కష్టంగా మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ నిర్వాకం.. పోస్టులు ఖాళీగా ► జిల్లా ఉపాధ్యాయ విద్యా బోధనా సంస్థలు (డైట్లు), కాలేజ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లలో 90 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైట్స్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించినా అందుకు తగ్గట్టుగా గత ప్రభుత్వం బోధనా సిబ్బందిని నియమించలేదు. డైట్స్‌లో పలు చోట్ల విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులు లేవు. పేరుకు మాత్రమే కాలేజీలు.. ► ప్రైవేట్ డీఈడీ కాలేజీల్లో అర్హులైన టీచర్లు లేరు. కాలేజీలు పేరుకు మాత్రమే ఉంటాయి కానీ విద్యార్థులు ఉండరు. తనిఖీల సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ► బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయడం ద్వారా ఈ కాలేజీల్లో అక్రమాలకు కొంతవరకు తెరపడనుంది. పాఠశాల విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ పరిధిలోకి డీఎడ్ కాలేజీలను కూడా ప్రభుత్వం చేర్చింది. ఉన్నత విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ పరిధిలోకి బీఈడీ కాలేజీలను తెచ్చింది. ► అక్రమాలు జరిగినట్లు తేలిన 180 ప్రైవేట్ డీఎడ్ కాలేజీల గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది. 2018–20 బ్యాచ్‌కు సంబంధించి అక్రమంగా చేపట్టిన ప్రవేశాలకు అనుమతులు నిరాకరించింది. డైట్ కాలేజీల్లో సీట్లు ఇలా... కేటగిరీ ప్రభుత్వ ప్రైవేట్ మొత్తం ఇంగ్లీషు మెథడాలజీ 650 8,800 9,450 తమిళ మెథడాలజీ 50 –– 50 తెలుగు మెథడాలజీ 700 54,730 55,430 ఉర్దూ మెథడాలజీ 250 170 420 మొత్తం 1,650 63,700 65,350 డీఈడీ ఇలా ప్రభుత్వ డీఈడీ కాలేజీలు 22 ప్రైవేట్ డీఈడీ కాలేజీలు 754 డీఎడ్ సీట్లు 65 వేలకు పైగా ఇటీవల డీసెట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు: 10,810 పరీక్షకు హాజరైన వారు: 9,014 అర్హత సాధించిన వారు: 8,175 డీసెట్ రాయకపోయినా సీటు...! – 2018–20 నిర్వహించిన డీఈఈసెట్లో 65 వేలకు పైగా సీట్లకు 24వేల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2 వేల మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అయితే టీడీపీ హయాంలో మంత్రి, ఉన్నతాధికారులను మేనేజ్ చేయడం ద్వారా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఓసీ, బీసీలకు అర్హత మార్కులను తగ్గించడంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులతో సంబంధం లేకుండా సీట్లు భర్తీ చేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నాయి. – అర్హత మార్కులను తగ్గించినా 20 వేల మంది మాత్రమే అర్హత పొందడంతో యాజమాన్యాలు మిగతా సీట్లను డీఈఈ సెట్ రాయని వారితోనూ భర్తీ చేశాయి. –దీనికి సంబంధించి ఆయా కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వాటి వాదనలను తోసిపుచ్చింది. డీసెట్‌లో అర్హత సాధించని వారిని, డీసెట్ రాయని వారిని అనుమతించడం సరికాదంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. బీఈడీలోనూ.... – బీఈడీ కాలేజీలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 430కిపైగా బీఈడీ కాలేజీల్లో 41,894 సీట్లున్నాయి. 2019–20లో బీఈడీలో కన్వీనర్ కోటాలో భర్తీ అయినవి 3,874 సీట్లు కాగా స్పాట్ అడ్మిషన్ల ద్వారా 19,665 మందిని చేర్చుకున్నారు. ఇది కాకుండా మేనేజ్మెంట్ కోటా ద్వారా 7,849 మందిని చేర్చుకున్నారు. ఇలా మొత్తం 31,388 సీట్లు భర్తీ అయినట్లు చూపించారు. ఎడ్‌సెట్ రాసేవారు 13 వేల లోపే ఉండగా 8 వేల మంది కూడా అర్హత సాధించడం లేదు. చివరకు మాత్రం 80 శాతానికిపైగా సీట్ల భర్తీ అయినట్లు యాజమాన్యాలు చూపిస్తుండడం గమనార్హం. రాసి కాదు.. వాసి ముఖ్యం ‘ఉపాధ్యాయ విద్యలో రాసి కాదు వాసి కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాఠశాల కరిక్యులమ్‌ను పటిష్టం చేస్తున్న తరుణంలో ఉపాధ్యాయ విద్యను కూడా పటిష్టం చేస్తున్నాం. ప్రభుత్వ డైట్లు, ఇతర కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. అక్రమాలకు పాల్పడుతున్న 180 డీఎడ్ కాలేజీల గుర్తింపు రద్దుచేయడంతో పాటు వాటికి అనుమతులు ఇవ్వరాదని ఎన్‌సీటీఈకి లేఖ రాశాం. డీఎడ్ సిలబస్‌ను పునస్సమీక్షించేందుకు కమిటీతో అధ్యయనం చేస్తున్నాం. డీఎడ్ విద్యార్థి శిక్షణలో భాగంగా నెల రోజుల పాటు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనార్టీలకు సంబంధించి సిలబస్‌లో పొందుపరచాలని భావిస్తున్నాం. విద్యాహక్కు చట్టం, ప్రభుత్వ కార్యక్రమాల గురించి కూడా సిలబస్‌లో చేర్చే యోచన ఉంది’ – వాడ్రేవు చినవీరభద్రుడు (పాఠశాల విద్యాశాఖ కమిషనర్) -
ప్రమాణాలు లేకపోతే మూతే!
సాక్షి, అమరావతి : విద్యాబోధనలో కనీస ప్రమాణాలు కూడా పాటించని బీఈడీ కాలేజీలను మూసివేయించాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) భావిస్తోంది. నిర్ణీత నిబంధనల మేరకు భవనాలు, బోధనా సిబ్బంది సహాఇతర కనీస ఏర్పాట్లు కూడా లేకుండా కేవలం కాగితాలకే పరిమితమైన వేలాది కాలేజీలకు ఇక మంగళం పాడనుంది. కుప్పలు తెప్పలుగా పెరిగిపోయిన ఈ కాలేజీల కారణంగా ఏటా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో టీచర్ అభ్యర్థులు బయటకు వస్తున్నారు. వీరిలో కనీస ప్రమాణాలు కూడా ఉండడంలేదని ఇటీవల ఎన్సీటీఈ నిర్వహించిన తనిఖీల్లో తేటతెల్లమైంది. బోధన చేయలేని ఇలాంటి టీచర్ల కారణంగా ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో ప్రమాణాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. సరైన ప్రమాణాలు లేకుండా కొనసాగుతున్న బీఈడీ కాలేజీలను మూసివేయించేందుకు ఎన్సీటీఈ నిర్దిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఇలాంటి కాలేజీలను ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలు గుర్తించాలని ఎన్సీటీఈ సభ్య కార్యదర్శి సంజయ్ అవస్థి అన్ని రాష్ట్రాలు, ప్రాంతీయ మండళ్లకు నోటీసులు జారీచేశారు. అలాగే, ఎన్సీటీఈ సదరన్ రీజనల్ కమిటీ రీజనల్ డైరక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్ శర్మ రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌కు కూడా లేఖ ద్వారా తెలిపారు. 19వేల కాలేజీల పనితీరు పరిశీలన కాగా, దేశవ్యాప్తంగా 19వేల బీఈడీ కాలేజీల్లోని ప్రమాణాలు, ఇతర పరిస్థితులపై ఎన్సీటీఈ ఇటీవల జరిపిన పరిశీలనలో నివ్వెరపోయే అంశాలు వారి దృష్టికి వచ్చాయి. అవి.. - బీఈడీ డిగ్రీ అనేది టీచర్‌గా కాకుండా పెళ్లి కోసమో, స్టేటస్ కోసమో.. కేవలం సర్టిఫికెట్ కోసమో ఈ కాలేజీల్లో పలువురు చేరుతున్నట్లు గుర్తించింది. - వాస్తవానికి జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూళ్లలో టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1 : 27గా నిర్దేశించారు. ఈ లెక్కన దేశవ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 26 కోట్లుగా ఉంది. విద్యార్థి నిష్పత్తి ప్రకారం 90 లక్షల మంది టీచర్లుండాలి. ప్రస్తుతం స్కూళ్లలో ఉన్న టీచర్ల సంఖ్య పోను అవసరమైన మిగతా టీచర్ల సంఖ్య కేవలం 3 లక్షలు మాత్రమే. కానీ, ఏటా 19 లక్షల మంది బయటకు వస్తున్నారు. ఈ లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా 10వేలకు పైగా కాలేజీలను మూసేసినా ఇంకా మూడు రెట్లు ఎక్కువగా ఏటా టీచర్ అభ్యర్థులు బయటకు రానున్నారు. అన్ని బీఈడీ కాలేజీల్లో బయోమెట్రిక్ ఇదిలా ఉంటే.. కాలేజీల్లో విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంటుండడంతో ఎన్సీటీఈ అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని విద్యార్థులకే కాక బోధనా సిబ్బందికీ తప్పనిసరి చేసింది. అలాగే, కాలేజీకి సంబంధించిన అన్ని వివరాలను వెబ్సైట్లో ప్రదర్శించాలని.. అధికారులు వాటిని వారం వారం పరిశీలిస్తారని.. ప్రమాణాలు లేని కాలేజీలు, నిబంధనలు పాటించని వాటి గుర్తింపును వెంటనే రద్దుచేయనున్నట్లు హెచ్చరించింది. రాష్ట్రంలో కనీస ప్రమాణాలు కరువు ఇక రాష్ట్రంలోని మొత్తం 431 బీఈడీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించే సంస్థలు నామమాత్రంగా ఉన్నాయి. వీటిల్లో కనీస సదుపాయాలూ కల్పించడంలేదు. కొన్నయితే సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టజెబుతూ కేవలం కాగితాల్లోనే మాయచేస్తున్నాయి. ఒకే భవనంలో వేర్వేరు పేర్లతో కాలేజీలు నడిపిస్తున్న యాజమాన్యాలు కూడా ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యే సీట్ల సంఖ్య అరకొరగా ఉన్నా ఆ తరువాత స్పాట్ అడ్మిషన్ల కింద ఇతర రాష్ట్రాల నుంచి అభ్యర్థులను రప్పిస్తూ బీఈడీ కోర్సును ఒక దందాగా మార్చేశాయి. -
నో ట్రిక్.. ఇక బయోమెట్రిక్
సాక్షి, నెల్లూరు (టౌన్): విద్యా వ్యవస్థలో అవినీతి ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు విద్యా కళాశాలలు స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పక్కదారి పట్టిస్తున్నాయన్న కారణంతో డిగ్రీ, ఇంటర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా బీఈడీ కళాశాలల్లో కూడా బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో చాలా ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో విద్యార్థులు కళాశాలకు రాకుండానే హాజరు వేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు అర్హత లేని అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ జరుపుకోవచ్చన్న ఉద్దేశం ప్రైవేట్ కళాశాలల్లో ఉంది. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిగణలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 21 బీఈడీ కళాశాలలు జిల్లాలో మొత్తం 21 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఒక ప్రభుత్వ, 20 ప్రైవేట్ బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 720 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ బీఈడీ కళాశాల, సిద్ధార్థ బీఈడీ కళాశాలల్లో 100 మంది విద్యార్థులు, మిగిలిన 19 బీఈడీ కళాశాలల్లో 50 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంది. బీఈడీ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లిస్తోంది. గత మూడేళ్ల నుంచి బీఈడీ కోర్సును రెండేళ్లు చేశారు. అయితే బీఈడీ కళాశాల ర్వహణలో లోపాలు, అక్రమాలపై నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) దృష్టి సారించింది. వీటిని అరికట్టేందుకు ఎన్సీటీఈ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కొన్ని కళాశాలల్లో విద్యార్థులు రాకపోయినా ఇష్టారాజ్యంగా హాజరు వేసి పరీక్షలకు పంపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు రాకుండానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తమ ఖాతాల్లో వేసుకుంటున్నాయి. అమలు కాని నిబంధనలు జిల్లాలోని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. కళాశాలలో 50 మంది విద్యార్థులు ఉంటే ఒక ప్రిన్సిపల్, ఏడుగురు అధ్యాపకులు ఉండాలి. 100 మంది విద్యార్థులకు ఒక ప్రిన్సిపల్ 15 మంది అధ్యాపకులు ఉండాలి. ఎన్సీటీఈ నిబంధనలు ప్రకారం ప్రిన్సిపాల్‌కు బీఈడీ, ఎంఈడీతో పాటు పీహెచ్డీ ఉండాలి. పదేళ్లు అనుభవం ఉండాలి. పూర్తి స్థాయిలో తరగతి గదులు, సైకాలజీ ల్యాబ్, లైబ్రరీ ఉండాలి. చాలా కళాశాలల్లో ఇవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. కళాశాలకు సొంత భవనంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు తప్పని సరిగా ఉండాలి. శిక్షణ సమయంలో విద్యార్థులతో బయట పాఠశాలల్లో బ్లాక్ టీచింగ్ చెప్పించాల్సి ఉంది. దీంతో పాటు 30 రికార్డులకు పైగా విద్యార్థులు రాయాల్సి ఉంది. వీటినింటిని చేసినట్టుగా చూపించినందుకు ప్రత్యేకంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు కళాశాలకు రెగ్యులర్‌గా రాకుండా హాజరు వేసినందుకు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి కొత్త మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్నారు. కన్నెత్తి చూడని వర్శిటీ అధికారులు బీఈడీ కళాశాలల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నా యూనివర్శిటీ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏటా ఉన్నత విద్యామండలి తరఫున ఒకరు, యూనివర్సిటీ తరఫున మరొకరు బీఈడీ కళాశాలలను తనిఖీ చేయాల్సి ఉంది. బీఈడీ కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా సిబ్బంది సరిపడా ఉంటేనే అడ్మిషన్లుకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే బీఈడీ కళాశాలలపై తనిఖీలు నామ మాత్రంగానే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కళాశాలలు తనిఖీల సమయంలో హడావుడి చేసి మమ అనిపిస్తున్నారు. బీఈడీ కళాశాలలకు వసతులు సరిగా ఉన్నా లేకున్నా అడ్మిషన్లుకు అనుమతి ఇవ్వాలంటే అధికారులకు కొంత ముట్టజెప్పాల్సి ఉంటుంది. దీంతోనే వర్సిటీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. తప్పని సరిగా బయోమెట్రిక్ 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కళాశాలల్లో తప్పని సరిగా బయోమెట్రిక్ యంత్రాలను బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ యంత్రాలు ద్వారానే విద్యార్థులు, అధ్యాపకులు హాజరును తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చాలా ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాలు బయోమెట్రిక్ ఏర్పాటు ఆదేశాలతో ఆందోళన పడుతున్నాయి. దీని వల్ల ప్రతి కళాశాలలో రెగ్యులర్‌గా విద్యార్థులు రావడం, బోధన చెప్పడం చేయాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ రావాలంటే విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతోనే కళాశాలల్లోని సీట్లు నిండుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ యంత్రాలు బిగిస్తే అడ్మిషన్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయా ప్రైవేట్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. బయోమెట్రిక్ యంత్రాలు బిగించాల్సిందే బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ యంత్రాలు తప్పని సరిగా బిగించాలి. బయోమెట్రిక్ ద్వారా హాజరును పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తారు. క్వాలిఫైడ్ అధ్యాపకులు, కళాశాలల్లో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలి. – విజయానందబాబు, డీన్, విక్రమ సింహపురి యూనివర్శిటీ -
1,000 బీఈడీ కాలేజీలకు నోటీసులు
కోల్‌కతా: నిర్దేశిత గడువులోగా కోరిన సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించని 1000 బీఈడీ కాలేజీలకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన కాలేజీల్లో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు చేపట్టవద్దని ఎన్సీటీఈ ఆదేశించిందని మానవ వనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వీటితోపాటు మరో 3వేల కాలేజీలకు త్వరలో నోటీసులు పంపనున్నారు. బీఈడీ, డీఈడీ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో తమకు అందించాలని కోరినా సమర్పించని కాలేజీలపై ఎన్సీటీఈ చర్యలకు ఉపక్రమించింది. -
బీఈడీ కళాశాలల దందా
- పాస్ గ్యారంటీ స్కీమ్ - రూ.కోట్లలో వ్యాపారం - ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వల ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలో బీఈడీ విద్యావ్యాపారం మూడు పువ్వులు..ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ముఖ్యంగా బీఈడీ కళాశాలల యాజమాన్యాలు దందా చేస్తున్నాయి. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్నాయి. పాస్ గ్యారంటీ స్కీమ్‌తో విద్యార్థులను ఆకర్షిస్తూ వారి నుంచి భారీ మొత్తాన్ని దోచుకుంటున్నాయి. దళారులను రంగంలోకి దింపి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కూడా వలేసి తమ కళాశాలల్లో చేర్పించుకుంటున్నాయి. కళాశాలలో పట్టుమని 10 రోజులు కూడా తరగతులకు హాజరుకాకున్నప్పటికీ విద్యార్థులు నేరుగా పరీక్షలు రాస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని బీఈడీ కళాశాలల్లో అక్రమాలకు అంతులేకుండా పోతోంది. విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి వారిని పాస్ చేయించేందుకు ఆ కళాశాలల యాజమాన్యాలు మాస్ కాపీయింగ్‌కు తెరతీశాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డిమాండ్ చేసి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో వారు రోడ్డెక్కి ధర్నా చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక విద్యార్థిని చేర్పిస్తే రూ.10 వేలు... జిల్లాలో మొత్తం 50 బీఈడీ కళాశాలలున్నాయి. వాటిలో సుమారు 7 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. మంగళవారం నుంచి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో బీఈడీ కళాశాలలకు డిమాండ్ పెరగడంతో కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించాయి. దళారులను రంగంలోకి దింపి తమ కళాశాలలో విద్యార్థులను చేర్పిస్తే ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు చొప్పున చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో దళారులు రంగంలోకి దిగి రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, పశ్చిమబెంగాల్, మిజోరం, చత్తీస్ఘడ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి జిల్లాలోని పశ్చిమ ప్రాంత బీఈడీ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించారు. గతంలో ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చి జిల్లాలోని పశ్చిమప్రాంతంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసేవారు. తాజాగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు యాజమాన్యాలు పీఆర్ఓలను రంగంలోకి దించాయి. అదే తరహాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బీఈడీ కళాశాలల యాజమాన్యాలు దళారులను రంగంలోకి దింపి తమ కళాశాలలో సీట్లు భర్తీ చేసుకుని కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం... బీఈడీ కళాశాలల యాజమాన్యాలను అదుపు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. పశ్చిమప్రాంతంలోని కొన్ని కళాశాలల్లో అసలు తరగతులే నిర్వహించడంలేదనేది బహిరంగ రహస్యం. వాటిని ఆకస్మికంగా తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. ఆ దిశగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. దీంతో కళాశాలల యాజమాన్యాలు సంబంధిత అధికారులను సైతం కొనేశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులైనా స్పందించి జిల్లాలో బీఈడీ కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది. అడ్డగోలుగా మాస్ కాపీయింగ్... బీఈడీ కళాశాలల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. కొన్ని పరీక్ష కేంద్రాల్లో ముందుగానే ప్రశ్నపత్రాలు విద్యార్థులకు లీకవుతున్నాయి. కేవలం 15 నిమిషాల ముందు మాత్రమే ప్రశ్నపత్రాల బండిళ్లు ఓపెన్ చేయాల్సి ఉండగా, కొన్నిచోట్ల అరగంట ముందుగానే విడుదలచేస్తున్నారు. ప్రశ్నపత్రంలో ఏయే ప్రశ్నలు వచ్చాయో విద్యార్థులకు ముందుగానే చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఆయా ప్రశ్నలకు సంబంధించిన జవాబులను సిద్ధం చేసుకుని నేరుగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకూ ఫీజులు... బీఈడీ కోర్సు వచ్చే విద్యాసంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంంలో మాత్రమే ఒక సంవత్సరం కావడంతో విద్యార్థులు ఈ ఏడాది అధిక సంఖ్యలో చేరారు. రాష్ట్రంలో 2008 నుంచి సెకండరీ గ్రేడ్ పోస్టులకు కేవలం డీఈడీ అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తుండగా, బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూలు అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే పరిమితమయ్యారు. స్కూలు అసిస్టెంట్ పోస్టుల సంఖ్య పరిమితంగా ఉండటంతో విద్యార్థులు డీఈడీ కళాశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో బీఈడీ కళాశాలలు విద్యార్థుల్లేక వెలవెలబోతున్నాయి. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీఈడీ కోర్సు రెండేళ్లుగా ఎన్సీటీఈ ప్రకటించింది. దీనికితోడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీఈడీ కోర్సు చేసిన వారు సైతం సెకండరీ గ్రేడ్ టీచరు పోస్టులకు అర్హులు. దీంతో డబ్బు పోయినా ఏడాదికి కోర్సు పూర్తవుతుందన్న ఆశతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడి కళాశాలల్లో చేరారు. దళారులు ముందుగానే అభ్యర్థులకు పాస్ గ్యారంటీపై హామీ ఇచ్చారు. ఇక్కడి కళాశాలల్లో చేరితే బ్లాక్ టీచింగ్, రికార్డులన్నీ తామే చూసుకుంటామని నమ్మబలికారు. కేవలం కళాశాలలో అడ్మిషన్ సమయంలో కనిపిస్తే చాలని, అనంతరం నేరుగా వచ్చి పరీక్షలు రాయవచ్చని వారికి హామీ ఇచ్చారు. అందుకుగానూ ఒక్కో అభ్యర్థి వద్ద రూ.75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేశారు. -
బీఈడీ కాలేజీల్లో ఫీజుల దందా!
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలోని పలు ప్రైవేటు బీఈడీ కళాశాలలు అక్రమాలకు తెరలేపాయి. ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తూ దండుకుంటున్నాయి. కన్వీనర్ కోటా సీట్లకూ లక్ష రూపాయలకు పైగా వసూలు చేసుకుంటున్నాయి. ఈ విషయమై రాయలసీమ యూనివర్సిటీ అధికారులకు సైతం భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల బీఈడీ అడ్మిషన్లు ముగిశాయి. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో చాలా మంది విద్యార్థులు కన్వీనర్ కోటాకు ఎంపికైనా ఇతర కోర్సుల్లో చేరిపోయారు. దీంతో కౌన్సెలింగ్‌లో సీటు పొందినా చాలా మంది విద్యార్థులు బీఈడీ కోర్సులో చేరలేదు. ఈ మేరకు జిల్లాలోని ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో 274 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో ఆదోని, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు, డోన్, ఎమ్మిగనూరులోని పలు కళాశాలల్లో భారీగా సీట్లు ఉన్నాయి. సాధారణంగా ఇలా మిగిలిపోయిన సీట్లకు పేపర్ ప్రకటన ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలను అధిక శాతం కళాశాలలు తుంగలో తొక్కాయి. కొన్ని కాలేజీలు మాత్రమే పత్రికా ప్రకటనలు ఇవ్వగా మరికొన్ని గుట్టుగా సీట్లను భర్తీ చేశాయి. ఒక్కోసీటు రూ. లక్షకు పైగానే...! గత యేడాది వరకు రాష్ట్రంలో బీఈడీ కోర్సుకు పెద్దగా డిమాండ్ లేదు. దీనికి కారణంగా డీఎస్సీలో బీఈడీ చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉండటమే. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ సీట్లను ఎస్జీటీలతోనే భర్తీ చేస్తున్నారు. ఈ కారణంగా బీఈడీ కోర్సుకు రాష్ట్రంలో డిమాండ్ తగ్గింది. అయితే వచ్చే యేడాది నుంచి బీఈడీ కోర్సు రెండేళ్లు కానుండటంతో ఈసారి బీఈడీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. కేవలం ఈ ఒక్క యేడాది మాత్రమే ఒక సంవత్సరం కోర్సు ఉండటంతో పలువురు బీఈడీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. పైగా కళాశాలకు వెళ్లినా వెళ్లకపోయినా సర్టిఫికెట్లు ఇచ్చే సంస్థలు ఉండటం కూడా విద్యార్థుల డిమాండ్‌కు కారణమైంది. ఇదే సమయంలో పక్క రాష్ట్రాల్లో బీఈడీ కోర్సుకు అధిక డిమాండ్ ఉంది. అక్కడి కళాశాలల్లో ఫీజులు కూడా భారీగానే ఉన్నాయి. దీంతో పక్క రాష్ట్రాల విద్యార్థులు అధిక శాతం ఇక్కడి కళాశాలల్లో చేరేందుకు ఉత్సాహం చూపారు. ఇలాంటి వారిని అధిక శాతం ఇక్కడి కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.1లక్ష నుంచి రూ.1.5లక్షల వరకు రాబట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం పక్క రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడ సీట్లు ఇవ్వడం కూడా విరుద్ధమైనా అడిగే వారు లేకపోవడంతో కళాశాల యాజమాన్యాలకు ఎదురులేకుండా పోయింది. స్థానిక విద్యార్థుల నుంచి కూడా ఇదే విధంగా ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై యూనివర్సిటీ అధికారులు పూర్తిస్తాయిలో విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. స్పాట్ అడ్మిషన్లను సైతం ఆన్లైన్లో నిర్వహిస్తే ఇలాంటి అక్రమాలను అరికట్టవచ్చని వారు కోరుతున్నారు. ఈ విషయమై రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జయరాజు వివరణ ఇస్తూ స్పాట్ అడ్మిషన్లలో అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామన్నారు. అక్రమాలు తేలితే సదరు కళాశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అడ్డగోలు అడ్మిషన్లు కుదరవు
13 ప్రైపేటు బీఈడీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి నోటీసులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో చోటుచేసుకున్న అడ్డగోలు ప్రవేశాలను నిరాకరించాలని ఏపీ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఎడ్‌సెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా చేసిన అడ్మిషన్లను తిరస్కరించనుంది. ఈ విధంగా అడ్డగోలుగా విద్యార్థులను చేర్చుకుని, ఆ తర్వాత వాటిని అనుమతించాలన్న 13 ప్రైవేటు బీఈడీ కాలేజీల వినతులను తిరస్కరించింది. ఆయా కాలేజీలకు నోటీసులు కూడా పంపింది. ప్రస్తుతానికి 13 కాలేజీలకే నోటీసులు వెళ్లినా ఇలాంటి కాలేజీలు ఎన్నో ఉన్నాయని, వాటన్నిటికీ ఇదే నిబంధన వర్తిస్తుందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి. వివరాలను మండలి అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచామని తెలిపాయి. మేనేజ్మెంట్ కోటాయే కాకుండా మైనార్టీ కాలేజీల్లో కూడా ఇలాంటి అడ్డగోలు ప్రవేశాలు అనేకం జరిగాయని తమ దృష్టికి వచ్చిందని, వాటిని కూడా తిరస్కరిస్తామని మండలి అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో 12, తూర్పు గోదావరి జిల్లాలో ఒక కళాశాలకు నోటిసులు జారీ అయ్యాయి. నోటీసులు జారీ అయిన బీఈడీ కాలేజీలు ఇవే 1. ఏఆర్కేఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సూళ్లూరుపేట), 2. గుత్తికొండ శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (రామచంద్రాపురం), 3. శ్రీపద్మావతీ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ (కావలి), 4. చిలకూరు అనిల్‌కుమార్ మెమోరియల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ (గూడూరు), 5.అలెక్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (వెంకటాచలం), 6. డా.చెన్నూరు రాధాకృష్ణారెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సైదాపురం), 7. నారాయణ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (పెదరూపల్లి), 8. డి.ప్రమీల మెమోరియల్ కాలేజ్ (ఆత్మకూరు), 9. హుస్సేనీ కాలేజీ (వెంకటంపేట, దుత్తలూరు), 10. సనా కాలేజీ (చెముడుగుంట), 11. యూనివర్సల్ క్రిస్టియన్ కాలేజీ (ఇందుకూరుపేట), 12. వేలంకని కాలేజీ (కండ్రిక, వెంకటాచలం)(ఇవన్నీ నెల్లూరు జిల్లాలోనివి), 13. విలియమ్స్ కాలేజీ (రాయుడుపాలెం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా)