కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలోని పలు ప్రైవేటు బీఈడీ కళాశాలలు అక్రమాలకు తెరలేపాయి. ఎన్‌సీటీఈ నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తూ దండుకుంటున్నాయి. కన్వీనర్ కోటా సీట్లకూ లక్ష రూపాయలకు పైగా వసూలు చేసుకుంటున్నాయి. ఈ విషయమై రాయలసీమ యూనివర్సిటీ అధికారులకు సైతం భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఇటీవల బీఈడీ అడ్మిషన్లు ముగిశాయి. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో చాలా మంది విద్యార్థులు కన్వీనర్ కోటాకు ఎంపికైనా ఇతర కోర్సుల్లో చేరిపోయారు. దీంతో కౌన్సెలింగ్‌లో సీటు పొందినా చాలా మంది విద్యార్థులు బీఈడీ కోర్సులో చేరలేదు. ఈ మేరకు జిల్లాలోని ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో 274 సీట్లు మిగిలిపోయాయి.
ఇందులో ఆదోని, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు, డోన్, ఎమ్మిగనూరులోని పలు కళాశాలల్లో భారీగా సీట్లు ఉన్నాయి. సాధారణంగా ఇలా మిగిలిపోయిన సీట్లకు పేపర్ ప్రకటన ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలను అధిక శాతం కళాశాలలు తుంగలో తొక్కాయి. కొన్ని కాలేజీలు మాత్రమే పత్రికా ప్రకటనలు ఇవ్వగా మరికొన్ని గుట్టుగా సీట్లను భర్తీ చేశాయి.
ఒక్కోసీటు రూ. లక్షకు పైగానే...!
గత యేడాది వరకు రాష్ట్రంలో బీఈడీ కోర్సుకు పెద్దగా డిమాండ్ లేదు. దీనికి కారణంగా డీఎస్సీలో బీఈడీ చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉండటమే. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ సీట్లను ఎస్‌జీటీలతోనే భర్తీ చేస్తున్నారు. ఈ కారణంగా బీఈడీ కోర్సుకు రాష్ట్రంలో డిమాండ్ తగ్గింది. అయితే వచ్చే యేడాది నుంచి బీఈడీ కోర్సు రెండేళ్లు కానుండటంతో ఈసారి బీఈడీ కోర్సుకు డిమాండ్ పెరిగింది.
కేవలం ఈ ఒక్క యేడాది మాత్రమే ఒక సంవత్సరం కోర్సు ఉండటంతో పలువురు బీఈడీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. పైగా కళాశాలకు వెళ్లినా వెళ్లకపోయినా సర్టిఫికెట్లు ఇచ్చే సంస్థలు ఉండటం కూడా విద్యార్థుల డిమాండ్‌కు కారణమైంది. ఇదే సమయంలో పక్క రాష్ట్రాల్లో బీఈడీ కోర్సుకు అధిక డిమాండ్ ఉంది. అక్కడి కళాశాలల్లో ఫీజులు కూడా భారీగానే ఉన్నాయి. దీంతో పక్క రాష్ట్రాల విద్యార్థులు అధిక శాతం ఇక్కడి కళాశాలల్లో చేరేందుకు ఉత్సాహం చూపారు.
ఇలాంటి వారిని అధిక శాతం ఇక్కడి కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.1లక్ష నుంచి రూ.1.5లక్షల వరకు రాబట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం పక్క రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడ సీట్లు ఇవ్వడం కూడా విరుద్ధమైనా అడిగే వారు లేకపోవడంతో కళాశాల యాజమాన్యాలకు ఎదురులేకుండా పోయింది. స్థానిక విద్యార్థుల నుంచి కూడా ఇదే విధంగా ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయమై యూనివర్సిటీ అధికారులు పూర్తిస్తాయిలో విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. స్పాట్ అడ్మిషన్లను సైతం ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే ఇలాంటి అక్రమాలను అరికట్టవచ్చని వారు కోరుతున్నారు. ఈ విషయమై రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జయరాజు వివరణ ఇస్తూ స్పాట్ అడ్మిషన్లలో అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామన్నారు. అక్రమాలు తేలితే సదరు కళాశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బీఈడీ కాలేజీల్లో ఫీజుల దందా!
Published Tue, Jan 20 2015 3:00 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement
Advertisement