సాక్షి, నెల్లూరు (టౌన్): విద్యా వ్యవస్థలో అవినీతి ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు విద్యా కళాశాలలు స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పక్కదారి పట్టిస్తున్నాయన్న కారణంతో డిగ్రీ, ఇంటర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా బీఈడీ కళాశాలల్లో కూడా బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో చాలా ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో విద్యార్థులు కళాశాలకు రాకుండానే హాజరు వేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు అర్హత లేని అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ జరుపుకోవచ్చన్న ఉద్దేశం ప్రైవేట్ కళాశాలల్లో ఉంది. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిగణలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాలో 21 బీఈడీ కళాశాలలు
జిల్లాలో మొత్తం 21 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఒక ప్రభుత్వ, 20 ప్రైవేట్ బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 720 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ బీఈడీ కళాశాల, సిద్ధార్థ బీఈడీ కళాశాలల్లో 100 మంది విద్యార్థులు, మిగిలిన 19 బీఈడీ కళాశాలల్లో 50 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంది. బీఈడీ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లిస్తోంది. గత మూడేళ్ల నుంచి బీఈడీ కోర్సును రెండేళ్లు చేశారు. అయితే బీఈడీ కళాశాల ర్వహణలో లోపాలు, అక్రమాలపై నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) దృష్టి సారించింది. వీటిని అరికట్టేందుకు ఎన్‌సీటీఈ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కొన్ని కళాశాలల్లో విద్యార్థులు రాకపోయినా ఇష్టారాజ్యంగా హాజరు వేసి పరీక్షలకు పంపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు రాకుండానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తమ ఖాతాల్లో వేసుకుంటున్నాయి.
అమలు కాని నిబంధనలు
జిల్లాలోని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. కళాశాలలో 50 మంది విద్యార్థులు ఉంటే ఒక ప్రిన్సిపల్, ఏడుగురు అధ్యాపకులు ఉండాలి. 100 మంది విద్యార్థులకు ఒక ప్రిన్సిపల్ 15 మంది అధ్యాపకులు ఉండాలి. ఎన్‌సీటీఈ నిబంధనలు ప్రకారం ప్రిన్సిపాల్‌కు బీఈడీ, ఎంఈడీతో పాటు పీహెచ్‌డీ ఉండాలి. పదేళ్లు అనుభవం ఉండాలి. పూర్తి స్థాయిలో తరగతి గదులు, సైకాలజీ ల్యాబ్, లైబ్రరీ ఉండాలి. చాలా కళాశాలల్లో ఇవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. కళాశాలకు సొంత భవనంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు తప్పని సరిగా ఉండాలి. శిక్షణ సమయంలో విద్యార్థులతో బయట పాఠశాలల్లో బ్లాక్ టీచింగ్ చెప్పించాల్సి ఉంది. దీంతో పాటు 30 రికార్డులకు పైగా విద్యార్థులు రాయాల్సి ఉంది. వీటినింటిని చేసినట్టుగా చూపించినందుకు ప్రత్యేకంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు కళాశాలకు రెగ్యులర్‌గా రాకుండా హాజరు వేసినందుకు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి కొత్త మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్నారు.
కన్నెత్తి చూడని వర్శిటీ అధికారులు
బీఈడీ కళాశాలల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నా యూనివర్శిటీ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏటా ఉన్నత విద్యామండలి తరఫున ఒకరు, యూనివర్సిటీ తరఫున మరొకరు బీఈడీ కళాశాలలను తనిఖీ చేయాల్సి ఉంది. బీఈడీ కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా సిబ్బంది సరిపడా ఉంటేనే అడ్మిషన్లుకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే బీఈడీ కళాశాలలపై తనిఖీలు నామ మాత్రంగానే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కళాశాలలు తనిఖీల సమయంలో హడావుడి చేసి మమ అనిపిస్తున్నారు. బీఈడీ కళాశాలలకు వసతులు సరిగా ఉన్నా లేకున్నా అడ్మిషన్లుకు అనుమతి ఇవ్వాలంటే అధికారులకు కొంత ముట్టజెప్పాల్సి ఉంటుంది. దీంతోనే వర్సిటీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
తప్పని సరిగా బయోమెట్రిక్
2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కళాశాలల్లో తప్పని సరిగా బయోమెట్రిక్ యంత్రాలను బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ యంత్రాలు ద్వారానే విద్యార్థులు, అధ్యాపకులు హాజరును తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చాలా ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాలు బయోమెట్రిక్ ఏర్పాటు ఆదేశాలతో ఆందోళన పడుతున్నాయి. దీని వల్ల ప్రతి కళాశాలలో రెగ్యులర్‌గా విద్యార్థులు రావడం, బోధన చెప్పడం చేయాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాలంటే విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతోనే కళాశాలల్లోని సీట్లు నిండుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ యంత్రాలు బిగిస్తే అడ్మిషన్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయా ప్రైవేట్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
బయోమెట్రిక్ యంత్రాలు బిగించాల్సిందే
బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ యంత్రాలు తప్పని సరిగా బిగించాలి. బయోమెట్రిక్ ద్వారా హాజరును పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తారు. క్వాలిఫైడ్ అధ్యాపకులు, కళాశాలల్లో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలి. – విజయానందబాబు, డీన్, విక్రమ సింహపురి యూనివర్శిటీ
నో ట్రిక్.. ఇక బయోమెట్రిక్
Published Sun, Jul 28 2019 10:04 AM | Last Updated on Sun, Jul 28 2019 10:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment