Biometric Attendance System
-
డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆయన పేరు డాక్టర్ దేవేందర్ (పేరు మార్చాం). హైదరాబాద్ సమీపంలోని ఒక ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడు. ఆయనకు నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారు. కా నీ, ఆయన రోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లుగా హాజరుంటుంది. బయోమెట్రిక్ హాజరున్నా తన మాయాజాలాన్ని ఉపయోగించారు. ఫేస్ రికగ్నేషన్ సందర్భంగా తన ముఖాన్ని కాకుండా ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో ఫీడ్ చేయించాడు. అతను వెళ్లకున్నా అక్కడి సిబ్బంది అతని ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో హాజరు కోసం ఉపయోగిస్తున్నారు. మరో డాక్టర్ శ్రవణ్ కుమార్ (పేరు మార్చాం). నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతను వారానికి ఒకరోజు ఆసుపత్రికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తాడు. కానీ, అతను రోజూ వచ్చినట్లుగా హాజరుంటుంది. అతను వేలిముద్ర హాజరును దిద్దుబాటు చేశాడు. తన వేలి ముద్ర బదులుగా అక్కడ రోజూ వచ్చే ఇతర సిబ్బంది వేలిముద్రను ఫీడ్ చేశాడు. దీంతో అతను వెళ్లకుండానే హాజరుపడుతుంది. ఆమె పేరు డాక్టర్ రవళి(పేరు మార్చాం). రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ప్రతీ డాక్టర్ తాను పనిచేసినట్లుగా రోజూ ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆ జిల్లాలో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఒక రోజు వచ్చి తన వ్రస్తాలను ఐదారుసార్లు మార్చి ఇతర వస్త్రాలను ధరించడం, హెయిర్ స్టైల్‌ను కూడా మార్చి రోగులను చూసినట్లు ఫొటోలు దిగుతారు. వారంలో మిగిలిన రోజులు రాకుండానే ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో వైద్యుల బండారం బట్టబయలు రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 48 ఏరియా ఆసుపత్రులు, 108 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 33 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో ఎండీ, ఇతర సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్యం చేస్తుంటారు. ఆర్థో, కార్డియాక్, గైనిక్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో వంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంటుంది. కొందరు స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా హైదరాబాద్‌లోనూ, తాము పనిచేసే సమీప పెద్ద నగరాల్లోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు అనేకచోట్ల డాక్టర్లు విధులకు రాకపోవడాన్ని గుర్తించారు. ఈ మేరకు 50 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. హాజరైనట్లుగా తప్పుడు పద్ధతులు కొన్ని ఆసుపత్రుల్లో ఫేస్ రికగ్నేషన్ మెషీన్, కొన్నిచోట్ల వేలిముద్రల మెషీన్లను వైద్యవిధాన పరిషత్ ఏర్పాటు చేసింది. అయితే ఫేస్ రికగ్నేషన్ మెషీన్లో కొందరు డాక్టర్లు ముఖం కాకుండా ఫొటోలను ఫీడ్ చేశారు. ఆ ఫొటోను ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి ఇచ్చి, రోజూ ఫొటోను ఫేస్ రికగ్నేషన్ మెషీన్ ముందు పెట్టి హాజరు వేయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే వారాల తరబడి కూడా ఆసుపత్రుల ముఖం చూడటంలేదని తేలింది. కానీ, హాజరైనట్లుగా మెషీన్లో నమోదవుతుంది. కొన్నిచోట్ల తమకు బదులుగా అక్కడి సిబ్బంది వేలిముద్రలను మెషీన్లలో ఫీడ్ చేయించారు. సిబ్బంది వేలిముద్రల సహాయంతో హాజరైనట్లుగా నమోదు చేయించుకుంటున్నారు. కొందరు డాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులకు వైద్యం చేస్తూ మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లాలో ఒక మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి తన వ్రస్తాలను మార్చి మార్చి ఇతర వ్రస్తాలను ధరించి ఫొటోలు దిగి బయోమెట్రిక్ అటెండెన్స్‌లో ఫీడ్ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ డాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించగా కొందరు మంత్రుల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొన్ని సంఘాలు కూడా ఇటువంటి డాక్టర్లకు వంతపాడుతున్నాయని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బయోమెట్రిక్‌ను పక్కాగా అమలు చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పక్కాగా అమలుచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి విడదల రజని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల సంఖ్యను ప్రభుత్వం గణనీయంగా పెంచిందని, అర్హులైన ప్రజలకు సరైన చికిత్స అందేలా చూడాలన్నారు. ఆయుష్ డిస్పెన్సరీలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అన్ని పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య శాఖలో బోధనాస్పత్రుల పాత్ర కీలకం పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విషయంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల పాత్ర కీలకమని మంత్రి విడదల రజని చెప్పారు. డీఎంఈ పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు విధుల్లో ఉండేలా చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లదేనని స్పష్టంచేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీల పనితీరును మెరుగుపరచాలని, ఈ మూడు ఏజెన్సీల సిబ్బందికి కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయాలని చెప్పారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో షిఫ్టుల వారీగా బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును షిఫ్టుల వారీగా వేయాలని వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా ఆస్పత్రులూ, సంస్థల బాధ్యులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కొద్ది నెలలుగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే 24/7 పనిచేసే ఆస్పత్రుల్లో ఉద్యోగుల హాజరు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటిలో ఆస్పత్రులు, ఇతర సంస్థల్లో బయోమెట్రిక్ హాజరు 3 షిఫ్ట్‌ల ప్రకారం సవరించి, డ్యూటీ రోస్టర్‌ను సంబంధిత హెల్త్ కేర్ ఫెసిలిటీ హెడ్ సిద్ధం చేయాలని సూచించారు. అలర్ట్ మెకానిజం కూడా అభివృద్ధి చేసి సంబంధిత ఉద్యోగులకు ఆబ్సెంట్ మెసేజ్‌లను ఎప్పటికప్పుడు ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపనున్నారు. వచ్చే ఆగస్టు నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు జమ చేయాలని ఆదేశాలిచ్చారు. -
డీఎడ్ కోర్సుకు కొత్తరూపు..!
సాక్షి, బద్వేలు : ఒకప్పుడు డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) అంటే యమాక్రేజ్. ఉపాధ్యాయ పోస్టుల విడుదల ఏటా భర్తీ చేయడం.. ఇంటర్, డీఎడ్ పూర్తి చేసి ఇరవై ఏళ్ల లోపే ఉద్యోగం డీఎడ్తోనే సాధ్యం. దీంతో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు చాలామంది డీఎడ్ ప్రవేశ పరీక్ష రాయడం, కోర్సులో చేరడం జోరుగా ఉండేది. గత కొన్నేళ్లుగా డీఎడ్‌కు డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డీఎడ్ కోర్సుపై దృష్టి సారించింది. ఈ కళాశాలల్లో జరిగే అవినీతి, అక్రమాలు చెక్ పెట్టేందుకు పలు రకాల చర్యలు చేపడుతోంది. ప్రయివేట్ డీఎడ్ కళాశాలలు అన్నింటిలో బయోమెట్రిక్ విధానం అమలుకు సన్నాహాలు చేస్తోంది. డీఎడ్ కళాశాలల్లో అర్హత కలిగిన ఫ్యాకల్టీలు, కనీస సదుపాయాలు కల్పన లేక పోవడంతో విద్యలో చేరే వారి సంఖ్య ఏటేటా తగ్గుతోంది. గత ప్రభుత్వం కళాశాల ఏర్పాటుకు అనుమతులు కూడా ఇష్టారాజ్యంగా ఇచ్చింది. దీనికి తోడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఈ విద్యకు ఆదరణ తగ్గి డీఎడ్ కోర్సులో చేరేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. సీట్లు భర్తీ కాకపోవడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు అర్హత లేకున్నా సర్టిఫికెట్ ఉన్నవారిని అధ్యాపకులుగా నియమించుకుని తక్కువ వేతనాలతో బోధన చేయిస్తున్నారు. ఇక మూడొంతుల సీట్లు ఖాళీగా ఉన్నవారు తరగతులు నిర్వహణ పట్ల పూర్తిగా అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా ఉపాధ్యాయ విద్య బోధనలో నాణ్యత, నైపుణ్య ప్రమాణాలు దెబ్బ తింటున్నాయి. అయితే డీఎడ్ కోర్సుకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కొంతమేర సీట్లు భర్తీ చేస్తున్నాయి. కేవలం పరీక్షలకు మాత్రమే హాజరయ్యేలా ఒప్పందం చేసుకుని భారీగా పీజులు వసూలు చేస్తున్నాయి. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న కొత్త ప్రభుత్వం డీఎడ్ కళాశాలల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఇకపై తప్పనిసరిగా కళాశాలకు హాజరుకావాల్సిందే. బయోమెట్రిక్ వేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రాయచోటిలో ప్రభుత్వ డైట్ కళాశాలతో పాటు 90కి పైగా కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు పదివేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు. కానీ గతేడాది 2వేల మంది విద్యార్థులు మాత్రమే డీఎడ్ కోర్సులో చేరారు. అధిక శాతం కళాశాలల్లో 50 సీట్లకుగాను 20 సీట్ల లోపు మాత్రమే భర్తీ అయ్యాయంటే విద్యార్థుల ఆసక్తి కనిపిస్తోంది. సగటున ఒక్కో కళాశాలలో 20 వరకు సీట్లు భర్తీ అయ్యాయంటే డీఎడ్ కళాశాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్రమాలకు అడ్డుకట్ట.. డీఎడ్ కళాశాలల్లో అక్రమ అడ్మిషన్లకు అడ్డు లేకుండా పోయింది. డీఎడ్ ప్రవేశాలకు జరిగే కౌన్సిలింగ్లో కన్వీనరు కోటాలో సీట్లు భర్తీ కాకపోయినా మేనేజ్మెంట్ కోటా మాత్రం భర్తీ అవుతున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో చేరే వారిలో అధికశాతం డీఎడ్ ప్రవేశపరీక్ష రాయనివారే ఉంటున్నారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారి నుంచి వసూలు చేసిన ఫీజులో కొంత మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పి పరీక్షల ముందు వరకు సీట్లు భర్తీ చేసుకునేందుకు అనుమతులు పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయ కోర్సు నాణ్యతా ప్రమాణాలు దెబ్బ తింటున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సెమిస్టర్ విధానంలో పరీక్షలు... అక్రమాలను అడ్డుకుని ప్రతి ఒక్కరితో పరీక్షలు రాయించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి సెమెస్టర్ విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్సీఈఆర్టీ (రాష్ట్ర విద్య పరిశోధన సంస్థ) నిబంధనల మేరకు ఈ ఏడాది నుంచే డీఎడ్‌లో సెమెస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించుకుంది. ఇటీవల విజయవాడలో ప్రభుత్వ డైట్ కళాశాలల ప్రిన్సిపాల్లతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై చర్చించి వారి అభిప్రాయాలను సైతం సేకరించింది. తదుపరి ప్రయివేట్ కళాశాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచి డీఎడ్‌లో సెమిస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ పరీక్షల నియంత్రణ మండలికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. సెమిస్టర్ విధానంలో జరగనున్న థియరీ, ప్రాక్టికల్స్ నిర్వహణకు ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను నిర్ణయించనుంది. ఉత్తమ నిర్ణయం.. పరీక్ష విధానంలో మార్పులు తీసుకువస్తే విద్యార్థుల్లో ఒత్తిడి ఉండదు. దీంతో పాటు రికార్డులు, రిజిస్ట్రర్లు కూడా సక్రమంగా చేస్తారు. గుణాత్మక విలువలు పెరుగుతాయి. పాఠశాలలో బోధనలో నాణ్యత కూడా పెరిగే అవకాశముంటుంది. డిగ్రీ కళాశాలల్లో కూడా సెమిస్టర్ విధానం ఇప్పటికే అమలు చేశారు. కొన్ని కారణాలతో రెండేళ్ల డీఎడ్ కోర్సు పూర్తి చేసే సరికి మూడేళ్లు పడుతోంది. సెమిస్టర్ విధానం అమలైతే కచ్చితంగా రెండేళ్లలో కోర్సు పూర్తి అవుతుంది. తదుపరి కోర్సు చేసేందుకు వారికి అవకాశం కూడా ఉంటుంది. – చంద్రయ్య, ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, రాయచోటి నాణ్యత పెరుగుతుంది.. సెమిస్టర్ విధానంలో విద్యలో నాణ్యత పెరుగుతుంది. తద్వారా తదుపరి వారు ఉపాధ్యాయులైన తరువాత ఉత్తమ పద్ధతుల్లో బోధించగలరు. ప్రభుత్వం నాణ్యత పెరిగే విధంగా, అక్రమాలకు చెక్ పెట్టే చర్యలు చేపట్టడం మంచి విషయం. డీఎడ్ కళాశాలలు నాణ్యంగా ఉన్నప్పుడే పాఠశాలలు నాణ్యంగా ఉంటాయి. – కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అక్రమాలకు అడ్డు వేయాల్సిందే.. డీఎడ్ కళాశాలల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిందే. చాలా కళాశాలల్లో విద్యార్థులు సరిగా హాజరు కాకున్నా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బయోమెట్రిక్ హాజరు అమలైతే వీటికి అడ్డుకట్ట పడుతుంది. – మనోహార్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి -
నో ట్రిక్.. ఇక బయోమెట్రిక్
సాక్షి, నెల్లూరు (టౌన్): విద్యా వ్యవస్థలో అవినీతి ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు విద్యా కళాశాలలు స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పక్కదారి పట్టిస్తున్నాయన్న కారణంతో డిగ్రీ, ఇంటర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా బీఈడీ కళాశాలల్లో కూడా బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో చాలా ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో విద్యార్థులు కళాశాలకు రాకుండానే హాజరు వేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు అర్హత లేని అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ జరుపుకోవచ్చన్న ఉద్దేశం ప్రైవేట్ కళాశాలల్లో ఉంది. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిగణలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 21 బీఈడీ కళాశాలలు జిల్లాలో మొత్తం 21 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఒక ప్రభుత్వ, 20 ప్రైవేట్ బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 720 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ బీఈడీ కళాశాల, సిద్ధార్థ బీఈడీ కళాశాలల్లో 100 మంది విద్యార్థులు, మిగిలిన 19 బీఈడీ కళాశాలల్లో 50 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంది. బీఈడీ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లిస్తోంది. గత మూడేళ్ల నుంచి బీఈడీ కోర్సును రెండేళ్లు చేశారు. అయితే బీఈడీ కళాశాల ర్వహణలో లోపాలు, అక్రమాలపై నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) దృష్టి సారించింది. వీటిని అరికట్టేందుకు ఎన్సీటీఈ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కొన్ని కళాశాలల్లో విద్యార్థులు రాకపోయినా ఇష్టారాజ్యంగా హాజరు వేసి పరీక్షలకు పంపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు రాకుండానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తమ ఖాతాల్లో వేసుకుంటున్నాయి. అమలు కాని నిబంధనలు జిల్లాలోని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. కళాశాలలో 50 మంది విద్యార్థులు ఉంటే ఒక ప్రిన్సిపల్, ఏడుగురు అధ్యాపకులు ఉండాలి. 100 మంది విద్యార్థులకు ఒక ప్రిన్సిపల్ 15 మంది అధ్యాపకులు ఉండాలి. ఎన్సీటీఈ నిబంధనలు ప్రకారం ప్రిన్సిపాల్‌కు బీఈడీ, ఎంఈడీతో పాటు పీహెచ్డీ ఉండాలి. పదేళ్లు అనుభవం ఉండాలి. పూర్తి స్థాయిలో తరగతి గదులు, సైకాలజీ ల్యాబ్, లైబ్రరీ ఉండాలి. చాలా కళాశాలల్లో ఇవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. కళాశాలకు సొంత భవనంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు తప్పని సరిగా ఉండాలి. శిక్షణ సమయంలో విద్యార్థులతో బయట పాఠశాలల్లో బ్లాక్ టీచింగ్ చెప్పించాల్సి ఉంది. దీంతో పాటు 30 రికార్డులకు పైగా విద్యార్థులు రాయాల్సి ఉంది. వీటినింటిని చేసినట్టుగా చూపించినందుకు ప్రత్యేకంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు కళాశాలకు రెగ్యులర్‌గా రాకుండా హాజరు వేసినందుకు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి కొత్త మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్నారు. కన్నెత్తి చూడని వర్శిటీ అధికారులు బీఈడీ కళాశాలల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నా యూనివర్శిటీ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏటా ఉన్నత విద్యామండలి తరఫున ఒకరు, యూనివర్సిటీ తరఫున మరొకరు బీఈడీ కళాశాలలను తనిఖీ చేయాల్సి ఉంది. బీఈడీ కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా సిబ్బంది సరిపడా ఉంటేనే అడ్మిషన్లుకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే బీఈడీ కళాశాలలపై తనిఖీలు నామ మాత్రంగానే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కళాశాలలు తనిఖీల సమయంలో హడావుడి చేసి మమ అనిపిస్తున్నారు. బీఈడీ కళాశాలలకు వసతులు సరిగా ఉన్నా లేకున్నా అడ్మిషన్లుకు అనుమతి ఇవ్వాలంటే అధికారులకు కొంత ముట్టజెప్పాల్సి ఉంటుంది. దీంతోనే వర్సిటీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. తప్పని సరిగా బయోమెట్రిక్ 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కళాశాలల్లో తప్పని సరిగా బయోమెట్రిక్ యంత్రాలను బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ యంత్రాలు ద్వారానే విద్యార్థులు, అధ్యాపకులు హాజరును తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చాలా ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాలు బయోమెట్రిక్ ఏర్పాటు ఆదేశాలతో ఆందోళన పడుతున్నాయి. దీని వల్ల ప్రతి కళాశాలలో రెగ్యులర్‌గా విద్యార్థులు రావడం, బోధన చెప్పడం చేయాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ రావాలంటే విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతోనే కళాశాలల్లోని సీట్లు నిండుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ యంత్రాలు బిగిస్తే అడ్మిషన్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయా ప్రైవేట్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. బయోమెట్రిక్ యంత్రాలు బిగించాల్సిందే బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ యంత్రాలు తప్పని సరిగా బిగించాలి. బయోమెట్రిక్ ద్వారా హాజరును పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తారు. క్వాలిఫైడ్ అధ్యాపకులు, కళాశాలల్లో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలి. – విజయానందబాబు, డీన్, విక్రమ సింహపురి యూనివర్శిటీ -
బయోమెట్రిక్ వేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యను మెరుగుపర్చేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇకపై ప్రతి మెడికల్ కాలేజీ విధిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. కాలేజీ సిబ్బంది అంతా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలను ప్రతి రోజూ కాలేజ్ వెబ్సైట్లో పొందుపర్చాలని పేర్కొంది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్‌కు సవరణలు చేసి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం, ఎంసీఐ ఎప్పుడు అడిగినా మెడికల్ కాలేజీలు బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ప్రతి కాలేజీ సొంతగా వెబ్‌సైట్‌ను కలిగి ఉండాలి. ‘ఇన్ఫర్మేషన్ అండర్ మినిమమ్ స్టాండర్ట్ రిక్వైర్మెంట్స్ క్లాజ్’పేరిట కాలేజీకి సంబంధించిన వివరాలను ప్రతి నెలా మొదటి వారం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. -
వేలిముద్ర పడితేనే ‘హాజరు’
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుంది. వేలిముద్రలతో హాజరు స్వీకరణ ఇదివరకు అమలు చేసినప్పటికీ అందులో ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ విధానం లేదు. పిల్లల వేలిముద్రలు నమోదు చేసిన తర్వాత వాటి ఆధారంగా రోజువారీ హాజరును తీసుకునేవారు. కానీ ఈ ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల చాలాచోట్ల నిలిచిపోయింది. దీంతో మాన్యువల్ పద్ధతినే కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రతి వసతి గృహంలో బయోమెట్రిక్ హాజరు పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక సహకారాన్ని టీఎస్టీఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్)కు అప్పగించింది. ఈక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రయోగాత్మకంగా బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయించింది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ సాయంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 697 హాస్టళ్లున్నాయి. ఇందులో 257 పోస్టుమెట్రిక్ హాస్టళ్లు కాగా, 440 ప్రీమెట్రిక్ హాస్టళ్లు. కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఏర్పాటు చేసింది. మిషన్ల ఇన్స్టలేషన్ పూర్తి చేసిన యంత్రాంగం రోజువారీ హాజరు తీరును పరిశీలిస్తోంది. కమిషనరేట్‌లో కమాండ్ కంట్రోల్ వసతి గృహాల్లో హాజరు తీరును పరిశీలించేందుకు బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. రోజువారీ హాజరు ఎలా ఉందో ఇక్కడ్నుంచి పర్యవేక్షిస్తారు. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ విధానం కావడంతో ప్రతి విద్యార్థి ఆధార్ సంఖ్యతో వేలిముద్రలు అనుసంధానమవుతాయి. విద్యార్థులు తమ వేలి ముద్రను మిషన్‌లో నమోదు చేసిన వెంటనే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. వెనువెంటనే హాజరు నమోదవుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా హాజరు నమోదు చేయాలి. వాటి ఆధారంగా మెస్ చార్జీలు ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పద్ధతిని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. గతంలో ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని కొన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసినప్పటికీ సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కొత్త మిషన్లతో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. 2019– 20 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరును పక్కాగా అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
రైల్వేలో ఆధార్‌తో బయోమెట్రిక్ అటెండెన్స్
హైదరాబాద్: రైల్వే కార్యాలయాల్లో 2018 జనవరి 31 నుంచి ఉద్యోగులకు ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ హాజరును అమలు చేయనున్నారు. ఆలస్యంగా హాజరయ్యేవారిని కనిపెట్టేందుకు జనవరి 31కల్లా ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ సిస్టంను రైల్వే జోన్లు, డివిజనల్లలో ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈమేరకు రైల్వే బోర్డు నవంబర్ 3న అన్ని జోన్లకు లేఖలు పంపింది. మొదటగా అన్ని డివిజనల్, జోనల్, కోల్‌కతా మెట్రో రైలు, రైల్వే వర్క్‌షాపులు, కర్మాగారాలు, ఉత్పత్తి యూనిట్లలో నవంబర్ 30కల్లా అమలు చేయాలని ఆ లేఖలో ఆదేశించారు. విధులకు ఆలస్యంగా వచ్చే, అసలు రాని అధికారులపై ఈ విధానంతో నిఘా ఉంచాలన్నది ఉద్దేశమని ఒక సీనియర్ అధికారి తెలిపారు. రెండో విడతగా అన్ని రైల్వే అండర్ టేకింగ్, అటాచ్డ్, సబార్డినేట్ కార్యాలయాల్లో జనవరి 31కల్లా అమలు చేస్తారు. ఇప్పటికే ఈ పద్ధతి రైల్వే బోర్డు, కొన్ని జోన్ల ప్రధాన కార్యాలయాల్లో అమలులో ఉంది. ఈ కొత్త హాజరు పద్ధతిని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం పర్యవేక్షించాలని ఆ లేఖలో రైల్వే బోర్డు తెలిపింది. దీంతోపాటు సీసీ టీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. -
ఏయూలో బయోమెట్రిక్ రగడ
-
బయోమెట్రిక్ హాజరు సాధ్యమేనా?
► ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు యోచన ► ముందుకురాని కళాశాలల యాజమాన్యాలు ► ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. దీనికి ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేటు యూజమాన్యాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. సరైన హాజరు లేకుండా కొన్ని కళాశాలలు రీయింబర్స్మెంట్ పొందడాన్ని కూడా నూతన విధానం ద్వారా నివారించవచ్చని విద్యామండలి భావిస్తోంది. అయితే, ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకతల మధ్య ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు సాధ్యపడుతుందో లేదో వేచి చూడాలి. ఎచ్చెర్ల: ఈ విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు తప్పని సరిగా అమలు చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తుంది. రాష్ట్రంలో 14 యూనివర్సిటీల వైస్‌చాన్సలర్లు, రిజిస్ట్రార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సుమితా దావ్రా తప్పని సరిగా బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని ఆదేశించారు. రెండు విధాలుగా బయోమెట్రిక్ హాజరు వల్ల ప్రయోజనం చేకూరుతుందని విద్యాశాఖ భావిస్తుంది. మొదటిది హాజరుశాతం పెరుగుదల, రెండోది హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు మంజూరు. విద్యార్థులు కనీసం 70 శాతం హాజరయితేనే రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. ప్రస్తుతం కొన్ని కళాశాలల నిర్వహణ చూస్తే బయోమెట్రిక్ హాజరు ఖచ్చితంగా అమలు చేస్తే మూత పడే పరిస్థితులు సైతం కనిపిస్తున్నాయి. జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 15 విభాగాలు ఉండగా, ఎఫిలియేషన్లో 12 ప్రభుత్వ, 88 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, 18 బీఎడ్ కళాశాలలు, 11 పీజీ కళాశాలు, ఒక న్యాయ కళాశాల ఉన్నాయి. జిల్లాలో మరో పక్క జేఎన్టీయూ ఏఫిలియేషన్లో ఎనిమిది ఇంజినీరింగ్, రెండు ఫార్మశీ, ఎనిమిది ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. హాజరుకే కొనసాగుతున్న విభాగాలు వర్సిటీలో పరిస్థితి చూస్తే కొన్ని విభాగాల్లో కనీసం తరగతులు నిర్వహించకుండా హాజరు మాత్రమే వేస్తున్నారు. లేదంటే ఈ కోర్సులు ఎత్తివేయవలసిందే. మరో పక్క ఏఫిలియేషన్ పరిధిలో ఉన్న న్యాయకళాశాల, బీఎడ్ కళాశాలల్లో తరగతులు కనీసం కూడా నిర్వహించడం లేదు. దూర విద్యకంటే దారుణంగా కొన్ని కళాశాలల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. హాజరుకు సైత ం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరో పక్క రీయింబర్స్మెంట్ సైతం క్లెరుుమ్ చేస్తున్నారు. వెనుకడుగు వేస్తున్న కళాశాలలు జిల్లాలో ఎంటెక్, ఎంఫార్మశీ వంటి కోర్సులకు తరగతులు నిర్వహించకుండానే కొనసాగిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ కొందరు పీజీ కోర్సులు చదివేస్తున్నారు. విద్యార్థులు పరీక్షలకు వస్తే చాలు అన్నట్టు కొన్ని కళాశాలల్లో ఎంబీఏ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బయోమెట్రిక్ పక్కాగా జిల్లాలో అమలు చేస్తే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 50 శాతం కూడా ఉండకపోవచ్చు. అందుకే ప్రైవేట్ కళాశాలలు బయోమెట్రిక్ అమలుకు వెనుకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీతో సహా ఫ్యాకల్టీ సభ్యులకు బయోమెట్రిక్‌ను చాలా కళాశాలు అమలు చేస్తున్నాయి. విద్యార్థుల విషయంలో అమలు చేయడంలో మాత్రం ముందుకు రావడం లేదు. మరో పక్క ఉన్నత విద్యా మండలి రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా తగ్గించుకునే పనిలో ఉంది. ఈ మేరకు కళాశాలలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం అవుతుంది. జిల్లాలో ఇప్పటికే రెండు ఇంజినీరింగ్ కళాశాలలు మాతపడ్డాయి. మరో కళాశాల మూతపడే పరిస్థితిలో ఉంది. బయోమెట్రిక్ అమలు చేస్తే భవిష్యత్తులో కళాశాలల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో బయోమెట్రిక్ పద్ధతిని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. భవిష్యత్తులో బయోమెట్రిక్ హాజరు ఏమేరకు అమలవుతుందో వేచి చూడవల్సిందే. క్లాస్ వర్క్ పక్కాగా ఉంటుంది బయోమెట్రిక్ హాజరు వల్ల క్లాస్ వర్క్ పక్కాగా ఉంటుంది. కోర్సుపై ఆసక్తి ఉన్నవారు మాత్రమే చేరుతారు. విద్యార్థుల్లో హాజరు శాతం లేకుండా తరగతులకు అనుమతించటం వల్ల ప్రయోజనం ఉండదు. హాజరు శాతం పెరగాలంటే తప్పకుండా బయోమెట్రిక్ అమలు అవసరం. - ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, ఇన్చార్జి వైస్ చాన్సలర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఉత్తీర్ణతా శాతం మెరుగుపడుతుంది బయోమెట్రిక్ హాజరు వల్ల విద్యార్థులు తరగతులకు పక్కాగా హాజరవుతారు. విద్యార్థులు తరగతికి వెళ్లడం, పాఠాలు వినడం తప్పనిసరి. దీంతో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఉత్తీర్ణత శాతం మెరుగుపడుతుంది. ప్రారంభంలో అమల్లో కష్టంగా ఉన్నా భవిష్యత్‌లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. - ప్రొఫెసర్ గుంట తులసీరావు, రిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ