కళాశాలలో డీఎడ్ విద్యార్థినులు
సాక్షి, బద్వేలు : ఒకప్పుడు డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) అంటే యమాక్రేజ్. ఉపాధ్యాయ పోస్టుల విడుదల ఏటా భర్తీ చేయడం.. ఇంటర్, డీఎడ్ పూర్తి చేసి ఇరవై ఏళ్ల లోపే ఉద్యోగం డీఎడ్‌తోనే సాధ్యం. దీంతో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు చాలామంది డీఎడ్ ప్రవేశ పరీక్ష రాయడం, కోర్సులో చేరడం జోరుగా ఉండేది. గత కొన్నేళ్లుగా డీఎడ్‌కు డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డీఎడ్ కోర్సుపై దృష్టి సారించింది. ఈ కళాశాలల్లో జరిగే అవినీతి, అక్రమాలు చెక్ పెట్టేందుకు పలు రకాల చర్యలు చేపడుతోంది. ప్రయివేట్ డీఎడ్ కళాశాలలు అన్నింటిలో బయోమెట్రిక్ విధానం అమలుకు సన్నాహాలు చేస్తోంది. డీఎడ్ కళాశాలల్లో అర్హత కలిగిన ఫ్యాకల్టీలు, కనీస సదుపాయాలు కల్పన లేక పోవడంతో విద్యలో చేరే వారి సంఖ్య ఏటేటా తగ్గుతోంది. గత ప్రభుత్వం కళాశాల ఏర్పాటుకు అనుమతులు కూడా ఇష్టారాజ్యంగా ఇచ్చింది. దీనికి తోడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఈ విద్యకు ఆదరణ తగ్గి డీఎడ్ కోర్సులో చేరేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. సీట్లు భర్తీ కాకపోవడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు అర్హత లేకున్నా సర్టిఫికెట్ ఉన్నవారిని అధ్యాపకులుగా నియమించుకుని తక్కువ వేతనాలతో బోధన చేయిస్తున్నారు. ఇక మూడొంతుల సీట్లు ఖాళీగా ఉన్నవారు తరగతులు నిర్వహణ పట్ల పూర్తిగా అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా ఉపాధ్యాయ విద్య బోధనలో నాణ్యత, నైపుణ్య ప్రమాణాలు దెబ్బ తింటున్నాయి.
అయితే డీఎడ్ కోర్సుకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కొంతమేర సీట్లు భర్తీ చేస్తున్నాయి. కేవలం పరీక్షలకు మాత్రమే హాజరయ్యేలా ఒప్పందం చేసుకుని భారీగా పీజులు వసూలు చేస్తున్నాయి. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న కొత్త ప్రభుత్వం డీఎడ్ కళాశాలల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఇకపై తప్పనిసరిగా కళాశాలకు హాజరుకావాల్సిందే. బయోమెట్రిక్ వేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రాయచోటిలో ప్రభుత్వ డైట్ కళాశాలతో పాటు 90కి పైగా కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు పదివేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు. కానీ గతేడాది 2వేల మంది విద్యార్థులు మాత్రమే డీఎడ్ కోర్సులో చేరారు. అధిక శాతం కళాశాలల్లో 50 సీట్లకుగాను 20 సీట్ల లోపు మాత్రమే భర్తీ అయ్యాయంటే విద్యార్థుల ఆసక్తి కనిపిస్తోంది. సగటున ఒక్కో కళాశాలలో 20 వరకు సీట్లు భర్తీ అయ్యాయంటే డీఎడ్ కళాశాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అక్రమాలకు అడ్డుకట్ట..
డీఎడ్ కళాశాలల్లో అక్రమ అడ్మిషన్లకు అడ్డు లేకుండా పోయింది. డీఎడ్ ప్రవేశాలకు జరిగే కౌన్సిలింగ్‌లో కన్వీనరు కోటాలో సీట్లు భర్తీ కాకపోయినా మేనేజ్‌మెంట్ కోటా మాత్రం భర్తీ అవుతున్నాయి. మేనేజ్‌మెంట్ కోటాలో చేరే వారిలో అధికశాతం డీఎడ్ ప్రవేశపరీక్ష రాయనివారే ఉంటున్నారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారి నుంచి వసూలు చేసిన ఫీజులో కొంత మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పి పరీక్షల ముందు వరకు సీట్లు భర్తీ చేసుకునేందుకు అనుమతులు పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయ కోర్సు నాణ్యతా ప్రమాణాలు దెబ్బ తింటున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక సెమిస్టర్ విధానంలో పరీక్షలు...
అక్రమాలను అడ్డుకుని ప్రతి ఒక్కరితో పరీక్షలు రాయించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి సెమెస్టర్ విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ (రాష్ట్ర విద్య పరిశోధన సంస్థ) నిబంధనల మేరకు ఈ ఏడాది నుంచే డీఎడ్‌లో సెమెస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించుకుంది. ఇటీవల విజయవాడలో ప్రభుత్వ డైట్ కళాశాలల ప్రిన్సిపాల్‌లతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై చర్చించి వారి అభిప్రాయాలను సైతం సేకరించింది. తదుపరి ప్రయివేట్ కళాశాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచి డీఎడ్‌లో సెమిస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ పరీక్షల నియంత్రణ మండలికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. సెమిస్టర్ విధానంలో జరగనున్న థియరీ, ప్రాక్టికల్స్ నిర్వహణకు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను నిర్ణయించనుంది.
ఉత్తమ నిర్ణయం..
పరీక్ష విధానంలో మార్పులు తీసుకువస్తే విద్యార్థుల్లో ఒత్తిడి ఉండదు. దీంతో పాటు రికార్డులు, రిజిస్ట్రర్లు కూడా సక్రమంగా చేస్తారు. గుణాత్మక విలువలు పెరుగుతాయి. పాఠశాలలో బోధనలో నాణ్యత కూడా పెరిగే అవకాశముంటుంది. డిగ్రీ కళాశాలల్లో కూడా సెమిస్టర్ విధానం ఇప్పటికే అమలు చేశారు. కొన్ని కారణాలతో రెండేళ్ల డీఎడ్ కోర్సు పూర్తి చేసే సరికి మూడేళ్లు పడుతోంది. సెమిస్టర్ విధానం అమలైతే కచ్చితంగా రెండేళ్లలో కోర్సు పూర్తి అవుతుంది. తదుపరి కోర్సు చేసేందుకు వారికి అవకాశం కూడా ఉంటుంది. – చంద్రయ్య, ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, రాయచోటి
నాణ్యత పెరుగుతుంది..
సెమిస్టర్ విధానంలో విద్యలో నాణ్యత పెరుగుతుంది. తద్వారా తదుపరి వారు ఉపాధ్యాయులైన తరువాత ఉత్తమ పద్ధతుల్లో బోధించగలరు. ప్రభుత్వం నాణ్యత పెరిగే విధంగా, అక్రమాలకు చెక్ పెట్టే చర్యలు చేపట్టడం మంచి విషయం. డీఎడ్ కళాశాలలు నాణ్యంగా ఉన్నప్పుడే పాఠశాలలు నాణ్యంగా ఉంటాయి.
– కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
అక్రమాలకు అడ్డు వేయాల్సిందే..
డీఎడ్ కళాశాలల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిందే. చాలా కళాశాలల్లో విద్యార్థులు సరిగా హాజరు కాకున్నా ఫీజు రీఎంబర్స్‌మెంట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బయోమెట్రిక్ హాజరు అమలైతే వీటికి అడ్డుకట్ట పడుతుంది.
– మనోహార్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment