బయోమెట్రిక్ హాజరు సాధ్యమేనా?
► ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు యోచన
► ముందుకురాని కళాశాలల యాజమాన్యాలు
► ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. దీనికి ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేటు యూజమాన్యాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. సరైన హాజరు లేకుండా కొన్ని కళాశాలలు రీయింబర్స్‌మెంట్ పొందడాన్ని కూడా నూతన విధానం ద్వారా నివారించవచ్చని విద్యామండలి భావిస్తోంది. అయితే, ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకతల మధ్య ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు సాధ్యపడుతుందో లేదో వేచి చూడాలి.
ఎచ్చెర్ల: ఈ విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు తప్పని సరిగా అమలు చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తుంది. రాష్ట్రంలో 14 యూనివర్సిటీల వైస్‌చాన్సలర్లు, రిజిస్ట్రార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సుమితా దావ్రా తప్పని సరిగా బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని ఆదేశించారు. రెండు విధాలుగా బయోమెట్రిక్ హాజరు వల్ల ప్రయోజనం చేకూరుతుందని విద్యాశాఖ భావిస్తుంది.
మొదటిది హాజరుశాతం పెరుగుదల, రెండోది హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు మంజూరు. విద్యార్థులు కనీసం 70 శాతం హాజరయితేనే రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. ప్రస్తుతం కొన్ని కళాశాలల నిర్వహణ చూస్తే బయోమెట్రిక్ హాజరు ఖచ్చితంగా అమలు చేస్తే మూత పడే పరిస్థితులు సైతం కనిపిస్తున్నాయి. జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 15 విభాగాలు ఉండగా, ఎఫిలియేషన్‌లో 12 ప్రభుత్వ, 88 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, 18 బీఎడ్ కళాశాలలు, 11 పీజీ కళాశాలు, ఒక న్యాయ కళాశాల ఉన్నాయి. జిల్లాలో మరో పక్క జేఎన్‌టీయూ ఏఫిలియేషన్‌లో ఎనిమిది ఇంజినీరింగ్, రెండు ఫార్మశీ, ఎనిమిది ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి.
హాజరుకే కొనసాగుతున్న విభాగాలు
వర్సిటీలో పరిస్థితి చూస్తే కొన్ని విభాగాల్లో కనీసం తరగతులు నిర్వహించకుండా హాజరు మాత్రమే వేస్తున్నారు. లేదంటే ఈ కోర్సులు ఎత్తివేయవలసిందే. మరో పక్క ఏఫిలియేషన్ పరిధిలో ఉన్న న్యాయకళాశాల, బీఎడ్ కళాశాలల్లో తరగతులు కనీసం కూడా నిర్వహించడం లేదు. దూర విద్యకంటే దారుణంగా కొన్ని కళాశాలల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. హాజరుకు సైత ం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరో పక్క రీయింబర్స్‌మెంట్ సైతం క్లెరుుమ్ చేస్తున్నారు.
వెనుకడుగు వేస్తున్న కళాశాలలు
జిల్లాలో ఎంటెక్, ఎంఫార్మశీ వంటి కోర్సులకు తరగతులు నిర్వహించకుండానే కొనసాగిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ కొందరు పీజీ కోర్సులు చదివేస్తున్నారు. విద్యార్థులు పరీక్షలకు వస్తే చాలు అన్నట్టు కొన్ని కళాశాలల్లో ఎంబీఏ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బయోమెట్రిక్ పక్కాగా జిల్లాలో అమలు చేస్తే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 50 శాతం కూడా ఉండకపోవచ్చు. అందుకే ప్రైవేట్ కళాశాలలు బయోమెట్రిక్ అమలుకు వెనుకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీతో సహా ఫ్యాకల్టీ సభ్యులకు బయోమెట్రిక్‌ను చాలా కళాశాలు అమలు చేస్తున్నాయి. విద్యార్థుల విషయంలో అమలు చేయడంలో మాత్రం ముందుకు రావడం లేదు.
మరో పక్క ఉన్నత విద్యా మండలి రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా తగ్గించుకునే పనిలో ఉంది. ఈ మేరకు కళాశాలలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం అవుతుంది. జిల్లాలో ఇప్పటికే రెండు ఇంజినీరింగ్ కళాశాలలు మాతపడ్డాయి. మరో కళాశాల మూతపడే పరిస్థితిలో ఉంది. బయోమెట్రిక్ అమలు చేస్తే భవిష్యత్తులో కళాశాలల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో బయోమెట్రిక్ పద్ధతిని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. భవిష్యత్తులో బయోమెట్రిక్ హాజరు ఏమేరకు అమలవుతుందో వేచి చూడవల్సిందే.
క్లాస్ వర్క్ పక్కాగా ఉంటుంది
బయోమెట్రిక్ హాజరు వల్ల క్లాస్ వర్క్ పక్కాగా ఉంటుంది. కోర్సుపై ఆసక్తి ఉన్నవారు మాత్రమే చేరుతారు. విద్యార్థుల్లో హాజరు శాతం లేకుండా తరగతులకు అనుమతించటం వల్ల ప్రయోజనం ఉండదు. హాజరు శాతం పెరగాలంటే తప్పకుండా బయోమెట్రిక్ అమలు అవసరం. - ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, ఇన్‌చార్జి వైస్ చాన్సలర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ
ఉత్తీర్ణతా శాతం మెరుగుపడుతుంది
బయోమెట్రిక్ హాజరు వల్ల విద్యార్థులు తరగతులకు పక్కాగా హాజరవుతారు. విద్యార్థులు తరగతికి వెళ్లడం, పాఠాలు వినడం తప్పనిసరి. దీంతో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఉత్తీర్ణత శాతం మెరుగుపడుతుంది. ప్రారంభంలో అమల్లో కష్టంగా ఉన్నా భవిష్యత్‌లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. - ప్రొఫెసర్ గుంట తులసీరావు, రిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ