నవరణ దారుణం ‘వడ్డి’ంపు! | AP farmers to protest delay in loan waiver scheme by TDP | Sakshi
Sakshi News home page

నవరణ దారుణం ‘వడ్డి’ంపు!

Published Fri, Sep 12 2014 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

నవరణ దారుణం ‘వడ్డి’ంపు! - Sakshi

నవరణ దారుణం ‘వడ్డి’ంపు!

శ్రీకాకుళం అగ్రికల్చర్: రుణమాఫీ రైతులకు కష్టాలను తెచ్చి పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న విధానంతో జిల్లా రైతులపై రూ. 2.23 కోట్లుకు పైబడి వడ్డీ భారం పడుతోంది. దీన్ని వెంటనే చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి పెంచుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమైతే మరింత వడ్డీ పడుతుందని హెచ్చరిస్తుండడంతో ఏమి చేయూలో తెలియక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. ప్రతి కుటుంబానికి వడ్డీతో కలిసి రూ. 1.50 లక్షల వరకు మాఫీ చేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా 2013 డిసెంబర్ 31వ తేదీలోపు తీసుకున్న రుణాలకే మాఫీ వర్తింపజేస్తూ అంతవరకు అయిన వడ్డీని అందులోకి చేర్చింది. జనవరి నుంచి ఇప్పటి వరకు అయిన వడ్డీని రైతులే భరించే విధంగా గతంలో జారీ చేసిన జీవోను ప్రభుత్వం సవరించింది. దీంతో 2013 డిసెంబర్ లోపు రుణాలు తీసుకున్న రైతులు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వడ్డీ మొత్తాన్ని భరించాల్సి ఉంది. దీన్ని వసూలు చేసేందుకు బ్యాంకర్లు రంగంలోకి దిగారు.
 
 రోజుకో మాట.. రైతులతో ఆట!
 రైతులెవ్వరూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించవద్దు.. నేను అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటినీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీపై రోజుకో మాట మాట్లాడుతూ రైతులతో ఆట్లాడుకుంటున్నారు. మామూలుగా అయితే 2014 మార్చి 31వ తేదీలోపు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీలోకి చేర్చాలి. తెలంగాణ ప్రభుత్వం ఇదేవిధంగా చేసింది. మన రాష్ట్రంలో మాత్రం2013 డిసెంబర్ 31లోపు తీసుకున్న రుణాలను మాత్రమే అప్పటి వరకు అయిన వడ్డీతో కలిపి కుటుంబానికి రూ. 1.50 లక్షలు మాఫీ చేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 మాఫీకి లక్ష మంది దూరం!
 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శ్రీకాకుళం జిల్లాలో సుమారు లక్షమంది వరకు రుణ మాఫీని పొందలేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రుణమాఫీ వర్తించే రైతులపై జనవరి నుంచి ఇప్పటి వరకు వడ్డీ భారాన్ని మోపుతోంది. వాయిదా తేదీ వరకు 7 శాతం.. వాయిదా తేదీ దాటిన తరువాత 11.75 శాతం వడ్డీని రైతులు చెల్లించాల్సి ఉంది. 2013 డిసెంబర్ 31వ తేదీలోగా తీసుకున్న రుణాలు రూ. 1900 కోట్లు ఉన్నారుు. వీటికి జనవరి నుంచి అయిన వడ్డీని రైతులే చెల్లించాలని ప్రభుత్వం మెలిక పెట్టడంతో వడ్డీ భారం రూ. రెండు కోట్లకు పైగా రైతులపై పడనుంది.
 
 రైతులకు నోటీసులు
 వడ్డీని వసూలు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయా బ్యాంకులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. వారం పది రోజుల్లో బ్యాం కర్లు వడ్డీ వసూలు కోసం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం వడ్డీ భారాన్ని రైతులపైనే మోపడంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మార్చడంపై రైతులు మండి పడుతున్నారు. ప్రతి రైతుపై సగటున రూ. 6 నుంచి రూ. 8 వేలు వరకు భారం పడుతోంది.
 
 రైతు ఉసురు తగులుతుంది
 రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి ఉసురు తగులుతుంది. గతేడాదిలో పంట రుణం తీసుకున్నాను. ఇది మాఫీ అవుతుందో లేదో చెప్పడం లేదు. ప్రస్తుతం గతేడాది డిసెంబర్ 31లోపు రుణాలకు వడ్డీ చెల్లిస్తేనే ఆ రుణం మాఫీ అవుతుందని చెబుతున్నారు.
 - మొదలవలస రాములు, రైతు, వాకలవలస
 
 రైతులను మభ్య పెడుతోంది
 రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం మెలిక పెట్టి మభ్య పెడుతోంది. గతేడాది పంట రుణం తీసుకున్నాను. ఆ రుణం కట్టాలో లేదో తేల్చడం లేదు.
 - చిట్టి రవికుమార్, రైతు, లంకాం
 
 రైతులను బాధ పెట్టడం సరికాదు
 గతేడాది ఖరీఫ్ సీజన్‌లో పంట రుణం తీసుకున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక రుణం మాఫీ అవుతుందని ఆశించాను. సీఎం చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారు. వడ్డీ చెల్లించాలని రైతులను బాధ పెట్టడం సరికాదు.
 - అల్లు కేశవరావు, రైతు, చాపురం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement