ముప్పుతిప్పల మాఫీ | Chandrababu Naidu Cheating On Farmers Loan Waiver | Sakshi
Sakshi News home page

ముప్పుతిప్పల మాఫీ

Published Tue, Dec 9 2014 1:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Chandrababu Naidu Cheating   On Farmers Loan Waiver

 ‘ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు నెంబరు, రుణం వివరాలతో అర్హుల జాబితాలు ఆన్‌లైన్‌లో పెట్టాం. బ్యాంకులకు పంపాం. అక్కడినుంచి రైతులు ఆ వివరాలు తెలుసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా.. ఇదేం ఆషామాషీ కాదు. మేమే పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోతున్నాం.. ఇక రైతుల కెలా సాధ్యం?’....రుణమాఫీ జాబితాలపై ఓ బ్యాంకు మేనేజర్ వ్యాఖ్య
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:పంట రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం సృష్టిస్తున్న గందరగోళానికి ఈ వ్యాఖ్యల కంటే నిదర్శనం ఏం కావాలి. తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి.. అన్నట్లు జాబితాలను ఆన్‌లైన్‌లో పెట్టాం. వాటి ప్రకారం రుణాలు మాఫీ అయిపోతాయని ప్రభుత్వం తేలిగ్గా చెప్పేసినా.. వెబ్‌సైట్ ఓపెన్ కాక, చాంతాడంత జాబితాల ప్రింట్లు తీయలేక అటు బ్యాంకులు, ఇటు రైతులు సోమవారం రోజంతా తంటాలు పడ్డారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత తీరిగ్గా రూ.50 వేల లోపు రుణం తీసుకున్న వారికే ప్రస్తుతానికి మాఫీ వర్తింపజేస్తామని రైతులను ఆందోళనకు గురి చేసిన ప్రభుత్వం అర్హుల జాబితాలను ఆన్‌లైన్‌లో పెట్టామంటూ మరో గందరగోళానికి తెర తీసింది. ఆదివారం రాత్రి ఆన్‌లైన్‌లో పెట్టినా, సోమవారం రాత్రి వరకు రైతులకు జాబితాల్లోని వివరాలు తెలియలేదు. బ్యాంకర్లు కూడా వెబ్‌సైట్ ఓపెన్ కాక దానితో కుస్తీలు పడుతున్నారు.  
 
 ఇదీ పరిస్థితి
 జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 250 శాఖలున్నాయి. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో రైతులు వివరాల కోసం సోమవారం బ్యాంకుల చుట్టూ తిరిగినా సహకార, ఆంధ్రా బ్యాంకుల్లో మాత్రమే అధికారులు స్పందించారు. అయితే రూ.50 వేలు, రూ. ఒక లక్ష, రూ.1.5 లక్షల వివరాలన్నీ ఒకే జాబితాలో పొందుపర్చడం మరింత గందరగోళం సృష్టించింది. దాంతో పూర్తిస్థాయి మాఫీకి రూ.50 వేలలోపు రుణం తీసుకున్న అర్హులైన రైతులు ఎందరున్నారన్నది చెప్పలేని పరిస్థితి నెలకొంది. కనీసం ప్రభుత్వం ప్రకటించిన గడువు తేదీ అయిన ఈనెల 10 నాటికి ఎంత మొత్తం ప్రభుత్వం నుంచి బ్యాంకులకు విడుదలవుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని అధికారులే చెబుతున్నారు. అర్హుల వివరాలు చెప్పాలంటే కనీసం రెండు రోజులు పడుతుందని అధికారులు చెప్పడంతో రైతులు ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చింది. వాస్తవానికి జిల్లాలో రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతుల్లో చాలామంది వడ్డీ బాధ భరించలేక, బ్యాంకర్ల ఒత్తిళ్లతో రుణం చెల్లించేశారు. వీరికి తిరిగి ప్రభుత్వం డబ్బులిస్తుందో లేదో తెలియదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
 
 ఓపెన్ కాని వెబ్‌సైట్లు
 కాగా సాంకేతిక సమస్యలతో జిల్లావ్యాప్తంగా రుణమాఫీ జాబితాలు ఉంచిన వెబ్‌సట్లు తెరుచుకోవడంలేదు. ఆదివారం రాత్రే కొందరు బ్యాంకర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. సోమవారం అధికారులతో గ్రీవెన్స్ ఉండడంతో బిజీ అయిపోయారు. మధ్యాహ్న సమయంలో ప్రయత్నించి చూస్తే కొన్నిచోట్ల మాత్రమే తెరుచుకున్నాయి. అన్ని వివరాలతో కూడిన జాబితాలు కనీసం రెండొందల పేజీలు ఉన్నాయి. ఇందులో కూడా పూర్తిస్థాయి వివరాలు లేవు. కొంతమంది అర్హులు కూడా అనర్హులైపోయారు. వీరి భవిష్యత్ ఏంటన్నది అర్థం కావడం లేదు. ఈ తరహా రైతులు మళ్లీ బ్యాంకు, జన్మభూమి కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందేనంటున్నారు. సోమవారం సాయంత్రానికి కూడా బ్యాంకర్లు స్పష్టత ఇవ్వలేకపోయారు. ‘డేటా అంతా కలిపి పెట్టడంతో దాన్ని షార్టింగ్ చేసుకోవాల్సి వస్తోంది, ఆ వివరాలు బ్రాంచ్‌ల్లోనే ఉంటాయి, రైతులకు తెలియదు.
 
 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సహా 200 పేజీల సమాచారం బయటకు రావాలన్నా, గ్రామాల్లో ప్రదర్శించాలన్నా కష్టమే, లీడ్ బ్యాంకుకు కూడా మేం ఫోన్లు చేసి ఇదే విషయం చెబుతున్నాం’అని ఓ బ్యాంకు మేనేజర్ చెప్పారు. ‘ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, రుణం వివరాలు, రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా రైతే ఆన్‌లైన్లో వివరాలు చూసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా ఇది ఆషామాషీ విషయం కాదని, మేమే పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోతున్నాం ఇక రైతులా?’.. అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోమవారం కూడా చాలాచోట్ల వెబ్‌సైట్లు ఓపెన్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. కొన్నిచోట్ల రైతు వివరాలుంటే ఖాతా వివరాల్లేవ్, మరికొన్ని చోట్ల నిబంధ నల కారణంగా రకరకాల మొత్తాల్ని చూపించడం కూడా జరిగిందని, పీడీఎఫ్ ఫార్మట్‌లో వివరాలుండడం మరో ఇబ్బందిగా మారిందని, తమ వద్ద ఉన్న వివరాలను రీజినల్ కార్యాలయాలకు పంపించిన తరువాత మాత్రమే మాఫీ వర్తింపు ఉంటుందని కూడా చెప్పారు. ఇంత జరిగినా పూర్తిస్థాయిలో అర్హులకు మాఫీ వర్తింపు కష్టమేనన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement