
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును షిఫ్టుల వారీగా వేయాలని వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా ఆస్పత్రులూ, సంస్థల బాధ్యులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కొద్ది నెలలుగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే 24/7 పనిచేసే ఆస్పత్రుల్లో ఉద్యోగుల హాజరు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది.
ఈ నేపథ్యంలో వాటిలో ఆస్పత్రులు, ఇతర సంస్థల్లో బయోమెట్రిక్ హాజరు 3 షిఫ్ట్‌ల ప్రకారం సవరించి, డ్యూటీ రోస్టర్‌ను సంబంధిత హెల్త్ కేర్ ఫెసిలిటీ హెడ్ సిద్ధం చేయాలని సూచించారు. అలర్ట్ మెకానిజం కూడా అభివృద్ధి చేసి సంబంధిత ఉద్యోగులకు ఆబ్సెంట్ మెసేజ్‌లను ఎప్పటికప్పుడు ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్ ద్వారా పంపనున్నారు. వచ్చే ఆగస్టు నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు జమ చేయాలని ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment