వేలిముద్ర పడితేనే ‘హాజరు’ | Biometric attendance is mandatory in welfare housing | Sakshi
Sakshi News home page

వేలిముద్ర పడితేనే ‘హాజరు’

Published Mon, Dec 31 2018 2:02 AM | Last Updated on Mon, Dec 31 2018 2:02 AM

Biometric attendance is mandatory in welfare housing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి కానుంది. వేలిముద్రలతో హాజరు స్వీకరణ ఇదివరకు అమలు చేసినప్పటికీ అందులో ఆధార్‌ ఎనేబుల్డ్‌ బయోమెట్రిక్‌ విధానం లేదు. పిల్లల వేలిముద్రలు నమోదు చేసిన తర్వాత వాటి ఆధారంగా రోజువారీ హాజరును తీసుకునేవారు. కానీ ఈ ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల చాలాచోట్ల నిలిచిపోయింది. దీంతో మాన్యువల్‌ పద్ధతినే కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రతి వసతి గృహంలో బయోమెట్రిక్‌ హాజరు పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక సహకారాన్ని టీఎస్‌టీఎస్‌ (తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌)కు అప్పగించింది. ఈక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రయోగాత్మకంగా బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్‌ మిషన్లు ఏర్పాటు చేయించింది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సాయంతో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 697 హాస్టళ్లున్నాయి. ఇందులో 257 పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లు కాగా, 440 ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు. కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ప్రీమెట్రిక్‌ హాస్టళ్లలో ఏర్పాటు చేసింది. మిషన్ల ఇన్‌స్టలేషన్‌ పూర్తి చేసిన యంత్రాంగం రోజువారీ హాజరు తీరును పరిశీలిస్తోంది.  

కమిషనరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ 
వసతి గృహాల్లో హాజరు తీరును పరిశీలించేందుకు బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. రోజువారీ హాజరు ఎలా ఉందో ఇక్కడ్నుంచి పర్యవేక్షిస్తారు. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆధార్‌ ఎనేబుల్డ్‌ బయోమెట్రిక్‌ విధానం కావడంతో ప్రతి విద్యార్థి ఆధార్‌ సంఖ్యతో వేలిముద్రలు అనుసంధానమవుతాయి. విద్యార్థులు తమ వేలి ముద్రను మిషన్‌లో నమోదు చేసిన వెంటనే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. వెనువెంటనే హాజరు నమోదవుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా హాజరు నమోదు చేయాలి. వాటి ఆధారంగా మెస్‌ చార్జీలు ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

అన్ని సంక్షేమ హాస్టళ్లలో
ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పద్ధతిని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. గతంలో ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని కొన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్‌ మిషన్లు ఏర్పాటు చేసినప్పటికీ సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కొత్త మిషన్లతో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. 2019– 20 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్‌ హాజరును పక్కాగా అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement