Welfare Accommodation Homes
-
వేలిముద్ర పడితేనే ‘హాజరు’
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుంది. వేలిముద్రలతో హాజరు స్వీకరణ ఇదివరకు అమలు చేసినప్పటికీ అందులో ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ విధానం లేదు. పిల్లల వేలిముద్రలు నమోదు చేసిన తర్వాత వాటి ఆధారంగా రోజువారీ హాజరును తీసుకునేవారు. కానీ ఈ ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల చాలాచోట్ల నిలిచిపోయింది. దీంతో మాన్యువల్ పద్ధతినే కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రతి వసతి గృహంలో బయోమెట్రిక్ హాజరు పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక సహకారాన్ని టీఎస్టీఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్)కు అప్పగించింది. ఈక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రయోగాత్మకంగా బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయించింది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ సాయంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 697 హాస్టళ్లున్నాయి. ఇందులో 257 పోస్టుమెట్రిక్ హాస్టళ్లు కాగా, 440 ప్రీమెట్రిక్ హాస్టళ్లు. కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఏర్పాటు చేసింది. మిషన్ల ఇన్స్టలేషన్ పూర్తి చేసిన యంత్రాంగం రోజువారీ హాజరు తీరును పరిశీలిస్తోంది. కమిషనరేట్‌లో కమాండ్ కంట్రోల్ వసతి గృహాల్లో హాజరు తీరును పరిశీలించేందుకు బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. రోజువారీ హాజరు ఎలా ఉందో ఇక్కడ్నుంచి పర్యవేక్షిస్తారు. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ విధానం కావడంతో ప్రతి విద్యార్థి ఆధార్ సంఖ్యతో వేలిముద్రలు అనుసంధానమవుతాయి. విద్యార్థులు తమ వేలి ముద్రను మిషన్‌లో నమోదు చేసిన వెంటనే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. వెనువెంటనే హాజరు నమోదవుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా హాజరు నమోదు చేయాలి. వాటి ఆధారంగా మెస్ చార్జీలు ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పద్ధతిని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. గతంలో ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని కొన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసినప్పటికీ సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కొత్త మిషన్లతో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. 2019– 20 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరును పక్కాగా అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
‘నిఘా’.. పక్కా..
సాక్షి, నేలకొండపల్లి: విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు.. పిల్లల కదలికలను నిరంతరం తెలుసుకునేందుకు.. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని హాస్టల్లో జరిగిన బాలుడి హత్య ఉదంతంతో రాష్ట్ర యంత్రాంగం కదిలింది. సంక్షేమ వసతి గృహాల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని వసతి గృహాల్లో ఏర్పాటు చేయగా.. మిగిలిన వాటిలోఅమర్చే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలో మొత్తం 77 ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. అందులో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 50 కాగా.. 27 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వాటన్నింట్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సీసీ కెమెరాల ద్వారా విద్యార్థుల రోజువారీ దైనందిన పరిస్థితులను తెలుసుకోవడమే కాకుండా వారు అనుసరిస్తున్న పద్ధతులు, అధికారులను మానిటరింగ్ చేసే అవకాశం ఉండడంతో వార్డెన్లపై మరింత బాధ్యత పెరగనుంది. హాస్టల్‌కు ఆరు చొప్పున.. జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 50 ఉండగా.. ఇప్పటికే 28 వసతి గృహాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా బీసీ వసతి గృహాలు మెట్రిక్ 20, పోస్టు మెట్రిక్ 7 ఉండగా.. వాటిల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వసతి గృహానికి 6 చొప్పున అమరుస్తున్నారు. విద్యార్థులతోపాటు వార్డెన్లు, అధికారుల పనితీరును రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా అల్పాహారం, ట్యూషన్, రాత్రి భోజనం, చదువు, నడవడిక, ఆట, పాటలు, విద్యార్థుల మధ్య మనస్పర్థలను సీసీల ద్వారా ఉన్నతాధికారులు నేరుగా మానిటరింగ్ చేయనున్నారు. అలాగే వార్డెన్లు సకాలంలో హాజరువుతున్నారా.. లేదా.. విద్యార్థులతో ఎలా ఉంటున్నారు. వసతి గృహాల్లో ఉన్నారా.. లేదా.. అనే అంశాలను పరిశీలించనున్నారు. దీనికితోడు హాస్టళ్లలో జిల్లా అధికారులు తనిఖీలు చేస్తున్నారా.. లేదా.. అనే విషయాలను ఉన్నతాధికారులు నేరుగా సీసీ కెమెరాల ద్వారా తెలుసుకోనున్నారు. -
ఇంత దారుణమా!
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులను చూసి విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు.మెనూ సక్రమంగా పాటించకపోవడం..నాసిరకం భోజనం.. దుస్థితిలో వంట గదులు.. అధ్వానంగా మరుగుదొడ్లు.. నీటి సమస్యతో విద్యార్థుల అవస్థలు.. హాజరు పట్టిలో మాయాజాలం.. బయోమెట్రిక్ మెషిన్లు మూలన పెట్టేసి విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించడంపై తనిఖీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించాల్సిన ఆర్వో మెషిన్లు మూలన పడ్డాయి. అద్దె భవనాలు.. ఇరుకు గదుల్లో చదువులపై గురువారం తెల్లవారు జాము నుంచి విజిలెన్స్ అధికారులు ఎనిమిది హాస్టళ్లను తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులు పడుతున్న అవస్థలను కళ్లారా చూసి నిర్వాహకులపైఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు సైతంలేవని తనిఖీ బృందం గుర్తించింది. నెల్లూరు రూరల్: జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో సౌకర్యాలపై గురువారం తెల్లవారుజాము నుంచే విజిలెన్స్ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి బాలాయపల్లి, వెంకటగిరి, చిట్టేడు, మర్రిపాడు, కంపసముద్రం, చిట్టమూరు, వింజమూరు, సిద్ధనకొండూరు ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లల్లో తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాల్లో వసతులు, నిత్యావసర సరుకుల కొనుగోలు, వస్తువుల వినియోగం, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య ఇలా అన్నింటిని తనిఖీలు చేశారు. రికార్డుల ప్రకారం నమోదు చేసుకున్న వివరాలు కూడా పరిశీలించారు. ప్రస్తుతం హాస్టళ్లల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టికలోని విద్యార్థుల సంఖ్యకు వ్యత్యాసం ఉన్నట్లుగుర్తించారు. బయోమెట్రిక్ మెషిన్లు వినియోగించకుండా ఎక్కువ మంది విద్యార్థులను చూపిస్తూ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తేల్చారు. హాస్టల్ వార్డెన్లు నాసిరకం వస్తువులు వినియోగించి విద్యార్థులకు భోజనం పెడుతూ నిధులు స్వాహా చేసినట్లు గుర్తించారు. హాస్టల్లో నిల్వ చేసిన వేరుశనగ విత్తనాలు, పప్పు దినుసులు పుచ్చిపోయి పురుగులు కనిపిస్తున్నా.. వాటితో చట్నీ చేసి విద్యార్థులకు వడ్డించినట్లు తేల్చారు. కూరగాయలు వాడిపోయి ఉన్నవి. ఇక అన్ని వంటల్లో వినియోగించే ఉప్పు, నూనెలు కాలం తీరినవే ఉన్నాయి. అన్నం పూర్తిగా ముద్దగా మారడమే కాకుండా ఉంటలు కట్టి ఉంది. ఉదయం టిఫిన్‌గా గోధుమ రవ్వతో ఉప్మా చేయాల్సి ఉండగా పులి హోరాతో సరిపెట్టారు. కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వనే లేదు. అన్ని చోట్లా నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయం వెలుగు చూసింది. తాగునీరు..పారిశుద్ధ్యం అధ్వానం హాస్టల్లో తాగునీటిని బయట నుంచి కొనుగోలు చేస్తుండగా, మరుగుదొడ్లు, బాత్రూమ్లు చాలా దారుణంగా ఉన్నాయి. వాటిలో ఒకదానికి కూడా సరిగా తలుపులు సరిగా లేవు. వీటిని శుభ్రం చేసేవారు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాల్సి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హాస్టళ్ల పరిస్థితి, స్వచ్ఛమైన నీరు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో మిషన్లు పనిచేయడం లేదని దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు. సౌకర్యాలు, అధికారుల పనితీరుపై ఓ నివేదికను ప్రభుత్వానికి పంపి, బాధ్యులపై చర్యలకు సిఫారస్సు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. జిల్లా అంతటా ఇంతే! పేద విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో 73 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. నేటికి అద్దె భవనాల్లో చాలీచాలని గదుల్లో చదువుతూ కాలం వెల్లదీస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదలలో జాప్యం వల్ల హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ♦ సిద్ధనకొండూరులోని వసతిగృహానికి ప్రహరీ లేదు. నీటి సమస్య తీవ్రంగా ఉంది. వసతిగృహం భవనాలు ఉరుస్తున్నాయి. ♦ కోట బాలికల వసతి గృహంలో నీటి వసతి సరిగాలేదు. మరుగుదొడ్లకు తలుపుల్లేవు. వార్డెన్‌కు మందలింపు, సిబ్బందిపై ఆగ్రహం. ♦ వెంకటగిరిలో అధ్వానంగా వంట గది, పని చేయని ఆర్వో మెషిన్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదు. బాత్రూమ్లు సరిపడా లేవు. -
సంక్షేమంలో తనిఖీల కలవరం!
ఒంగోలు టూటౌన్: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీల కలవరం పట్టుకుంది. ఇటీవల విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేసి జిల్లా వ్యాప్తంగా కలవరం కలిగించగా.. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఊహించని విధంగా మార్కాపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల ఒక న్యాయమూర్తి సైతం పశ్చిమ ప్రాంతంలోని బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఆగస్టు నెల ప్రారంభంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉమాదేవి ఒంగోలు నగరంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహన్ని తనిఖీ చేశారు. తాజాగా గురువారం విజిలెన్స్ డీఎస్పీ రజనీకుమారి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇలా వరుస తనిఖీలతో అటు వసతి గృహాల సంక్షేమాధికారులతో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 79 సంక్షేమ వసతి గృహాలు నడుస్తున్నాయి. మొత్తం 8,100 మంది మంజూరు సంఖ్యకుగాను 8,067 మందికి అవకాశం కల్పించారు. వీటిలో 62 వసతి గృహాల్లో బాలురు, 17 వసతి గృహాల్లో బాలికలు ఉండి విద్యనభ్యసిస్తున్నారు. బీసీ వసతి గృహాలు 77 ఉండగా వీటిలో 58 బాలురకు, 18 బాలికలకు కేటాయించారు. మొత్తం దాదాపు 6,749 మంది వరకు విద్యార్థులు ఈ వసతి గృహాలో ఉండి చదువుకుంటున్నారు. కళాశాల వసతి గృహాలు మరో 24 వరకు ఉన్నాయి. వీటిలో 12 బాలురకు, 12 బాలికల కోసం నడుపుతున్నారు. దాదాపు 18 63 మంది విద్యార్థులు ఉన్నారు. 77 వసతి గృహాల్లో 44 వసతి గృహాలు ప్రభుత్వ భవనాలు కలిగి ఉండగా, మిగిలిన వసతి గృహలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమశాఖ ద్వారా 14 రెసిడెన్సియల్ పాఠశాలలు, 3 గిరిజన వసతి గృహాలు, 3 కళాశాల వసతి గృహాలు, 17 ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో 4,778 మంది విద్యార్థులు ఉన్నారు. తనిఖీలతో వెలుగులోకి వస్తున్న సమస్యలు.. నిఘా సంస్థలు వసతి గృహాలపై ఆకస్మిక తనిఖీలు చేస్తుండటంతో పేద పిల్లల పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్క హాస్టలో విద్యార్థులు అనుభవిస్తున్న కష్టాలు విని చలించిపోతున్నారు. గత నెలలో జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలపై పలుచోట్ల ఏకకాలంలో దాడులు చేయడంతో అనేక సమస్యలు వెలుగు చూశాయి. ఒంగోలులోని సాంఘిక సంక్షేమ శాఖ ఆనంద నిలయంలో విద్యార్థిను బాధలు అన్నీ, ఇన్నీ కావు, ఇచ్చిన మెను సక్రమంగా అమలు కావడం లేదు. సరిపడా బాత్రూమ్లు లేవు, ఇరుకు గదుల్లో తీవ్ర అగచాట్లు పడుతుండటం చూసిన తనిఖీ అధికారులు గుండె చెరువైయింది. అదే విధంగా శింగరాయకొండ బాలుర వసతి గృహం, అద్దంకి ఇలా పలు హాస్లళ్లలో పిల్లలు పడుతున్న బాధలు, కష్టాలు కళ్లకు కట్టినట్లు అధికారులకు కనపడ్డాయి. చాలా వసతి గృహాల్లో ఇప్పటికి నీటి వసతి లేని పరిస్థితి నెలకొంది. పశ్చిమ ప్రాంతంలో ఇటీవల ఒక న్యాయమూర్తి ఆకస్మికంగా ప్రభుత్వ బాలికల వసతి గృహన్ని తనిఖీ చేయడం, విద్యార్థినులు పడుతున్న అవస్థలు చూడటం, సంక్షేమ అధికారిణి పిల్లలను అవమాన కరంగా మాట్లాడుతుందో పిల్లల నోట విని విస్తుపోవాల్సి వచ్చింది. సరుకు నిల్వల్లోనూ వ్యత్యాసం.. అదే విధంగా మంగళవారం జిల్లాలోని మార్కాపురంలోని సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహంలో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేయడంతో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. రిజిస్టర్లో నమోదు చేసిన సంఖ్యకు వాస్తవంగా ఉన్న విద్యార్థుల సంఖ్యకు తేడా ఉన్నట్లు గుర్తించారు. నిత్యవసర వస్తువుల నిల్వలోనూ తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఎక్కడ అమలు కాని పరిస్థితి నెలకొంది. అదే విధంగా వలేటివారిపాలెంలోని ఎస్సీ వసతి గృహంలోనూ తనిఖీలు జరిగాయి. మరుగుదొడ్లు, నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. గత విజిలెన్స్ తనిఖీల సమయంలోనూ, ఇప్పుడు ఏసీబీ తనిఖీల సమయంలో చాలా భవనాలు మరమ్మతులకు గురై కనిపించాయి. స్థానికంగా నివాసం ఉండని వార్డెన్లు.. రెండు నెలల క్రితం వసతి గృహాల్లో మెను సక్రమంగా అమలు కావడం లేదని నివేదికలు అందుకున్న కలెక్టర్ ఒకరిద్దరు వార్డెన్లను సస్పెండ్ చేశారు. ప్రతిరోజు ఆయా సంక్షేమ శాఖల అధికారులు హాస్టళ్లను తనిఖీలు చేస్తున్నా.. ఎక్కడా మార్పు కనిపించడం లేదు. కొంతమంది వార్డెన్లు స్థానికంగా ఉండకుండా చుట్టపు చూపుగా వెళ్లొస్తున్నారు. పిల్లలను వంట, వాచ్మెన్, సిబ్బందికి వదిలేసి వస్తున్నారు. ఇటీవల సాక్షి బృందం కూడా జిల్లాలోని పలు సంక్షేమ వసతి గృహాలను విస్తృతంగా పరిశీలించింది. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అయినా నేటికి విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతలో కొంతైనా నిఘా సంస్థలు తనిఖీలతో ఆయా సంక్షేమ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ వసతి గృహం తనిఖీ చేస్తారోనని భయం మాత్రం అందని వార్డెన్లలో నెలకొంది. పాలకుల నిర్లక్ష్యంలో హాస్టళ్లు.. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు దశాబ్దాలుగా విద్యార్థును వెంటాడుతూనే ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. ఏటా మరమ్మతుల పేరుతో తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకోవడం పాలకులకు పరిపాటయింది. చాలా చోట్ల సొంత భవనాలు లేక అద్దె భవనాలలో ఏళ్ల తరబడి కొనసాగించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు తక్కువగా ఉన్నారన్నా కారణం చూపి వసతి గృహాలను మూసివేశారు. ఆయా వసతి గృహాలు ఇప్పటికి చిల్లచెట్లలో నిరూపయోగంగా పడి ఉన్నాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాను అందించాలన్న లక్ష్యం ఏ కోశానా ప్రభుత్వంలో కనిపించని పరిస్థితి నెలకొంది. సంక్షేమ వసతి గృహలలో పేద పిల్లలకు కనీస మౌలిక చదుపాయాలు కల్పించాలని దళిత, గిరిజన, బీసీ నేతలు ఏ నాడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన పాపన పోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా కులాల పేరుచెప్పి పదవులు అనుభవించడం తప్ప.. జాతి సంక్షేమం కోసం ప్రభుత్వంపై పోరాడిన నాయకులు కనిపించడం లేదని మండి పడుతున్నారు. స్టాకులో తేడాలు.. గురువారం విజిలెన్స్ డీఎస్పీ రజనీకుమారి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గుడ్లూరు, కొండపి, వెలిగండ్ల, దర్శి నియోజకవర్గంలోని కాకర్ల, కొత్తపట్నం మండలంలోని బాలుర, బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. వీటిలో కొన్ని చోట్ల ఆహార పదార్థాల స్టాక్‌లో తేడాలు గుర్తించారు. కొత్తపట్నం మండంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నూనె నిల్వలో కొంత తేడా గుర్తించగా, మెనూ సక్రమంగా అమలవుతుందని గుర్తించారు. మంచినీటి సమస్య అలానే ఉండటంపై వార్డెన్‌ను ప్రశ్నించారు. అదే విధంగా బాలికల వసతి గృహంలో మెనూతో పాటు రిజిస్టర్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు, వసతి గృహంలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు పెద్ద తేడా లేదని గుర్తించారు. గుడ్లూరు వసతి గృహంలో బియ్యం నిల్వలో తేడాను గమనించారు. -
సన్నబియ్యం నాణ్యతపై పరిశీలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలకు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అందిస్తున్న సన్నబియ్యం నాణ్యత పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న సన్నబియ్యంలో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బఫర్ గోదాముల్లో ఉన్న బియ్యం శాంపిళ్లను సేకరించి నాణ్యతను పరిక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఆ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు శాంపిళ్ల సేకరణ ప్రారంభించారు. రాష్ట్రం లోని 3,036 సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 5.39 లక్షల మంది, 34,319 ప్రభుత్వ పాఠశాలల్లోని 29,86,010 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి సన్నబియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం పౌరసరఫరాల శాఖ నెలకు 14 వే ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. దీంతో పాటే స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లు, అనాథ శరణాలయాలను కలిపితే ఏటా రూ.642 కోట్లతో 1.92 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇప్పటికే రెండుమార్లు తనిఖీలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం జిల్లాకు నాలుగైదు హాస్టళ్ల చొప్పున 50 చోట్ల తనిఖీలు చేశా రు. ఎక్కడా బియ్యం నాణ్యతలో తేడాలు కాన రాలేదు. అయితే సన్నబియ్యంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేయడంతో దీనిపై స్పందించిన మంత్రి ఈటల అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని రూఢీ చేసేందుకు జిల్లాల్లోని బఫర్ గోదాముల్లో ఉన్న సన్నబియ్యం నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల మేనేజర్లకు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగా తెలిసింది.